అయినా వారు మారలేదు...
అటు ఏపీలో, ఇటు తెలంగాణలో పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ విషయానికొస్తే వివిధపార్టీల నుంచి అధికారపార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేచింది. ఆయా పార్టీల నుంచి పలువురి ఎమ్మెల్యేల చేరిక పూర్వాపరాలు, ప్రస్తుత పరిస్థితిపైన చర్చ జరుగుతోంది. ఒకపార్టీలో చేరి కొన్నేళ్ల పాటు అందులోనే ఎదిగి అనేక పదవులను అలంకరించాక మరో పార్టీలో చేరి అక్కడి పరిస్థితికి అడ్జస్ట్ కావడం కొందరికి కష్టమవుతోందట. దీనితో ఎక్కడికెళ్లినా గతంలో తమతో పాటు ఉండి పార్టీ మారినపుడు కూడా తమ వెంటే ఉన్నవారితోనే వారు వెళుతున్నారట.
కొత్తపార్టీలో చేరినా ఆ పార్టీలో ఉన్న పాత నాయకులతో ముఖ్యంగా ఎమ్మెల్యేలతో మమేకం కాలేకపోతున్నారట. అందువల్లే పాతపార్టీ బృందాలకే పరిమితమై అన్నిచోట్ల కనిపిస్తున్నారట. ఇటీవల ముగిసిన అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కూడా ఏ పార్టీ నుంచి వచ్చిన వారు ఆ పార్టీ బృందంతో విడిగా తిరగడాన్ని రాజకీయనాయకులు ప్రస్తావిస్తున్నారు.ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అన్న నానుడి ఇక్కడి రాజకీయాలకు మాత్రం ఎందుకో సరిపోవడం లేదని ఇతర పార్టీల నాయకులు ముక్తాయింపునిస్తున్నారు...