నిజాలే చెప్తానని ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యం ఇస్తారా?
మేడిగడ్డలో సికెంట్ పైల్స్ వాడాలనిసీడీఓ సూచించిందని ఎలా అంటారు?
ఓవర్ స్మార్ట్‌గా ప్రవర్తిస్తే పర్యవసానాలు తప్పవు
మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ‘మీ సమాధానం పూర్తి అబద్ధం. నిజాలే చెప్తానని ప్రమాణం చేసి తప్పుడు సాక్ష్యం ఇస్తారా? మేడిగడ్డ బరాజ్‌లోని 1, 2వ నంబర్ బ్లాకుల్లో ఆర్‌సీసీ కటాఫ్‌లు, 3–7 నంబర్ బ్లాకుల్లో సికెంట్ పైల్స్ వినియోగించాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ సూచించినట్టు ఏవైనా డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయా?’అని కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మీరు స్మార్ట్‌గా ఉంటే ఫర్వాలేదు.. ఓవర్ స్మార్ట్‌గా ప్రవర్తిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. కమిషన్‌ను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తే పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణలో భాగంగా కమిషన్ శనివారం మూడున్నర గంటలపాటు నల్లా వెంకటేశ్వర్లుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 71 ప్రశ్నలను సంధించింది.
తనకు ఆంగ్లంలో అంతగా ప్రావీణ్యం లేదని, మేడిగడ్డ నిర్మాణంలో సికెంట్ పైల్స్ వినియోగంపై అంతకుముందు ఇచ్చిన సమాధానాన్ని సరిదిద్దడానికి అవకాశం కలి్పంచాలని ఆయన కోరగా.. కమిషన్ తిరస్కరించింది. ఆంగ్లం రాకుండా ఈఎన్సీగా ఎలా పనిచేశారని మండిపడింది. తనకు జ్ఞాపకం ఉన్న వివరాలు చెప్పానని, అందులో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చంటూ వెంకటేశ్వర్లు క్షమాపణ కోరారు.
తమ్మిడిహట్టి వద్దు అన్నది ప్రభుత్వ అధినేతనా? హైపవర్ కమిటీనా?
తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చి బరాజ్ నిర్మించడానికి డీపీఆర్ తయారీ బాధ్యతను ఏప్రిల్ 2015లో వ్యాప్కోస్‌కు కట్టబెట్టినట్టు నల్లా వెంకటేశ్వర్లు కమిషన్‌కు తెలిపారు. లొకేషన్ మార్పుపై నిర్ణయం ఎవరిదని ప్రశ్నించగా, ప్రభుత్వ అధినేతది అని బదులిచ్చారు. ఇలాంటి నిర్ణయాలు మంత్రివర్గం తీసుకోవాలి కదా? అని కమిషన్ ప్రశ్నించగా, మంత్రివర్గంలో ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై చర్చ జరిగిందని బదులిచ్చారు. ‘2016 మార్చి 27న నాటి సీఎం (కేసీఆర్) నిర్వహించిన ఓ సమావేశంలో వ్యాప్కోస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ డీపీఆర్ సమర్పించారు.
తమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు లోకేషన్‌ను మార్చాలని డీపీఆర్‌లో వ్యాప్కోస్ ప్రతిపాదించింది. వ్యాప్కోస్ ప్రతిపాదనలను హైపవర్ కమిటీ ఆమోదించింది’అని వెంకటేశ్వర్లు చెప్పారు. లొకేషన్ మార్పుపై సీఎం నిర్ణయం తీసుకున్నట్టు అంతకుముందు చెప్పారు కదా.. అని కమిషన్ నిలదీయగా, సీఎం రీఇంజనీరింగ్ చేయాలని సూచించారని మళ్లీ వివరణ ఇచ్చారు. వ్యాప్కోస్ ప్రతిపాదించిన ప్రాంతానికి 5.4 కి.మీ. దిగువన అన్నారం, 2.20 కి.మీ. దిగువన సుందిళ్ల బరాజ్‌లను నిర్మించాలన్న ప్రతిపాదనల ఆధారంగా హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ మార్పులను హైపవర్ కమిటీ భేటీలో వ్యాప్కోస్ కూడా సమ్మతించిందని ఆయన పేర్కొనగా, దానికి రుజువులు ఉన్నాయా? అని కమిషన్ ప్రశ్నించింది. సమావేశం మినిట్స్‌లో ఈ విషయం ఉన్నప్పటికీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన వ్యాప్కోస్ ప్రతినిధి దానిపై సంతకం చేయాల్సిన అవసరం లేదని ఆయన బదులివ్వగా.. కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. వ్యాప్కోస్ ఇచ్చిన కొలతలు, సాంకేతిక ప్రమాణాల ప్రకారమే బరాజ్‌లు నిర్మించారా? అన్న ప్రశ్నకు.. మేడిగడ్డ బరాజ్ గేట్ల సైజు మినహా ఇతర మార్పులేమీ చేయలేదన్నారు.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్ల సంఖ్యతోపాటు వాటి సైజుల్లో మార్పులను సీఈ సీడీఓ సూచించారన్నారు. నిర్మాణంలో డిజైన్లను వక్రీకరించాల్సి రావడంతో 2018, 2021లో రెండుసార్లు బరాజ్‌ల అంచనాలను సవరించినట్టు తెలిపారు.
డిజైన్లలో లోపంతోనే...
బరాజ్‌ల నిర్మాణం 2019 జూన్‌లో పూర్తికాగా, సెపె్టంబర్‌లో వచ్చిన వరదల్లో దెబ్బతినడానికి కారణాలేమిటి? అని కమిషన్ ప్రశ్నించింది. బరాజ్‌ల నుంచి విడుదలయ్యే వరద భీకర వేగంతో బయటకి దూసుకొచ్చి నేలను తాకే చోట నీటినిల్వలు లేకపోవడంతో ఆ వేగానికి అక్కడ ఉన్న లాంచింగ్ అప్రాన్ కొట్టుకుపోయి నష్టం జరిగిందని వెంకటేశ్వర్లు అన్నారు. నిల్వతో ఏర్పడే పీడనశక్తి విడుదలకి డిజైన్లలో సరైన పరిష్కారాలను చూపకపోవడంతోనే బరాజ్‌ల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి నష్టం జరిగిందని చెప్పారు.
పంపింగ్ కోసం బరాజ్‌లో కనీస నిల్వలను నిర్వహించాల్సి రావడమూ ఒక కారణమన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో ‘జెడ్’ఆకృతి షీట్‌పైల్స్‌కి బదులు సికెంట్ పైల్స్‌ను వాడాలని ఎన్‌ఐటీ–వరంగల్‌తోపాటు ఐఐటీ–చెన్నై రిటైర్డ్ ప్రొఫెసర్ సిఫారసు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment