ఆర్డినెన్స్‌పై ఆగ్రహం | Bill on Polavaram project passed in LS amid protests | Sakshi
Sakshi News home page

ఆర్డినెన్స్‌పై ఆగ్రహం

Published Sat, Jul 12 2014 2:39 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Bill on Polavaram project passed in LS amid protests

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అనుకున్నదే అయింది... లక్షలాది మంది ఆదివాసీ గిరిజనుల మనోభావాలను బేఖాతరు చేస్తూ పోలవరం ముంపు కింద జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రాంత ఎంపీల అభ్యంతరాల నడుమ మూజువాణీ ఓటుతో ఆమోదం పొందిన ఈ ఆర్డినెన్స్‌పై జిల్లా వాసులు భగ్గుమంటున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజా, ఆదివాసీ సంఘాలు ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి.

బీజేపీ, టీడీపీ మినహా వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో పాటు టీజేఏసీ, ఇతర ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాలు ఈ బంద్‌కు మద్దతిచ్చాయి. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేయాలని  ఆదివాసీ సంఘాలు నిర్ణయించాయి. భద్రాచలంలో కలెక్టర్‌ను అడ్డుకున్న ప్రజాసంఘాలు కూడా ఈ ఉద్యమాలకు సంఘీభావంగా నిలవనున్నాయి. కాగా, ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రకటించిన విధంగా ఈనెల 14న ఢిల్లీలో ఆందోళన నిర్వహించేందుకు టీజేఏసీ నేతలు శుక్రవారం రాత్రే బయలుదేరి వెళ్లారు.

 ఏడు మండలాలు అటే..!
 ఆర్డినెన్స్‌కు లోక్‌సభ ఆమోదంతో జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 324 రెవెన్యూ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోకి  వెళ్లనున్నాయి. పోలవరం ముంపునకు పూర్తిగా గురయ్యే వి.ఆర్.పురం, కుక్కునూరు, కూనవరం, వేలేరుపాడు మండలాలతో పాటు పాక్షికంగా ముంపునకు గురికానున్న చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు కూడా ఆంధ్రలోకే వెళతాయి. భద్రాచలం మండలంలోని భద్రాచలం పట్టణం, బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలు మాత్రమే తెలంగాణలో ఉంటాయి. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి ఆరు లేదా ఏడు మండలాలు తగ్గనున్నాయి.

 కోర్టుతీర్పు పైనే ఆశలు...
 ఆర్డినెన్స్‌కు వ్యతిరే కంగా న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం ఆదివాసీల్లో కొంత ఆశ కలిగిస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రాల సరిహద్దు మార్పునకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి సిఫారసు లేకుండా, ఇరు రాష్ట్రాల అసెంబ్లీల అభిప్రాయం లేకుండా పార్లమెంటులో పెట్టడం సాధ్యం కాదని తెలంగాణ వాదులంటున్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో వచ్చే వారంలో పిటిషన్ దాఖలు కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేవలం కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే ఒకే ఒక్క ఆశ ఆదివాసీలకు మిగలనుంది.

 వేగం పెంచనున్న ఆంధ్ర ప్రభుత్వం..
 ఆర్డినెన్స్ నేపథ్యంలో ముంపు మండలాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లోకి కలుపుకునే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేయనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం, ప్రజల సహకారం లేనిదే అది సాధ్యపడేది కాదని అధికార వర్గాలంటున్నాయి. సాంకేతికంగా ఇప్పటికే ఆ మండలాలు ఆంధ్రలో ఉన్నా... పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన సాగించడానికి రెండు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

 ఎన్నికలేమవుతాయో?
 ముంపు ఆర్డినెన్స్‌కు లోక్‌సభ ఆమోదం కూడా లభించిన నేపథ్యంలో జిల్లాలో జడ్పీ చైర్మన్, ఎంపీపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ మరింత సంక్లిష్టంలో పడినట్టయింది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టు స్టే విధించింది. జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళుతున్న నేపథ్యంలో ఏకంగా రిజర్వేషన్లు మార్చివేయాలని కొందరు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. దీనిపై తుది తీర్పు ఇంకా రాలేదు. ఈ లోపే ఆర్డినెన్స్‌కు లోక్‌సభ ఆమోదం తెలపడంతో ఈ అంశం మరింత రసకందాయంలో పడింది.

 ఈ సమస్యలెలా తీరుస్తారు... బాబూ!
 ముంపు మండలాల కింద భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం మరిన్ని సమస్యలకు దారితీస్తోంది. ప్రస్తుత పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్రామాలను కలిపితే దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో ఉన్న సీతాకుటీరానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఎందుకంటే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లాలంటే మధ్యలో ఆంధ్రగ్రామాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే  భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన 1200 ఎకరాల భూములు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లే పురుషోత్తమపట్నం, చోడవరం గ్రామాల్లో ఉన్నాయి.

ఈ భూముల ద్వారా ఆలయానికి ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. మరి ఇప్పుడు ఈ భూముల పరిస్థితి ఏంటనేది అంతుపట్టడం లేదు. మరో ముఖ్య సమస్య ఏమిటంటే గోదావరి వరదల సమయంలో దాదాపు మూడు నెలల పాటు చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోతా యి. అప్పుడు ఆ మండలాలకు వెళ్లాలంటే  తెలంగాణ నుంచే రాకపోకలు జరపాల్సి ఉంటుంది. మరి, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారా? లేక ఎప్పటికీ అపరిష్కృతంగానే మిగుల్చుతారా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement