నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వ ఆధునికీకరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీశారు. ప్రపంచబ్యాంకు నిధులతో జరుగుతున్న ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనివల్ల శివారు భూములకు నీరు అందడం లేదని నిలదీశారు. అసెంబ్లీలో నాలుగు రోజులుగా జరిగిన చర్చల్లో జిల్లా ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించారు.
మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై అద్దంకి, సంతనూతలపాడు, కందుకూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్‌ఎస్‌పీ ఆధునికీకరణ పనుల భౌతిక, ఆర్థిక పరిస్థితిపై నివేదిక కావాలని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ వేసిన ప్రశ్నపై చర్చ జరిగింది. మెయిన్ కాల్వ పనులు 80 శాతం, బ్రాంచి కాల్వల పనులు 47 శాతం, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పనులు 40 శాతం జరిగాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సుమారు 20 పేజీల సమాధానమిచ్చారు.
అంకెలన్నీ వాస్తవ విరుద్ధం
గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 0- 18 మైలురాయి వరకూ లైనింగ్ చేయాలని ప్రతిపాదించగా అందులో ఒక్క పైసా పని కూడా ప్రారంభం కాలేదు. జిల్లా పరిధిలో నాలుగు కిలోమీటర్ల మేర లైనింగ్‌కు ప్రతిపాదిస్తే అందులో 59.36 శాతం పూర్తయినట్లు ప్రభుత్వ నివేదికలో ఉందని, వాస్తవానికి 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారుల లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గం విషయానికి వస్తే 18 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉంటే అందులో సగటున 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
అధికారులు ఇచ్చిన లెక్కల్లోనే 2.6 శాతం, ఏడు శాతం, 36 శాతం అని ఉన్నాయి. అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారనడానికి ఈ ఉదాహరణలు. 2008లో లైనింగ్ పనులు చేస్తామని ప్రకటించినపుడు వేలాది మంది రైతులు గుప్పెడు మెతుకులు తినవచ్చని ఆశపడ్డారు, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంది. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై ఏ చర్యలు తీసుకుంటున్నారు.
మంత్రి దేవినేని ఉమా సమాధానమిస్తూ పనుల జాప్యంపై నోటీసులు ఇచ్చాం అని సమాధానమివ్వడంతో ఏడేళ్ల నుంచి పనులు చేయని ఏజెన్సీలను మార్చే ఆలోచన ఎందుకు చేయడం లేదని రవికుమార్ ప్రశ్నించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పనులు తాము చేయకుండా, అనుభవం, అర్హతలేని సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల కాల్వల వ్యవస్థ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నాటికి ఈ పనులు ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలను కాపాడేందుకు అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని రవికుమార్ విమర్శించారు.
ప్రపంచబ్యాంకు నిబంధనల ప్రకారం వాటర్ రీడింగ్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇప్పటికీ అవి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎక్కడ ఎంత నీరు వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. 30 ఏళ్లక్రితం కట్టిన సింగిల్‌లైన్ బ్రిడ్జిలను మార్చాల్సి ఉన్నా ఇంతవరకూ ఆ పనులు మొదలు పెట్టకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రవికుమార్ చెప్పారు. షటర్లు కూడా సక్రమంగా లేకపోవడంతో ఎవరికి అవసరం ఉంటే వారు వాటిని పీకేస్తున్నారని, దీనిపై నియంత్రణ లేదన్నారు. ఈ పనులు సక్రమంగా అందించేందుకుగాను అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, రైతుసంఘాల నాయకులతో కమిటీ వేయాలని రవికుమార్ సూచించారు.
ఆధునికీకరణ పనులకు ఎంత ఖర్చుపెట్టారు?
ఆదిమూలపు సురేష్ : ఇప్పటి వరకూ ఎన్‌ఎస్‌పీ ఆధునికీకరణకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఏ మేరకు పనులు పూర్తయ్యాయి? పనులు జరగకపోతే ప్రపంచబ్యాంకు నుంచి రావల్సిన నిధులకు గండిపడే ప్రమాదం ఉంది? ఇందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు?
భారీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని: మొత్తం 2639 కోట్ల రూపాయల విలువైన ఈ పనులకు 48 శాతం ప్రపంచ బ్యాంకు, 52 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకూ 801 కోట్లు అంటే 28.6 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు జరగకపోతే 2016 నాటికి ప్రపంచబ్యాంకు నుంచి రావాల్సిన రూ.1359 కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది. అసలు కాల్వల పనులను పరిశీలించేందుకు తగిన యంత్రాంగం లేదు. అధికారుల నుంచి లస్కర్ల వరకూ అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరత ఉంది.
ఎన్ని టీఎంసీల నీరు ఆదా అవుతుంది
కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు: ప్రస్తుతం జరుగుతున్న ఎన్‌ఎస్‌పీ ఆధునికీకరణ పనులు పూర్తయితే ఎన్ని టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఎన్‌ఎస్‌పీ పేజ్ -2 పనులు ప్రారంభించే అవకాశం ఉందా. ఈ పనులు పూర్తి స్థాయిలో జరిగితే మూడు జిల్లాల రైతాంగానికి లబ్థి చేకూరుతుంది. అందువల్ల ఈ పనులపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.
మంత్రి దేవినేని ఉమా : సాగర్ పనులు పూర్తి స్థాయిలో చేయడం కోసం అధికారులతో సమీక్షిస్తాను. రెండు రోజుల తర్వాత స్వయంగా వచ్చి కాల్వల్లో జరిగిన పనులను పరిశీలిస్తా. 2016 నాటికి పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటా. స్పీకర్ కోడేల శివప్రసాద్ చర్చలో జోక్యం చేసుకొని ఈ పనుల ఆవశ్యకతను వివరిస్తూ పూర్తి దృష్టి పెట్టాలి.
సా...గరం గరం
Published Wed, Dec 24 2014 2:39 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement