భార్యను కొట్టి చంపిన భర్త
కొడవలూరు : మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా కొట్టి చంపిన ఉదంతం మండలంలోని నాయుడుపాళెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నాయుడుపాళెం గమళ్లపాళెంకు చెందిన జంపాల మల్లికార్జున (40)కు ప్రకాశం జిల్లా కొత్తపట్నం గమళ్లపాళెంకు చెందిన బుద్దగిరి వెంకటేశ్వర్లు, యానాదమ్మ దంపతుల కుమార్తె ఈశ్వరమ్మతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల వినోద్ అనే మానసిక వికలాంగుడైన కుమారుడు ఉన్నాడు.
కొంత కాలంగా మల్లికార్జున మద్యానికి బానిసగా మారాడు. ఈశ్వరమ్మకు పెళ్లి సమయంలో తల్లిదండ్రులు కానుకగా ఇచ్చిన బంగారు కమ్మలు కూడా అమ్మేశాడు. మల్లికార్జున పనికెళ్లడం కూడా మానేశాడు. దీంతో ఈశ్వరమ్మ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఈశ్వరమ్మ తమ సమీప బంధువుల వివాహానికి కొత్తపట్నం వెళ్లింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఈశ్వరమ్మకు కొత్తగా కమ్మలు కొని ఇచ్చారు. వాటితో ఇంటికి చేరుకున్నప్పటి నుంచి మల్లికార్జున ఆ నగలను ఇవ్వాలని తరచూ వేధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఈశ్వరమ్మ కమ్మలను ఆమె అత్త చేతికి ఇచ్చి బుధవారం కూలి పనికెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకుంది. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న మల్లికార్జున భార్యతో నగలివ్వాలని గొడవకు దిగారు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో కొయ్యతో విచక్షణారహితంగా ఆమెను కొట్టాడు. దీంతో ఈశ్వరమ్మ స్పృహ కోల్పోయింది. అక్కడి నుంచి మల్లికార్జున వెళ్లిపోయాడు. బాగా పొద్దుపోయాక ఈశ్వరమ్మ అత్త ఇంటికి వచ్చేసరికి చలనం లేకుండా పడిపోయి ఉన్న ఈశ్వరమ్మను గుర్తించి ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు హుటావుటిన గ్రామానికి చేరుకున్నారు. తమ కుమార్తెను అల్లుడే కిరాతకంగా కొట్టి చంపాడని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యను హత్య చేసిన మల్లికార్జున పరారీలో ఉన్నారు. హత్యకు గురైన ఈశ్వరమ్మ కుమారుడు వినోద్ మానసిక వికలాంగుడు. అతడి ఆలనాపాలనా చూసుకునే తల్లి మృతి చెందడంతో ఆ బాలుడి పరిస్థితే మిటని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. మల్లికార్జునపై హత్య కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
తాగేందుకు డబ్బులివ్వలేదని..
Published Fri, Jun 12 2015 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement