వి. బొంతిరాళ్ల (డోన్‌టౌన్), న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామానికి చెందిన బుర్రనాగరాజు(25), రమాదేవి (23) అన్నాచెల్లెళ్లు. రమాదేవి జ్యోతిష్యం చెప్పేవారు. పూజలు కూడా చేస్తుండటంతో పలువురికి ఈమె పరిచయం అయ్యారు.
ఈమె అన్న నాగరాజు హైదరాబాద్‌లోని కింగ్‌కోటి కామినేని ఆసుపత్రిలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. డోన్, హైదరాబాద్‌తో పాటు తదితర ప్రాంతాలకు చెందిన గుప్తనిధుల ముఠా సభ్యులు.. జ్యోతిష్యం చెప్పే రమాదేవి గురించి విన్నారు. ఆమె అన్న నాగరాజుకు అత్యంత సన్నిహితుడైన హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన కరాటే మాస్టర్ రాధాక్రిష్ణను సంప్రదించారు. ఎలాగైనా రమాదేవిని ఒప్పించాలని, తమ ప్రాంతంలోని కోట్ల రూపాయలు విలువ చేసే గుప్త నిధుల రహస్యం చెప్పాలని పట్టుబట్టారు. నిధుల రహస్యం చెబితే లభించే ఆదాయంలో ఒక వంతు భాగాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు నాగరాజు, రమాదేవిలు అంగీకరించి బుధవారం మధ్యాహ్నం తమ స్వగ్రామమైన పాలమాకుల నుంచి ప్రెస్ స్టిక్కర్ ఉన్న కారులో డోన్‌కు వచ్చారు.
కర్నూలు నుంచి జేసీబీని తెచ్చిన ముఠా సభ్యులు వీరిని వెంటబెట్టుకొని బుధవారం అర్ధరాత్రి బొంతిరాళ్ల గ్రామ శివార్లలోని కంది పొలాల్లోకి వెళ్లారు. తమతో తెచ్చుకున్న పూలు, నిమ్మకాయలు, టెంకాయలు తదితర వాటితో పూజలు చేసి జేసీబీతో నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు సెల్‌ఫోన్ల ద్వారా ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులందరూ తలోదిక్కున ఘటన స్థలానికి టార్చిలైట్లతో చేరుకున్నారు.
మూకుమ్మడిగా గుప్త నిధుల ముఠా సభ్యులను చుట్టుముట్టి కేకలు వేయడంతోపాటు జేసీబీపై రాళ్లురువ్వారు. దీంతో హడలెత్తిపోయిన ముఠాసభ్యులు పరారయ్యేందుకు పరుగులు తీశారు. డ్రైవర్ భయంతో ఇష్టానుసారంగా జేసీబీని తిప్పారు. దీంతో గట్టుకింద నక్కిఉన్న నాగరాజు, రమాదేవిలకు జేసీబీ తగిలి బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు గంటన్నర పాటు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయం ఏర్పడింది. తర్వాత గ్రామస్తులు గాలించగా రమాదేవి, నాగరాజుల మృతదేహాలు బయటపడ్డాయి. అదే ప్రాంతంలో నక్కి ఉన్న కరాటే మాస్టర్ రాధాక్రిష్ణను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.
పోలీసుల అదుపులో ముఠా...?
ముఠా సభ్యుల్లో.. హైదరాబాద్‌కు చెందిన సుభాష్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాధాక్రిష్ణన్, లక్ష్మారెడ్డి, డోన్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్, కోయిలకొండ రాజు, నందికొట్కూరుకు చెందిన విజయుడు, ఓర్వకల్లుకు చెందిన జేసీబీ డ్రైవర్ రవికుమార్, రుద్రవరానికి చెందిన కారు డవ్రైర్ సుంకన్న, కొలిమిగుండ్లకు చెందిన హుస్సేన్‌లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
దత్త బిడ్డను దారుణంగా చంపారు:
తల్లిదండ్రులు
పాలమాకుల చెందిన కూలీ నరసింహకు రమాదేవి కుమార్తె. అయితే పదేళ్ల క్రితం షంషాబాద్‌లో నివాసముండే సోదరుడు శ్రీనివాస్, లతల దంపతుల ఇంటికి ఆమె దత్తత వెళ్లింది. శ్రీనివాస్, లతలకు అప్పటికే కుమారుడు నాగరాజు ఉన్నాడు. రమాదేవిని సొంత కూతురిలా పెంచి పోషిస్తూ వచ్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ రమాదేవిని గుప్త నిధుల కోసం తెచ్చి ఉద్దేశపూర్వకంగానే బలిచ్చారని తల్లిదండ్రులు శ్రీనివాసులు, లతలు ఆరోపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్న నిధుల ముఠాను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
రమాదేవి డైరీలో ఏముంది...:?
మృతి చెందిన రమాదేవి, నాగరాజుల వ్యక్తిగత డైరీలో ఏముందన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మృతుల వద్ద ఉన్న నగదుతో పాటు, డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. మృతుల డైరీలో వారు ఎప్పుడెప్పుడు ఎవ్వరిని కలిసింది. వారితో ఎవ్వరు సంభాషించారు. ఎవ్వరితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. గతంలో గుప్త నిధుల కోసం ఎవ్వరితోనైనా ఒప్పందం కుదుర్చుకున్నారా లాంటి రహస్యాలు డైరీలో పొందుపరిచినట్లు సమాచారం. కీలకంగా వ్యవహరించే కొందరు వ్యక్తులు సైతం మృతులకు పరిచయం ఉన్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ డైరీతో బేరీజు వేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే గుప్త నిధులకు సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
నాడే చెప్పిన ‘సాక్షి’
డోన్ మండల పరిధిలోని బొంతిరాళ్లతో పాటు పలు ప్రాంతాలలో గుప్త నిధుల కోసం కొందరు ముమ్మరంగా అన్వేషిస్తున్నారన్న నవంబర్ 1వ తేదీన సాక్షిలో ‘బొంతిరాళ్లలో గుప్త నిధుల వేట’ అనే కథనం ప్రచురితమైంది. హైదరాబాద్, డోన్‌కు చెందిన కొందరు గోల్డ్‌స్కానర్లతో నిధులను అన్వేషించే ప్రక్రియలో నిమగ్నమయ్యారని అందులో తెలిపింది. ఈ నేపథ్యంలో పూజలు జరిపించి నిధులను కాజేసే ప్రయత్నంలో గురువారం ఇద్దరు మృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుప్త నిధుల ముఠాలపై నిఘాను కేంద్రీకృతం చేసి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
నిధుల వేటలో మృత్యు ఒడికి..
Published Fri, Dec 27 2013 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement