పోలవరం పంపకాలు ఎలా?
* రాష్ట్ర విభజన నేపథ్యంలో తెరపైకి మరో నీటి వివాదం!
* పోలవరం నుంచి 80 టీఎంసీలను కృష్ణాలోకి తరలించాలి
* ఈ 80లో 45 టీఎంసీలు మన రాష్ర్ట అవసరాలకు
* ఈ 45 టీఎంసీల పంపకం చేపట్టేది ఎలా?
* నీటి కోసం మూడు ప్రాంతాల్లో డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో నీటి పంపకానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌లోకి తీసుకువచ్చే 80 టీఎంసీల నీటిలో మనరాష్ర్టం వాడుకునే నీటి కోటాపై ఈ వివాదం తలెత్తనుంది. ఈ నీటిపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఆధారపడి ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ 80 టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాలు (మహారాష్ట్ర, కర్ణాటక) వాడుకునే కోటా విషయంలో స్పష్టత ఉన్నా... మన రాష్ర్ట విభజన నేపథ్యంలో ఈ నీటిని కూడా పంచాల్సిన అవసరం ఉంది.
గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను కూడా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి అందించనున్నారు. అలాగే విశాఖపట్టణం అవసరాలకు 23 టీఎంసీలను సరఫరా చేయనున్నారు. 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వీటన్నింటితోపాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించనున్నారు.
ఈ 80 టీఎంసీల నీటిలో మన రాష్ట్ర అవసరాలకు 45 టీఎంసీలు, ఎగువన ఉన్న కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలను కేటాయించారు. పోలవరం పూర్తయిన తర్వాత గోదావరి నది నీటిని కృష్ణాలోకి తరలించిన తర్వాత ఈ నీటి పంపకాలు అమల్లోకి రానున్నాయి. అంటే కృష్ణా దిగువ భాగంలో గోదావరి నుంచి వచ్చే 80 టీఎంసీలను మనరాష్ట్రం వాడుకుంటే.. ఎగువ ప్రాంతంలోని కృష్ణా నీటిలో ఆ రెండు రాష్ట్రాలు అదనంగా 35 టీఎంసీలను ఉపయోగించుకుంటాయి. దాంతో దిగువకు వచ్చే 35 టీఎంసీలు తగ్గిపోతాయి.
నాడు ఎలాంటి ప్రాజెక్టులు లేవు..
మన రాష్ట్రానికి కేటాయించిన 45 టీఎంసీల వాడకంపైనే ప్రస్తుతం కొంత గందరగోళం నెలకొంది. రాష్ర్ట విభజన అంశం తెరపైకి రావడంతో ఈ నీటి పంపకం ఎలా అన్న విషయం అధికారులకు అర్థం కావడం లేదు. అయితే ఈ నీటి వాడకానికి సంబంధించి గతంలో ఒక అవగాహన కుదిరింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 1985లో దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు.
పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌లోకి వచ్చే 45 టీఎంసీల నీటిలో 30 టీఎంసీలను ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు, మిగిలిన 15 టీఎంసీల నీటిని తెలుగుగంగకు ఉపయోగించాలనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితి వేరు. కృష్ణా బేసిన్‌లో వరద నీటి ఆధారంగా పలు కొత్త ప్రాజెక్టులను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. అందులో ముఖ్యంగా నెట్టెంపాడు, కల్వకుర్తి, వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా వంటివి ఉన్నాయి.
ఎస్‌ఎల్‌బీసీ, తెలుగుగంగతో పాటు ఈ ప్రాజెక్టులకు కూడా నికర జల కేటాయింపు లేదు. ఇవి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ దశలో రాష్ర్ట విభజన జరిగితే ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు ఇబ్బందిగా మారనుంది. దాంతో పోలవరం నుంచి మన రాష్ర్ట వాటాగా వచ్చే 45 టీఎంసీల కోసం ఈ ప్రాజెక్టుల ప్రాంతాల వారు కూడా పట్టుపట్టే అవకాశం ఉంది. 1985లో ఈ ప్రాజెక్టులు నిర్మాణంలో లేవు కాబట్టి వాటికి నీటి కోటా కోసం ఎలాంటి ప్రస్తావన రాలేదు.
అయితే ప్రస్తుతం వాటి భవిష్యత్తుపై ఆందోళన నెలకొని ఉంది. దాంతో పాటు కొత్త ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్రానికి వచ్చే నీటి కోటా తగ్గిపోనుంది. అలాగే సాగర్, కృష్ణా డెల్టా ప్రాంతానికి కూడా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం నీటి కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రైతులు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది.