భార్యను చంపి ముక్కలుగా నరికి... | Husband Kills wife over illegal affair in kakinada | Sakshi
Sakshi News home page

భార్యను చంపి ముక్కలుగా నరికి...

Published Fri, Aug 8 2014 9:18 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

భార్యను చంపి ముక్కలుగా నరికి...

భార్యను చంపి ముక్కలుగా నరికి...

 కాకినాడ క్రైం :  వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భర్త తన భార్యను అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికాడు. అంతేకాదు ఆమె మృతదేహాన్ని మూటలుగా కట్టి వేర్వేరు చోట్ల చెత్తకుప్పల్లో పడేశాడు. కాకినాడలో గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజోలుకు చెందిన గుమ్మడి శ్రీరామకృష్ణతో విజయవాడకు చెందిన మరియమ్మ(38)కు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి వెంకటేష్, సీమోను అనే కుమారులున్నారు. విజయవాడలో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించిన రామకృష్ణ ఏడాది క్రితం కాకినాడ ఫ్రేజర్‌పేటకు మకాం మార్చి, మెయిన్‌రోడ్లోని ఓ షాపింగ్ మాల్‌లో టైలర్‌గా పని చేస్తున్నాడు.
 
 ఈ కుటుంబం ఫ్రేజర్‌పేట నుంచి రాగంపేటకు, అక్కడి నుంచి మూడు నెలల క్రితం పాతబస్టాండు సమీపంలోని వెంకటేశ్వర కాలనీకి మారింది. మరియమ్మకు వివాహేతర సంబంధం ఉందని రామకృష్ణ భావించడంతో భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడుతుండేవారు. అదే క్రమంలో బుధవారం రాత్రి వాగ్వివాదానికి దిగారు. దీంతో పెద్ద కొడుకు వెంకటేష్ స్నేహితుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లోనే ఉన్న చిన్న కుమారుడు సీమోను రాత్రి చాలా వరకూ టీవీ చూసి నిద్రించాడు. రామకృష్ణ కూడా కుమారుడితో పాటు నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి లేచి చూసేసరికి మరియమ్మ పక్క గదిలో మరో వ్యక్తితో కనిపించింది. అతని అలికిడి విని ఆ వ్యక్తి పరారయ్యాడు. వివస్త్రగా కనిపించిన మరియమ్మను చూసిన రామకృష్ణ పట్టరాని ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కత్తితో ఆమెను హతమార్చాడు.
 
 అంతటితో ఆగకుండా తల, ఛాతీ, మొండెంలను వేరు చేశాడు. ఛాతీ భాగం ఒక ఖాళీ బియ్యం సంచిలో, మొండెంను మరో ఖాళీ సంచిలో, తల, పేగులు కేన్‌లో వేసి రాత్రంతా ఇంట్లోనే ఉంచాడు. ఇల్లంతా రక్తమయం కావడంతో కిరోసిన్, ఫినాయిల్‌తో నేలను శుభ్రంగా కడిగేశాడు. ఉదయం కుమారులిద్దరూ స్కూలుకు వెళ్లాక రామకృష్ణ ఆ మూటలు, కేన్‌ని సైకిల్‌పై తీసుకువెళ్లాడు.

అతడు మూటలు తీసుకు వెళ్తున్నట్లు మాత్రమే స్థానికులు గమనించారు. మూటలను తీసుకెళ్లిన అతడు కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ సమీపంలోని ఫ్రేజర్‌పేటలోని చెత్తకుండీలో ఓ మూట, కచ్చేరీపేట సీపీఎం కార్యాలయం ఎదుట గల చెత్తకుండీలో మరోమూట, కేన్‌ను ఉప్పుటేరులో పడేశాడు. తిరిగి ఇంటికి చేరుకున్న అతడు తలుపులు తెరిచేసరికి కిరోసిన్ వాసనతో ఘాటైన దుర్గంధం వెదజల్లడంతో స్థానికులు భార్యను చంపేసి ఉంటాడని భావించి పోలీసులకు సమాచారం అందించారు.
 
 నవ్వుతూ సమాధానం..
 ఉదయం పది గంటల నుంచి పోలీసులు రామకృష్ణ నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు ప్రతిదానికీ నవ్వుతూ సమాధానం చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. భార్యను విజయవాడ రైలు ఎక్కించి వచ్చానని, ఇల్లు సరిగా లేకపోవడంతో కిరోసిన్ పోసి కడిగానని చెప్పాడు. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి విచారించినా ఫలితం లేకపోయింది. వారు ఏమీ చెప్పలేకపోయారు. రామకృష్ణ మాత్రం తన భార్యను విజయవాడ పుట్టింటికి పంపించానని చెబుతూ వచ్చాడు.

 

పుట్టింటికి ఫోన్ చేసిన పోలీసులు మరియమ్మ అక్కడకు చేరుకోలేదని తెలియడంతో భర్తే ఆమెను హతమార్చి ఉంటాడని భావించారు. గదిలో, ఇంటి ఆవరణలో అక్కడకక్కడా కనిపించిన రక్తపు మరకలు వారి అనుమానాన్ని బలపరిచాయి. అయితే రామకృష్ణ తనకేమీ తెలియనట్టు నవ్వుతుండడంతో పోలీసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్థానికులు మాత్రం మరియమ్మను అతడే హతమార్చి ఉంటాడని, ఉదయం రెండు మూటలు సైకిల్‌పై తీసుకెళ్లడం చూశామని పోలీసులకు చెప్పారు.
 
 పోలీసు స్టేషన్లో విచారణ
 సాయంత్రం ఐదు గంటల సమయంలో రామకృష్ణను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి మళ్లీ ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం చెప్పాడు. తాను భార్యను హతమార్చానని, ఆమె నగ్నంగా మరో వ్యక్తితో ఉండడం చూసి సహించలేకే ఈ పని చేశానని చెప్పాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అద్దంకి శ్రీనివాసరావు, ఎస్సైలు సంఘటనా స్థలంతో పాటు చెత్తకుండీలను పరిశీలించారు. మృతదేహాన్ని ముక్కలు చేసి చెత్తకుండీలలో పడేసినట్టు జరిగిన ప్రచారం తీవ్ర కలకలం రేపింది. పలువురు చెత్తకుండీల వద్దకు చేరారు. నిత్యం రద్దీగా ఉండే వార్ఫు రోడ్డులో కొద్ది సమయం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామకృష్ణను రక్షక్ వాహనంలో తీసుకువెళ్లి చెత్తకుండీలలోని సంచులను అతడితోనే తీయించారు. అప్పటికే మృతదేహం ముక్కలు పాడవడంతో దుర్గంధం వెదజల్లింది. వీటిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
 
 వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. తల్లి తండ్రి చేతిలో హతమవడంతో కుమారులిద్దరూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. వారి బంధువులంతా సుదూర ప్రాంతాల్లో ఉండడంతో పోలీసులే వారిని చేరదీశారు. వారి బంధువులకు సమాచారం అందించి హుటాహుటిన కాకినాడ రావాల్సిందిగా సూచించారు. మరియమ్మ శరీర భాగాలను కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం, శరీర భాగాలను పడేసిన చెత్తకుండీలు ఉన్న ప్రాంతం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కావడం విశేషం. తలపేగులున్న కేన్‌ను ఉప్పుటేరు నుంచి వెలికితీయాల్సి ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement