
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అల్లివలసలో దెబ్బతిన్న బోట్లను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
* కేంద్ర బృందంపై తూర్పుగోదావరి జిల్లా హుద్‌హుద్ బాధితుల పెదవివిరుపు
* శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరోజు పర్యటనే
సాక్షి ప్రతినిధి, కాకినాడ/శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను నష్టాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాలు గురువారం తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. తమ బాధలు వినకుండానే అధికారులు వెళ్లిపోయారని తూర్పుగోదావరి జిల్లాలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కె.కె.పాఠక్, జాతీయ రహదారులశాఖ కార్యదర్శి ఎస్‌ఈ ఆర్.పి.సింగ్, కేంద్ర తాగునీరు, శానిటేషన్ శాఖకన్సల్టెంట్ పి.శ్రీవాత్సవ, కేంద్ర విద్యుత్‌శాఖ డెరైక్టర్ వివేక్ గోయల్, రాష్ట్ర వ్యవసాయశాఖ డెరైక్టర్ ఎస్.ఎం.కొలహత్ కౌర్‌ల బృందం తూర్పు గోదావరి జిల్లా తీరప్రాంతంలోని కొత్తపల్లి, తొండంగి, తుని రూరల్ మండలాల్లో పర్యటించింది. ఉప్పాడ వద్ద కోసుకుపోయిన బీచ్ రోడ్డు, సముద్రపు నీరు వచ్చి దెబ్బతిన్న పంట పొలాలు, దెబ్బతిన్న ధాన్యం, కోనపాపపేటలో సముద్ర కోతకు గురైన ప్రాంతాలను పరిశీలించింది.
తుపాను సమయంలో సుమారు 60 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. తమ గోడు వెళ్లబోసుకుందామని ఆశగా ఎదురుచూసిన బాధితులు తమను పలకరించకుండానే కేంద్ర బృంద సభ్యులు వెళ్లిపోవడంతో నిరాశచెందారు. తొండంగి, తుని మండలాల పరిధిలోని శృంగవృక్షం, తేటగుంట, పొలిమేరు గ్రామాలను, దెబ్బతిన్న అరటి, పామాయిల్ తోటలను పరిశీలించిన అధికారులు తుని తాండవ అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ తుపానుతో జిల్లాలో రూ.507.78 కోట్ల నష్టం సంభవించిందని జిల్లా అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ నీతూప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తదితరులు ఈ బృందం వెంట ఉన్నారు.
విశాఖ జిల్లా ఎస్.రాయవరం, రాంబిల్లి, మునగపాక మండలాల్లో కొబ్బరి, జీడిమామిడి, వరి పంటలతో పాటు పౌల్ట్రీ పరిశ్రమకు వాటిల్లిన నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. ట్రాన్స్‌కోకు జరిగిన నష్టాలను సంస్థ డెరైక్టర్ ఎస్.సుబ్రహ్మణ్యం, సీఈ కె.ప్రవీణ్‌కుమార్ వారికి వివరించారు. అనకాపల్లిమండలం సంపత్‌పురంలోని ఎస్‌విఎస్‌ఎన్ రెడ్డి పౌల్ట్రీ కాంప్లెక్స్‌కు వెళ్లి కోళ్లకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. కేంద్ర బృందం శుక్రవారం విశాఖపట్నం ఉక్కుకర్మాగారానికి జరిగిన నష్టాన్ని పరిశీలించి ఢిల్లీ వెళ్లనుంది.
మరోసారి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచన
కేజీ బేసిన్ ఎస్‌ఈ ఎం.రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఫైనాన్స్ కమిషన్ డెరైక్టర్ రాజీవ్‌కుమార్ సేన్, పశుసంవర్థకశాఖ ఉపకార్యదర్శి పి.ఎస్.చక్రవర్తి, సి.రామవర్మ బృందం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, సరుబుజ్జిలి, పైడిభీమవరం ప్రాంతాల్లో పర్యటించింది. ఆంధ్రా ఆర్గానిక్స్ పరిశ్రమను, బెజ్జిపురం, మరువాడ, అక్కయ్యపాలెంలో, కోటపాలేల్లో తోటలు, పంటలు, పౌల్ట్రీ నష్టాలను, అల్లివలసలో దెబ్బతిన్న బోట్లను పరిశీలించారు. ఆస్తి, వాణిజ్య పంటల నష్టానికి సంబంధించి కోష్ఠ, ఎచ్చెర్లలోని తమ్మినాయుడుపేట, సరుబుజ్జిలి మండలంలో వంశధార రైట్ కెనాల్‌ను బృందం సభ్యులు చూశారు. నష్టాల గురించి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితర అధికారుల్ని, సహాయ కార్యక్రమాలు అందిన తీరుతెన్నులపై బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోసారి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. తుపాను నష్టంపై కేంద్రానికి ఈనెల 21న రాష్ట్ర నివేదిక అందిందని చెప్పారు. ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి నష్టాన్ని తెలిపే నివేదికను కేంద్ర బృందానికి ఇచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, మత్స్యకార, చేనేత సంఘ నాయకులు తుపాను నష్టాన్ని వివరించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ తుపాను నష్టం రూ.1,500 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. గురు, శుక్రవారాల్లో పర్యటించాల్సిన కేంద్ర బృందం పర్యటన ఒక్కరోజుకే పరిమితి కావడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావు కేంద్ర బృందం పర్యటించిన సమయంలో కనిపించలేదు.