‘రాజ’సం రాదాయే!
బేస్‌మెంట్‌కే ఐదేళ్లు.. గోపుర నిర్మాణానికి ఇంకెన్నేళ్లో?
నత్తనడకన రాజగోపుర నిర్మాణ పనులు
శ్రీకాళహస్తికే వన్నెతెచ్చే రాజగోపుర నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పునఃనిర్మాణ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడిచినా
ఇంతవరకు బేస్‌మెంట్ కూడా సక్రమంగా పూర్తికాలేదు. ఇక గోపుర నిర్మాణం పూర్తయ్యేది ఎన్నాళ్లకోనని భక్తులు నిట్టూర్చుతున్నారు.
శ్రీకాళహస్తి : పరమశివున్ని దర్శించుకోవడానికి ముందు ఆరుగురిని దర్శించుకోవాలని పురాణాలు ఘోషిస్తున్నట్లు వేదపండితులు చెబుతున్నారు. శివున్ని దర్శించుకునే ముందు గోపురం, శిఖరం, ఆలయ ద్వారం, ప్రాకారం, బలిపీఠం, అర్చకుడిని దర్శించుకోవాలని సూచిస్తారు. దీనికి సంబంధించి గోపురే, శిఖరే, ద్వారే, ప్రాకారే, బలిపీఠకే, అర్చకే, మూలలింగేచ సప్తయితే శివదర్శనం అనే స్తోత్రాన్నీ వారు భక్తులకు వినిపిస్తుంటారు. అలాంటి గాలిగోపురం శ్రీకాళహస్తిలో కరువయ్యింది. దేవదేవుని చెంత గోపురంలేక పలువురు భక్తులు చింతిస్తున్నారు. తమకు మోక్షం కలగుతుందోలేదోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బేస్‌మెంట్‌కే ఐదేళ్లు
శ్రీకాళహస్తికే తలమానికంగా ఉన్న రాజగోపురం 2010 మే 26వ తేదీన కూప్ప కూలిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి మూడు నెలల తర్వాత ఆగస్టు 29వ తేదీన గాలిగోపురాన్ని తిరిగి నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు గోపుర నిర్మాణ పనులు పూర్తిచేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ గోపుర నిర్మాణ పనులు బేసిమెంట్‌కే పరమితమయ్యాయి.
నత్తనడకన పనులు
గోపురాన్ని నిర్మించేందుకు నవయుగ కన్‌స్ట్రక్షన్స్ ముందుకొచ్చింది. రూ.46 కోట్ల వ్యయంతో గోపుర నిర్మాణాన్ని 16 నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కానీ నిర్మాణానికి స్థల సమస్యతోపాటు అనేక ఆటంకాలు ఎదురు కావడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.