‘పోలవరం’ మీద ఎందుకు సమరం?
అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా ఇప్పటికే తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున సిరిసంపదలు కోల్పోతున్నారు. విభజన అనివార్యమైనందున పరస్పరం ప్రాంతీయాభివృద్ధికీ, తెలుగు జాతి సౌభాగ్య సాధనకీ సుహృద్భావ ధోరణితో నేతలు వ్యవహరించాలి.
తెలుగు ప్రజల జీవన రేఖ పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆలోచన దశాబ్దాల నాటిది. అయినా ఇంతకాలం ఆలస్యం కావ డం దురదృష్టం. ఇప్పుడు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం, కేంద్రం ఇచ్చిన హామీ లు, కొత్త ప్రభుత్వం ఈ హామీలను గౌరవించడం వంటి అంశాలు చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రెండు రాష్ట్రాలను సౌభాగ్యవంతం చేయగల బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా, గోదావరీ జలా ల వినియోగం ప్రధాన అంశంగా అది ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర నేతలు ఆమోదించినట్లేనని రాష్ట్ర విభజన బిల్లులోని 91వ క్లాజులో స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ ఆరంభించిన జలయజ్ఞంలో భాగమే పోలవరం నిర్మాణం. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఆలోచన ప్రకారం గోదావరి జల బోర్డు తెలంగాణలో, కృష్ణా రివర్ బోర్డు సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 2014 చర్చ ముగింపు సందర్భంగా రాజ్యసభలో ప్రకటించిన ఆరు సూత్రాల అభివృద్ధి ప్యాకేజీలో, నాలుగవ సూత్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన హామీ ఉంది.
పోలవరం ప్రాజెక్టు పరిధిలో పూర్తి స్థాయిలో పునరావాస, పునరాశ్రయ చర్యలు సంపూర్ణంగా చేపట్టి, అవసరమైతే మరిన్ని సవరణలు చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేం ద్ర ప్రభుత్వమే చేపడుతుందని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రధాని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ ఫిబ్రవరి నెలాఖరులో, ప్రధాని ఇచ్చిన హామీలను ఉదహరిస్తూ ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గ్రామాలలో ఈ ప్రాజె క్టు కారణంగా సంభవించనున్న ముంపు సమస్యను పరిష్కరిం చవలసి ఉందని, రూ.600 కోట్లు వినియోగించి ముంపు నివారణకు అడ్డుగోడ నిర్మించటానికి సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులు తామే భరిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. ఇంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధనను మాత్రమే ఎజెండాగా చేసుకొన్న రాజకీయ పార్టీలకు ఒక కొత్త సమస్య ఆదిలోనే ఎదురవుతోంది. పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలో గ్రామాలు సీమాంధ్రలో కలపవద్దన్న డిమాండ్ ఆరంభమైంది. ఇది వివాదాస్పదం కాకతప్పదు. భద్రాచలం మినహా ఏడు మండలాలను సీమాంధ్రలో కలపటానికి ఆర్డినెన్స్ తెస్తామం టూ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చేసిన ప్రకటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడమే ఇందుకు నిదర్శనం. తొలుత, పోల వరం ముంపు కింద 134 గ్రామాలే సీమాంధ్రకు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఏడు మండలాలను చేర్చటం అప్రజాస్వామికమని న్యాయపోరాటం చేస్తామంటున్నారు. తెలంగాణ ఐకాస, భాజపా, కాంగ్రెస్ నేతలలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కొండరెడ్లు, గుత్తి కోయలు వంటి ఆదివాసీల గ్రామాలను, పోలవరం కోసం ముంచి వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటినుంచో ఖమ్మం, భద్రాచలం, చింతూరు, కూనవరం ప్రాంత ఆదివాసీ సంక్షేమ, విద్యార్థి యువజన, పౌరహక్కుల సంఘాలు, వామపక్షాలు ప్రతిఘటిస్తున్నాయి. లక్షలాది ఆదివాసీలు తమ ఇళ్లు, భూములు జీవనోపాధి కోల్పోయి జీవన సంక్షోభంలో చిక్కుకొంటారని, కాబట్టి ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్ నిలిచిపోవటం హర్షణీయమని, ఇప్పుడు తెలంగాణలోని 137 గ్రామాలను మాత్రమే ప్రాజెక్టు పరిధిలో చూపిం చారని గిరిజనులను పునాదులుగా చేసుకొని ప్రాజెక్టు కట్టవద్దని, తెరాస అగ్రనేత కేసీఆర్ ఇప్పటికే హెచ్చరించారు.
గోదావరి జలాల సద్వినియోగానికి పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు, తెలుగు రాష్ట్రాలు రెండూ కొనసాగించవలసినదే. 1942లో ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు 2014లో కూడా నిర్మాణ దశలో బాలారిష్టాలను ఎదుర్కొంటుండటం తెలుగువారి దౌర్భాగ్యం. ప్రాజెక్టు డిజైన్ సరిచేయాలని, ఎత్తు తగ్గించి ముంపు నివారించాలని ప్రస్తుతం వాదన బలంగా వినపడుతోంది. సీమాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో అపారమైన సహజవాయువు, ఖనిజ సంపదలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా ఇప్పటికే తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున సిరిసంపదలు కోల్పోతున్నారు. విభజన అనివార్యమైనందున పరస్పర ప్రాంతీయాభివృద్ధి, తెలుగుజాతి సౌభాగ్య సాధనలో సుహృద్భావ ధోరణులతో నేతలు వ్యవహరించాలి. లేని పక్షంలో రెండు ప్రాంతాలు నష్టపోతాయి.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
జయసూర్య