
అల్లవరం (అమలాపురం): రోజూ తనతో గొడవ పడుతూ హింసిస్తున్న భర్తను మరో ఇద్దరి సాయంతో భార్య తీవ్రంగా కొట్టి, ఆరు నెలలుగా గృహ నిర్బంధంలో ఉంచింది. విషయం వెలుగులోకి రావడంతో అల్లవరం పోలీసులు ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై డి. ప్రశాంత్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొక్కిరిగడ్డ వీర వెంకట సత్యనారాయణ, సూర్యకుమారి దంపతులు మండలంలోని కొమరగిరిపట్నం శివారు మిలటరీ కాలనీలో నివశిస్తున్నారు.సత్యనారాయణ చాలాకాలం దుబాయ్‌లో పనిచేసి తిరిగి వచ్చాడు. అతడు తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను హింసించేవాడు. దీంతో విసిగిపోయిన సూర్యకుమారి ఈ ఏడాది జనవరి ఐదో తేదీన సంగాని రాంబాబు, పొనమండ శ్రీనివాసరావు అనే మరో ఇద్దరితో కలిసి రాడ్డులతో భర్త సత్యనారాయణపై దాడి చేసింది. గాయపడిన అతడిని గృహంలోనే నిర్బంధించింది.
విషయం బయట పడింది ఇలా..
ఐదు నెలలు పైబడినా తన అన్న సత్యనారాయణ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సఖినేటిపల్లిలో నివసించే అతడి సోదరుడు కొక్కిరిగడ్డ నాగమలేశ్వరరావుకు అనుమానం వచ్చింది. దీంతో అతడు అన్నను చూసేందుకు కొమరగిరిపట్నం శివార్లలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గాయాలతో బాధపడుతూ జీవచ్ఛంలా పడి ఉన్న సత్యనారాయణ కనిపించాడు.
దీంతో నాగమల్లేశ్వరరావు పోలీసుల సహకారంతో అన్నను గృహ నిర్బంధం నుంచి విడిపించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. శనివారం ఉదయం నాగమల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమారిని అరెస్టు చేశామని ఎస్సై ప్రశాంత్‌కుమార్ తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న సత్యనారాయణకు స్థానికంగా ఉన్న పీఎంపీతో చికిత్స చేయించారే తప్ప పెద్దాస్పుత్రిలో చికిత్స అందించలేదు. ప్రస్తుతం అతడి చేతులు విరిగి వేలాడుతున్నాయని, మోకాలి చిప్ప పగిలిపోవడంతో నడవలేకపోతున్నారని ఎస్సై తెలిపారు.