ఓ బాట‘సారీ’!
* హైదరాబాద్ రోడ్డు ప్రమాద మృతుల్లో రెండోస్థానం పాదచారులదే
* కనిపించని కనీస నివారణ చర్యలు
* మోడ్రనైజేషన్‌పై కదలని ‘గ్రేటర్’
* అమలుకు నోచుకోని పెలికాన్ సిగ్నల్స్ నగరంలో పాదచారి భద్రతకు భరోసా ఉందా..!
ఏ కూడలిలోనైనా పాదచారి స్వేచ్ఛగా రోడ్డు దాటగలుగుతున్నాడా..! లేదనే సమాధానమిస్తున్నాయి పోలీసు గణాంకాలు. జంట నగరాల్లో ప్రతి ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నవారిలో పాదచారులది రెండోస్థానం. రుధిరదారులుగా పేరున్న నగర రోడ్లపై నడవాలంటే పాదచారి జంకుతున్నాడు. ప్రాణాలు అరచేతపట్టుకుని రోడ్డు దాటుతున్నాడు. ‘మహానగరం’ అంటూ డాంబికాలు పలికే నేతలు, అధికారులు పాదచారులకు ‘నడకయాతన’ను మిగులుస్తున్నారే తప్ప వారి భద్రతకు తీసుకున్న కనీస చర్యలు శూన్యం. జీబ్రాక్రాసింగ్‌స.. పెలికాన్ సిగ్నల్‌స.. ఇలాంటి హడావిడి మాటలన్నీ ఫైళ్లలోనే మూలుగుతున్నాయి. ఎన్నాళ్లిలా..? ఎన్నేళ్లిలా..?
జంట కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ చేస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులు/మరణిస్తున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2010 నుంచి 2013 (ఆగస్టు) మధ్య హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం ప్రతి సంవత్సరం జంట కమిషరేట్లలో జరుగుతున్న ప్రమాదాలు ఐదు వేలకు పైగానే ఉన్నాయి. వీటిలో దాదాపు రెండు వేల మందికి పైగా మృత్యువాత పడుతున్నారు.
సాధారణ రోడ్ల కంటే జాతీయ రహదారులు ఎక్కువగా విస్తరించి ఉన్న సైబరాబాద్‌లోనే వీటి సంఖ్య ఎక్కువ. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. సిటీలో మొత్తం(2010 నుంచి 2013 ఆగస్‌ట వరకు) 10,995 ప్రమాదాలు జరిగాయి. మరణించిన వారి సంఖ్య 1880. మృతి చెందిన వారిలో పాదచారులు 696. ఇక సైబరాబాద్‌లో 13,230 రోడ్డు ప్రమాదాల్లో 4006 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 1307 మంది పాదచారులే.
వీటికి మోక్షమెప్పుడో?
రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీలోనే కాదు... అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న హైటెక్ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లభించడం లేదు. ప్రణాళికాలోపం కారణంగా నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా.. మిగిలిన చోట్ల అనేక అడ్డంకులున్నాయి.
కూడళ్ల వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రత్యేకమైన చర్యలు, అందుకు అనుగుణంగా ‘ఆల్ రెడ్‌స’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఆమడదూరంలో ఉన్నాయి. వీటికి పరిష్కారంగా ట్రాఫిక్ విభాగం అధికారులు తయారు చేసి పంపిన ప్రతిపాదనలకు ‘గ్రేటర్’లో మోక్షం లభించడం లేదు. నగరంలో కీలక ప్రాంతాల్లో కనీసం 2 అడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు ఓపెనింగ్‌స ఏర్పాటులాంటి ప్రతిపాదనలున్న ఫైళ్లు బల్దియాలో దుమ్ముపట్టి ఉన్నాయి.
మూలనపడ్డ ‘పెలికాన్’ ప్రతిపాదన...
పాదచారుల భద్రత కోసం సిటీలో అనునిత్యం బిజీగా ఉండే 60 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్‌స ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితమే ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్‌కు సంబంధించిన మౌలిక వసతుల కల్పన జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2010 మార్చిలోనే జీహెచ్‌ఎంసీకి పంపారు.
ఒక్కో సిగ్నల్ ఏర్పాటుకు దాదాపు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేసిన ‘గ్రేటర్’ అధికారులు కేవలం 30 సిగ్నల్‌స ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. వీటిని దశల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమికంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌స వద్ద నాలుగింటిని అమలులోకి తెచ్చారు. ఏడాదిలోనే ఇవి మూలనపడ్డా పట్టించుకునే వారే కరువయ్యారు. మిగిలిన చోట ఏర్పాటు ప్రతిపాదనల్ని మరిచిపోయారు. ఇటీవలే కాస్త మేల్కొన్న అధికారులు బంజారాహిల్‌స రోడ్ నెం.1లోని కేర్ ఆస్పత్రి సమీపంలో మరో పెలికాన్ సిగ్నల్ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టారు.
ఎలా పని చేస్తాయి?
ఈ పెలికాన్ సిగ్నల్‌స మాన్యువల్‌గానే పని చేస్తాయి. సాధారణంగా దీని డిస్‌ప్లేపై ఆగిన వ్యక్తి, నడుస్తున్న వ్యక్తుల గుర్తులు ఉండి, వాటి వెనుక లైట్లు ఉంటాయి. సిగ్నల్ ఉన్న ప్రాంతంలో రోడ్డుదాటడానికి పెద్ద ఎత్తున పాదచారులు వచ్చినప్పుడు అక్కడ ఉండే ట్రాఫిక్ సిబ్బంది దీన్ని ఆన్ చేస్తారు. వెంటనే ట్రాఫిక్ ఆగాలని, పాదచారులు రోడ్డు క్రాస్ చేస్తున్నారనే సంకేతం వాహనచోదకులకు కనిపిస్తుంది.
పాదచారులు రోడ్డు దాటిన తరవాత సిగ్నల్‌ను ఆఫ్ చేస్తారు. సాధారణంగా రోడ్డు క్రాసింగ్‌కు ఉపయోగపడే జీబ్రా క్రాసింగ్‌స రాత్రి పూట సరిగా కనిపించవు. అయితే ఈ సిగ్నల్‌స వల్ల పగలు, రాత్రి పాదచారులకు ఉపయుక్తమే. యుద్ధప్రాతికదికన వీటినైనా ఏర్పాటు చేస్తే పాదచారి కాస్తైనా ధైర్యంగా రోడ్డుపై అడుగుపెట్టగలుగతాడు.
కఠినమైన చట్టాలు అవసరం...
మా సంస్థ నగరంలో రోడ్డు భద్రత, పాదచారుల హక్కుల కోసం పోరాడుతోంది. నగరంలో పాదచారులకు భద్రత కరువయింది. రోడ్డు వినియోగం విషయంలో పాదచారుడికి అతి తక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. ఇక్కడ ఏ ప్రాంతంలోనూ సరైన ఫుట్‌పాత్‌స, పెడస్ట్రియన్ క్రాసింగ్‌సతో పాటు జంక్షన్‌సలోనూ అవసరమైన వసతులు లేవు. గతంలో అనేక ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. అయితే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రోడ్డుపై ప్రయాణించే వాహనాల సరాసరి వేగం గంటకు 50 కిమీ మించితేనే వీటిని నిర్మించాలి. సిటీలో ఇది 15.9 కిలోమీటర్లకు మించడం లేదు.
ఇక సబ్-వేల ఏర్పాటుకూ అనేక ఇబ్బందులు, భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయి. పాదచారుల భద్రత కోసం అవసరమైన ప్రతి ప్రాంతంలోనూ పెలికాన్ సిగ్నల్‌స ఏర్పాటు చేయాలి. ఉన్న మౌలిక వసతుల్ని సైతం వినియోగించకుండా అడ్డదిడ్డంగా రోడ్డు దాటే పాదచారులకు సైతం జరిమానా విధించాలి.
సింగపూర్‌లో ఇలా ఎవరైనా దాటితే మొదటిసారి రూ.20 వేలు, రెండోసారైతే రూ. 25 వేలు జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. మౌలిక వసతులతో పాటు ఇలాంటి కఠినమైన చట్టాలు సైతం రావాలి.
- సురేష్‌రాజు, వాద ఫౌండేషన్