సాక్షి, అమరావతి : మహిళాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయించింది. పిల్లల్ని చక్కగా చదివించి.. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దటం మహిళల వల్లే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వివిధ పథకాల కింద భారీ కేటాయింపులు చేసింది. మహిళా సాధికారత దిశగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ముందుకు సాగుతోంది.
అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు
►జగనన్న అమ్మ ఒడి పథకం కింద 42,33,098 మంది తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించారు.
►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా నిధులు జమ చేస్తోంది. వసతి దీవెన కింద ఏడాదికి రూ.20 వేలు, విద్యా దీవెన కింద కాలేజీ ఫీజు ఎంతైతే అంత తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఈ రెండు పథకాల కోసం రూ.5,009 కోట్లను బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.
►వైఎస్సార్ చేయూత పథకం కింద 45–60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించి.. వారిని పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలమహిళల కోసం ఈ ఏడాది రూ.3,000 కోట్లు కేటాయింపులు చేశారు.
డ్వాక్రా మహిళలకూ భారీ నిధులు
►స్వయం సహాయక సంఘాల్లో ఉంటూ పొదుపు చేసుకుంటున్న మహిళలకు తగిన సార్థకత చేకూర్చేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి డ్వాక్రా మహిళలు బ్యాంకులకు బకాయిపడిన రుణం రూ.27,168.83 కోట్లను 2020–21 నుంచి నాలుగు విడతలుగా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకోసం ఈ ఏడాది రూ.6,300 కోట్లు ప్రతిపాదించింది.
►వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి కాపు మహిళకు జీవనోపాధి కోసం ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించారు.
►వడ్డీలేని రుణాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఇందులో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద బడ్జెట్‌లో రూ.1,365.08 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
మహిళా, శిశు సంక్షేమానికి 3,456 కోట్లు
బడ్జెట్ కేటాయింపుల్లో మహిళా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అగ్రతాంబూలమిచ్చింది. మహిళలు అభివృద్ధి పథంలో పయనించినప్పుడే రాష్ట్రాభివృద్ధి మరింత ముందుకెళుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగానే మహిళలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.3,456 కోట్లు కేటాయించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల అంగన్‌వాడీల్లోని పిల్లలు, గర్భిణుల్లో రక్తహీనత సమస్యను తొలగించే లక్ష్యంతో పోషకాహార పంపిణీ నిమిత్తం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమానికి పథకాలను తెచ్చింది. కోవిడ్–19 విపత్తు సమయంలోనూ అంగన్‌వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇళ్లకే పోషకాహారాన్ని సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. గత ఏడాది కంటే ఈసారి అధికంగా నిధులను ఆ వర్గాల వారి కోసం వెచ్చించనున్నట్లు బడ్జెట్‌లో స్పష్టం చేసింది.
కేటాయింపుల్లోని కొన్ని..
►రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటి పరిధిలో 48,770 అంగన్‌వాడీలు, 6,837 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి.
►అంగన్‌వాడీ పిల్లల్లో పోషణ లోపం, పెరుగుదల ఆగిపోవడం, తక్కువ బరువు ఉండటం, మహిళల్లో రక్తహీనత సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని చేపడుతోంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.1,250 కోట్లు కేటాయించింది.
►దీంతోపాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకానికి రూ.250 కోట్లు కేటాయించింది. 7 సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థల పరిధిలో విస్తరించిన 77 గిరిజన ప్రణాళిక, షెడ్యూల్ మండలాల్లోని 0.66 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, 6 నెలల నుంచి 72 నెలల్లోపు వయసు గల 3.18 లక్షల మంది చిన్నారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతారు.
►జగనన్న అమ్మ ఒడి : రూ.6 వేల కోట్లు
►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.3,000 కోట్లతో ‘వైఎస్సార్ చేయూత’
►డ్వాక్రా మహిళల బ్యాంక్ బాకీలు తీర్చేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ కింద రూ.6,300 కోట్లు
►జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు రూ.5,009 కోట్లు
►‘కాపు నేస్తం’ కింద రూ.350 కోట్లు
►వైఎస్సార్ సున్నా వడ్డీ రూ.1,365.08 కోట్లు
►దిశ బిల్లు అమలుకు రూ. 50 కోట్లు
►మహిళా సంక్షేమ భవనాల నిర్మాణాలకు రూ. 72 కోట్లు
►వైఎస్సార్ సంపూర్ణ పోషణ రూ.1,250 కోట్లు
►వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ రూ.250 కోట్లు
►జాతీయ మహిళా పోష్టకాహార పథకం రూ.1,577 కోట్లు
►ఏ డబ్యూసీ భవనాల నిర్మాణాలకు రూ. 194.62 కోట్లు
►అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి రూ. 23.98 కోట్లు
►విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమం రూ.76.01కోట్లు
Comments
Please login to add a commentAdd a comment