అసంపూర్ణంగా నిలిచిన హుద్‌హుద్ గృహ నిర్మాణాలు
2014 అక్టోబర్ 12... విశాఖ నగరాన్ని విశోక నగరంగా మార్చేస్తూ హుద్ హుద్ ప్రళయం విరుచుకు పడిన రోజది. ఆ విపత్తులో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం కొమ్మాది, పరదేశిపాలెం ప్రాంతాల్లో 800 ఇళ్లను జీ ప్లస్ 3 విధానంలో నిర్మించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. ఆలస్యంగా మూడేళ్ల కిందట మొదలుపెట్టిన ఆ ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. బాధితులు నెత్తీనోరు కొట్టుకున్నా టీడీపీ హయాంలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన అధికారులు ఆయా పనుల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మార్చిలోగా కచ్చితంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎప్పుడో ఎందుకు... సరిగ్గా నిన్న కాక మొన్న నగరంలో మకాం వేసిన టీడీపీ అధినేత, మాజీ సీఎం .చంద్రబాబునాయుడు చెప్పిన కబుర్లను ఒక్కసారి పరిశీలిద్దాం. విశాఖ నగరానికి గత టీడీపీ సర్కారు ఎంతో చేసిందని, సిటీకి బ్రాండ్ ఇమేజ్ తెచ్చేసిందని.. ఇంకా చాలా చాలా చెప్పుకున్నారు. సరే బాబు ’కళ్లార్పకుండా’ చెప్పినవన్నీ లెక్క చూస్తే ఎవరికైనా కళ్లు తిరిగిపోవాలి. ఒకే ఒక్క విషయంలో చూద్దాం. పేద ప్రజల కోసం ఇచ్చిన హామీ ఏ మేరకు అందిందో పరిశీలిద్దాం. సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజుల్లో హుద్ హుద్ తుపాను సృష్టించిన విధ్వంసం నష్టానికి పరిహారం ఎంతవరకు అందిందో ఒకసారి పరిశీలిద్దాం.
2014 అక్టోబర్ 12వ తేదీన హుద్‌హుద్ దెబ్బకు విశాఖ నగరంలో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. సర్వం కోల్పోయిన బాధితులకు ఇళ్లు నిర్మిస్తామంటూ నాటి విపక్షాల డిమాండ్, ఆందోళనల ఫలితంగా అప్పటి పాలకులు ఎట్టకేలకు ముందుకు వచ్చారు. కొమ్మాదిలోని సర్వే నెంబర్ 83లో 608 ఇళ్లను, పరదేశిపాలెంలోని సర్వే నెంబర్ 21లో 192 ఇళ్లను మొత్తంగా 800 ఇళ్లను నిర్మించాలని నాటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. అయితే శరవేగంగా మాత్రం చర్యలు చేపట్టలేదు. లబ్ధిదారులు, విపక్షాల డిమాండ్లతో ఎట్టకేలకు 2016లో మొదలుపెట్టిన ఆ ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. విచిత్రమేమింటే హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు తీసుకున్న సంస్థ విశాఖ నగరంలోనే మరో నాలుగుచోట్ల చేపట్టిన ఇళ్ల నిర్మాణం కాలపరిమి తిలోనే పూర్తి చేసింది. కానీ పేదల గూడు కోసం చేపట్టిన హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణం మాత్రం అటకెక్కించేశారంటేనే నాటి పాలకులు ఏ మాత్రం శ్రద్ధ చూపించారో అర్ధం చేసుకోవచ్చు.
నాటి ఇళ్ల పనులకు తాజాగా టెండర్లు
పేదల గూడులో నాటి టీడీపీ సర్కారు అంతులేని నిర్లక్ష్యం వహించగా.. తాజాగా వైఎస్సార్ ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టిన పాలకులు ఆయా పనుల కోసం రూ.8,53,50387 వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు.
కొమ్మాదిలోని సర్వే నెంబర్ 83లో 608 ఇళ్లు, పరదేశిపాలెంలోని సర్వే నెంబర్ 21లో 192 ఇళ్లు మొత్తంగా 800 మిగిలిపోయిన ఇళ్ల పనుల కోసం ఈనెలాఖరులోగా టెండర్లను ఖరారు చేయనున్నారు. జీ ప్లస్ 3 విధానంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల పనుల నిర్మాణానికి యూనిట్ వ్యయం రూ.1,06,687 అవుతుందని లెక్క తేల్చారు.
మార్చి నాటికి పూర్తి చేస్తాం:గృహ నిర్మాణ సంస్థ పీడీ సి.జయరామాచారి
హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసే క్రమంలో ఈనెలాఖరులోగా టెండర్లను ఖరారు చేస్తామని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.జయరామాచారి వెల్లడించారు. టెండర్లు ఖరారు కాగానే పనులు చేపట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2020 మార్చిలోగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment