ఇక ..ఆన్‌లైన్ లో ఇంటి అనుమతులు | house permissions in the internet | Sakshi
Sakshi News home page

ఇక ..ఆన్‌లైన్ లో ఇంటి అనుమతులు

Published Tue, Sep 9 2014 12:53 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

house permissions in the internet

సాక్షి, ఒంగోలు: భారీ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపటి ్ట... కొంతమేర కట్టడానికే అనుమతులు తెచ్చుకున్నారా..? విశాలమైన ఇంటికి కొద్ది ప్లింత్ ఏరియా చూపెట్టి పన్నులు వేయించుకున్నారా..? అయితే, త్వరలోనే మీకో హెచ్చరిక నోటీసు అందనుంది. చేసిన తప్పునకు రెట్టింపు జరిమానా చెల్లింపుతోపాటు భవిష్యత్‌లో సదుపాయాల కల్పనపై మిమ్మల్ని ప్రభుత్వ అధికారులు ఓ కంటకనిపెడుతుంటారు.

అంతేకాదు, మీకు లాభం ఒనగూర్చేందుకు అవినీతికి పాల్పడి అక్రమాలకు బరితెగించిన ఉద్యోగుల భరతం పట్టేందుకు ‘జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం)’ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సిద్ధంగా ఉంది. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని 12 మున్సిపాల్టీల పరిధిలో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేయనుంది. ఇప్పటికే ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఈ విధానం అమలు కొలిక్కివస్తోంది. భవిష్యత్‌లో భవన నిర్మాణ అనుమతులతోపాటు ఇంటిపన్ను, మంచినీటి, పారిశుద్ధ్య పన్నులన్నింటినీ ఆన్‌లైన్‌లోనే జారీ చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుకోనున్నారు.

 ఒంగోలు నగరపాలకసంస్థ పరిధిలో...
 ప్రధానంగా ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని ఇళ్లు, వివిధ కట్టడాలకు సంబంధించి ప్లాన్ అనుమతులు, పన్ను విధింపులో కొందరు అవినీతి సిబ్బంది అవతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న రెవెన్యూ సిబ్బంది చేతివాటానికి జీఐఎస్‌తో చెక్ పడనుంది.  నగరపాలక సంస్థ పరిధిలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి పక్కా లెక్కలు తేల్చేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కమిషనర్, కార్యాలయ సిబ్బంది శిక్షణ కూడా తీసుకున్నారు.

‘రోల్టా’ పేరుతో ఉన్న ఓ ప్రయివేటు సాఫ్ట్‌వేర్ సంస్థ ద్వారా నగరంలో ఈ సర్వే కొనసాగుతూ ఉంది. అనంతరం జిల్లావ్యాప్తంగా ఉన్న మిగతా మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కూడా ఆస్తిపన్నుల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలకు ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టనుంది. తప్పుడు లెక్కలు, పన్నులు ఎగవేతకు కోతవేసి పక్కాలెక్కలతో ప్రభుత్వం ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విధానం పూర్తిగా అమలైతే, ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురంతోపాటు నూతనంగా ఏర్పడిన నగరపంచాయతీల్లో అదనంగా మరో 25-30 శాతం ఆదాయం పెరిగేందుకు జీఐఎస్ దోహదపడనుంది.  

 మాస్టర్‌ప్లాన్‌ల ప్రకారం ...
 జీఐఎస్ వ్యవస్థ కార్పొరేషన్‌లు, పురపాలకసంఘాల మాస్టర్‌ప్లాన్‌ల ప్రకారం ఉన్న ప్రాంతాలను నాలుగైదు పాయింట్లుగా విభజించి.. ఆయా ఏరియాల్లోని పూర్తిస్థాయి కట్టడాలు, నిర్మాణమవుతున్న వాటిని సర్వేచేసి రికార్డుచేస్తోంది. కట్టడాల విస్తీర్ణం కొలతలతో సహా నమోదుచేస్తోంది. సాధారణంగా అనుమతి పొంది నిర్మితమైన కట్టడం మున్సిపాల్టీ రికార్డుల్లో నమోదు కావాలి. ఆయా నిర్మాణాల కొలతల ప్రకారం పన్ను రిజిస్ట్రర్ (అస్సెస్‌మెంట్)గా రికార్డుల్లోకి ఎక్కిన తర్వాత ఆ భవనానికి రాజముద్ర లభించినట్లే.

 అయితే, అసలు కిరికిరి అంతా ఆరంభంలోనే చోటుచేసుకుంటుంది.  వాస్తవ నిర్మాణాల కొలతలను పక్కన బెట్టి రెవెన్యూ యంత్రాంగం కొలతల్లో మార్పుచేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనేది బహిరంగ రహస్యం. అయితే, తాజాగా అమలు చేయనున్న విధానం ద్వారా కార్యాయలంలోని కంప్యూటర్ నుంచే నగరం, పట్టణాల్లోని కట్టడాలు, వాటి రూపురేఖలను కొలతలతో సహా  గుర్తించవచ్చు. దీంతో ఎక్కడెక్కడ భవనాలు, సాధారణ నివాసాలు, వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్‌లు, కళాశాలలు, బహుళ అంతస్తులున్నాయనే సమాచారం బహిర్గతమవుతాయి. దీంతో పక్కాగా ఆస్తి లెక్కలు తేలే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement