తణుకు క్రైం, న్యూస్‌లైన్ : భర్త వేధింపులకు ఓ గర్భిణి బలైపోయింది. నిండుచూలాలైన మండపాకకు చెందిన చదలవాడ నాగజ్యోతి (19) బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు. మండపాక సుబ్బారాయుడి గుడి వీధిలో నివాసముంటున్న చదలవాడ సురేష్, పైడిపర్రు గ్రామానికి చెందిన నాగజ్యోతి 2012లో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భిణి. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు.
దీంతో అప్పట్లో వీరిద్దరి వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. వీరు ఇంట్లోంచి వెళ్లిపోయి అన్నవరంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మండపాకలో ఇల్లు అద్దెకు తీసుకుని వేరు కాపురం ఉంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో నాగజ్యోతి ప్రసవించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడడంతో సురేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేసరికి లోపల గడియపెట్టి ఉంది. తలుపుకొట్టినా తీయకపోవడంతో స్థానికుల సాయంతో సురేష్ తలుపు పగులకొట్టి లోపలకి వెళ్లాడు. నాగజ్యోతి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఉండడంతో వెంటనే వారు కిందకు దించగా అప్పటికే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు ఆర్డీవో కె.సూర్యారావు తణుకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాగజ్యోతి భర్త వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ఎం.కేశవరావు కేసు నమోదు చేశారు.
కంటతడి పెట్టించిన శిశువు మృతదేహం
రెండుమూడు రోజుల్లో పుట్టబోయే శిశువును మృతదేహంగా చూడాల్సి రావడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. చూపరులను సైతం కంటతడి పెట్టించింది. అనుమానాస్పదంగా మృతిచెందిన నాగజ్యోతికి పోస్టుమార్టం చేసిన సందర్భంగా గర్భంలోంచి మగశిశువును బయటకు తీశారు. పోలీసులు తల్లీబిడ్డల మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
భర్త వేధింపులకు నిండు చూలాలు బలి
Published Fri, Aug 23 2013 3:55 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement