ఉగ్ర గోదావరి! | Huge Floods to Godavari | Sakshi
Sakshi News home page

ఉగ్ర గోదావరి!

Published Wed, Aug 15 2018 5:37 AM | Last Updated on Wed, Aug 15 2018 5:37 AM

Huge Floods to Godavari - Sakshi

సాక్షి, అమరావతి/బెంగళూరు: ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని, తాలిపేరు వంటి ఉప నదులు ఉప్పొంగి ప్రవహి స్తుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహ ఉధృతితో మంగళవారం భద్రాచలం వద్ద 38.5 అడుగులు.. ధవళేశ్వరం వద్ద 8.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీకి 6,09,979 క్యూసెక్కులు వరద ప్రవాహం రాగా.. డెల్టా కాలువలకు 7,100 క్యూసెక్కులు వదిలి మిగతా 6,02,879 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ గోదావరికి వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం ఇదే. సోమవారం ఉ. 6 గంటల నుంచి మంగళవారం ఉ.6 గంటల వరకూ 52.09 టీఎంసీల నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలారు. అలాగే, ఈ సీజన్‌లో ఇప్పటివరకూ మొత్తం 733.104 టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలిశాయి.  

‘కృష్ణా’లోనూ కొనసాగుతున్న వరద 
ఇదిలా ఉంటే.. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు దిగువన ‘కృష్ణా’లో వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉ. 6గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 50,490 క్యూసెక్కుల ప్రవాహం రాగా 9,437 క్యూసెక్కులను కాలువలకు వదిలి మిగిలిన 41,053 క్యూసెక్కులను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. సా. 5 గంటలకు వరద తగ్గడంతో ప్రవాహాన్ని 27,175 క్యూసెక్కులకు తగ్గించారు.  

శ్రీశైలంలో 150.13 టీఎంసీ నిల్వ 
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి వరద ప్రవాహం చేరుతోంది. కొంత వరదను కాలువలకు వదిలి, మిగతా నీటిని విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. తుంగభద్ర జలాశయంలోకి 57,285 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగిలిన 19,737 క్యూసెక్కులను గేట్లు ఎత్తి కృష్ణా నదిలోకి వదిలారు. మంగళవారం ఉ. 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 1,05,199 క్యూసెక్కులు చేరగా.. సా.6 గంటలకు 95,680 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 872.1 అడుగుల్లో 150.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే, నాగార్జునసాగర్‌కు 51,824 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌ నుంచి కుడి కాలువ, ఏఎమ్మార్పీలకు 4,734 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 522.6 అడుగుల్లో 154.06 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వంశధార నదిలో వరద ఉధృతి పెరిగింది. అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు రాజ్యమేలుతుండటంతో పెన్నా నదిపై ఉన్న జలాశయాలన్నీ వెలవెలబోతున్నాయి. 

కర్ణాటకను ముంచెత్తిన వరుణుడు 
కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేరళను ఆనుకుని ఉన్న కొడగు, చామరాజనగర, ఉడుపి, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కావేరి, కపిలా, కబిని, హేమావతి, తుంగభద్ర తదితర నదులు ఎన్నడూ లేనంతగా పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం పెద్దసంఖ్యలో వంతెనలు, రోడ్లు నీటమునగడంతో భారీగా బస్సు, రైలు సర్వీసులు స్తంభించాయి. మండ్య జిల్లాలో కావేరి నదిపైనున్న కేఆర్‌ఎస్‌ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. కొడగులో భాగమండల, మైసూరులో నంజనగూడు పుణ్యక్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఇళ్లలోకి కావేరి నది ప్రవేశించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కుమారధార పుణ్యక్షేత్రం నడుంలోతు నీళ్లలో చిక్కుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement