ఆదుకోండి ప్లీజ్
సాక్షి, విశాఖపట్నం: ‘హుదూద్ తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. నాలుగు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తీరం దాటిన చోటైన విశాఖ నగరం అతలాకుతలమైంది. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాలకు అపార నష్టం జరిగింది. ముందస్తు చర్యలు తీసుకోవడం వలన ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం.. రాష్ర్ట యంత్రాంగమంతా స మిష్టిగా కృషి చేయడం వల్ల కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వ్యవస్థలన్నీ పునరుద్ధరించగలిగాం.
విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ లోటుబడ్జెట్‌లో ఉంది..జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చేందుకు కానీ..నగరం పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు కానీ కేంద్రమే ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది’ అని కేంద్ర బృందానికి హుదూద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి భారీ ప్యాకేజీ ఇచ్చే విధంగా చూడాలని కోరారు. హుదూద్ తుఫాన్ నష్టాలపై అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన ప్రత్యేక ఉన్నతస్థాయి అధికారుల బృందం ఉత్తరాంధ్ర పర్యటనకు శ్రీకారం చుట్టింది.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఈ బృందం తొలుత ఎయిర్‌పోర్టుకుజరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ డెరైక్టర్ పట్టాభి ఎయిర్‌పోర్టు టెర్మినల్ తుఫాన్ వల్ల ఏ విధంగా దెబ్బతిన్నదో వివరించారు. నాటి విధ్వంస దృశ్యాలను బృందం పరిశీలించింది. అనంతరం నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని తుఫాన్ నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటోఎగ్జిబిషన్‌ను తిలకించారు. కలెక్టరేట్‌లో తుఫాన్ నష్టాలపై ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఈసందర్భంగా తుఫాన్‌కు ముందు తీసుకున్న చర్యలు..ఆ తర్వాత చేపట్టిన సహాయ, పునరావాస చర్యల కోసం లోతైన పరిశీలన చేశారు.
వారం రోజుల్లోనే పునరుద్దరించగలిగాం
జిల్లా కలక్టర్ యువరాజ్ మాట్లాడుతూ వల్ల రూ.65వేల కోట్లకు పైగా నష్టంవాటిల్లిందని రూ.21వేల కోట్ల సాయమైనా అందించకపోతే కోలుకోవడం కష్టమని వివరించారు. పారిశ్రామికంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రైతులను ఆదుకునేందుకు తక్షణ సాయంకింద రూ.4వేల కోట్లు ఇవ్వాలనికోరారు. ఇంత పెద్ద విపత్తుసమయంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకున్నచర్యలు వివరించాలని కేంద్రబృందం సభ్యులు కోరగా, తుఫాన్ అనంతరం భారీ వర్షాలు కురవకపోవడంతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం వలన అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టగలిగామని కలెక్టర్లు వివరించారు.
వారం రోజుల్లోనే విద్యుత్‌ను పునరుద్దరించగలిగామని ఏపీఈపీడీసీఎల్ సీఎండి శేషగిరిబాబు వివరించారు. తుఫాన్ వల్ల ఎక్కువగా నష్టపోయింది జీవీఎంసీయేనని..90వేల విద్యుత్ దీపాలు, లక్షలాది చెట్లు ధ్వంసమవడంతో పాటు మంచినీటి వనరులు కూడా దెబ్బతిన్నాయని జీవీఎంసీ కమిషనర్ జా నకీ వివరించారు. 2.20లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఉత్తరాంధ్రలో ఉన్నవారంతా సన్న,చిన్నకారు రైతులేనని, వార్ని వెంటనే ఆదుకోకపోతే కోలుకోలేరని వ్యవసాయశాఖ కమిషనర్ మదుసూదన రావు అన్నారు.
తమ జిల్లాల్లో జరిగి న నష్టాలను విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా కలెక్ట ర్లు ఎంఎం నాయక్, సౌరబ్‌గౌర్, నీతూకుమారి ప్రసాద్‌లు వివరించా రు. రాష్ర్ట ప్రభుత్వం తరపున సమర్పించిన నివేదిక పట్ల బృందం సభ్యు లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పునరుద్దరణకు ఎంతఖర్చు పెట్టారు. ఆ నిధులనుఏ విధంగా సమీకరించారో చెప్పాలని సూచించా రు. దీనిపై కలెక్టర్లు సమాధానం చెప్పకపోవడంతో మూడురోజుల్లో సమగ్రనివేదిక ఇవ్వాలని ఆదేశించారు.