
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
జంగారెడ్డిగూడెం రూరల్ : అనుమానమో.. మరేదైనా కారణమో తెలీదుగానీ కట్టుకున్న భార్యను ఆమె భర్త గొడ్డలితో కిరాతకంగా నరికిచంపిన ఘటన జంగారెడ్డిగూడెం మండ లం చిన్నంవారిగూడెంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం సీఐ ఎం.అంబికాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దే రాధ, ఏసురత్నం అనేవారికి 12ఏళ్ల క్రితం వివాహమైంది. చిన్నంవారిగూడెంలో నివాసం ఉంటున్న వీరిద్దరి మధ్య శనివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. అర్ధరాత్రి దాటిన తరువాత రాధను ఆమె భర్త ఏసురత్నం గొడ్డలితో బలంగా నరికాడు.
మెడ చాలావరకు తెగిపోవడంతో ఆమె రక్తపు మడుగులో కొట్టుకుని మరణించింది. హత్యచేసిన వెంటనే ఏసురత్నం పరారయ్యాడు. భార్యపై అనుమానంతోనే ఏసురత్నం హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రాధ ఒక యువకునితో వెళ్లినట్టు ఏసురత్నం అనుమానిస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోందని సీఐ పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన రాధ అదేరోజున అర్ధరాత్రి చింతలపూడిలో ఉంటున్న అక్క ఇంటికి చేరిందని సీఐ చెప్పారు. భార్యను బాగా చూసుకుంటానని చెప్పి భార్యను ఇంటికి తీసుకొచ్చిన ఏసురత్నం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని రాధ బంధువులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.