సారీ మమ్మీ.. సారీ డాడీ | Hyderabad narayana college student disappears | Sakshi
Sakshi News home page

సారీ మమ్మీ.. సారీ డాడీ

Published Mon, Oct 16 2017 1:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Hyderabad narayana college student disappears - Sakshi

సాయిప్రజ్వల రాసిన లేఖ

సారీ మమ్మీ... సారీ డాడీ.. ఐ మిస్‌ యూ సోమచ్‌..  బై సన్నీ.. టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకో..బై అక్కా.. బాగా చదివి గ్రూప్స్‌ సాధించి నాన్నకు మంచి పేరు తీసుకురా.. నాకోసం వెతకొద్దు ప్లీజ్‌..వేస్ట్‌ నారాయణ కాలేజీ... క్లోజ్‌ ది నారాయణ కాలేజీ... నారాయణ కాలేజీ  కిల్లింగ్‌ ద స్టూడెంట్స్‌ టు రీడ్‌... సో ప్లీజ్‌ హెల్ప్‌ ద స్టూడెంట్స్‌ ఫ్రం నారాయణ. దే ఆర్‌ ఆర్‌ సఫరింగ్‌ ఇన్‌ దిస్‌ కాలేజీ, హాస్టల్‌... సారీ మమ్మీడాడీ  .’  
ఇది హైదరాబాద్‌ నారాయణ కాలేజీలో చదువుతూ తాజాగా అదృశ్యమైన విద్యార్థిని సాయి ప్రజ్వల వేదన.. కార్పొరేట్‌ కాలేజీల ఒత్తిడికి తట్టుకోలేక ఇంటర్‌ విద్యార్థులు ఎలా రాలిపోతున్నారో ప్రత్యక్ష నిదర్శనం ఈ లేఖ. ఈ మూడేళ్లలో ఏకంగా 60 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం నారాయణ తదితర కార్పొరేట్‌ కాలేజీల్లో నెలకొన్న తీవ్ర ఒత్తిళ్లను స్పష్టం చేస్తోంది. 

సాక్షి, అమరావతి: కార్పొరేట్‌ కాలేజీల ధనదాహానికి, చదువుల ఒత్తిడికి అమాయక విద్యార్థులు నేల రాలిపోతున్నారు. నారాయణ, చైతన్య కాలేజీల్లో భరించలేనంత ఒత్తిడికి గురై నిండు నూరేళ్ల జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. మొన్న కృష్ణా జిల్లా గూడవల్లిలో... నిన్న విజయవాడలో... నేడు హైదరాబాద్‌లో ఓ విద్యార్థిని ఒత్తిడికి తట్టుకోలేక అదృశ్యమైంది. హైదరాబాద్‌ సమీపంలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో బైపీసీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థిని సాయి ప్రజ్వల కొద్ది రోజులుగా కనిపించటం లేదు. కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖని మండలం అడ్డగుంటపల్లికి ఆమె తల్లిదండ్రులు ప్రజ్వల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించి కొద్ది రోజుల క్రితం నగరంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు.

అనంతరం విద్యార్థిని నారాయణ కాలేజీలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖ రాసి కనిపించకుండా పోయింది. కాలేజీలో ఏదో జరగటం వల్లే తమ బిడ్డ వెళ్లిపోయిందని విద్యార్థిని తండ్రి విద్యాగిరి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఇటీవల కడప  నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఒక్క ఈ వారం పది రోజుల్లోనే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బోధపడుతోంది. ఈ మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదు. కార్పొరేట్‌ కాలేజీలకు ప్రభుత్వం వంత పాడుతుండడమే పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణం. 

అడ్మిషన్ల నుంచే అవకతవకలు
కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ విద్యార్ధుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోవడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా అడ్మిషన్లు చేపట్టటమే. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, బోధించే వారిని నియమించకుండా ధన దాహంతో వ్యవహరిస్తున్నాయి. కాసుల కక్కుర్తితో ఇరుకు గదుల్లో విద్యార్ధులను కుక్కుతున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే సరిపోయే గదిలో ఏకంగా 8 నుంచి 10 మందిని కూర్చోబెడుతున్నాయి. కాలేజీలకు అడ్మిషన్ల సమయంలో సైన్సు, ఆర్ట్స్‌ తరగతులకు రెండేసి సెక్షన్లకు మాత్రమే అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం ఒక్కో తరగతిలో 80 మందిని చేర్చుకోవచ్చు. ఇలా తొలుత నాలుగు సెక్షన్లకు 320 మంది విద్యార్థుల కోసం వసతులు చూపించి అనుమతులు పొందుతున్న కార్పొరేట్‌ కాలేజీలు ఆ తరువాత 10 శాతం వెసులుబాటును ఆసరాగా చేసుకొని మరింత మందిని చేర్చుకుంటున్నాయి. అవే వసతుల్లో అదనపు  విద్యార్థులను కుక్కుతున్నాయి. వసతులు లేకుండా మరో 9 సెక్షన్లను ఏర్పాటు చేసి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఇలా మరో 720 మందితో పాటు అదనంగా మరో 10 శాతం నిబంధనతో విద్యార్థులను ఇబ్బడి ముబ్బడిగా చేర్చుకుంటున్నాయి. దీనికితోడు మరి కొంత మందిని పరీక్షల సమయంలో వేరే కాలేజీ విద్యార్ధుల కింద చూపించి పరీక్షలు రాయిస్తున్నాయి. కార్పొరేట్‌ కాలేజీల్లో ఒక్కో క్యాంపస్‌లో ఇరుకిరుకు గదుల్లో 2,500 మంది నుంచి 3 వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ముందు చూపించిన కొద్ది మంది బోధకులతోనే ఈ వేలాది మంది పిల్లలకు బోధన చేయిస్తున్నారు. మరోవైపు నిబంధనల ప్రకారం ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి ట్యూషన్‌ ఫీజు కింది రూ.2,800 వరకు వసూలు చేయాల్సి  ఉండగా రూ. 40,000 నుంచి రూ. లక్ష వరకూ గుంజుతున్నారు. హాస్టల్‌లో ఉంటే దీనికి మరో రూ. లక్ష అదనం.

ఇంటర్‌ బోర్డుపై కార్పొరేట్‌దే పెత్తనం
గాలి వెలుతురు లేని ఇరుకు గదులు, అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్ధులు మగ్గిపోతున్నారు. ఈ వ్యవహారాలన్నీ తెలిసినా కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధ బాంధవ్యాలతో ఇంటర్‌ బోర్డు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్వయంగా నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ కేబినెట్‌ మంత్రిగా ఉండగా ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో 3,500 వరకు జూనియర్‌ కాలేజీలు ఉండగా ఇందులో 525 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. తక్కిన కాలేజీలన్నీ కార్పొరేట్, ప్రైవేట్‌ యాజమాన్యాల చేతుల్లో ఉన్నవే. ప్రభుత్వ కాలేజీల్లో 3 లక్షల మంది విద్యార్ధులు చదువుతుండగా ప్రైవేట్‌ కాలేజీల్లో 7 లక్షల మంది చదువుతున్నారు. ఇంటర్మీడియెట్‌ బోర్డులో ఈ కాలేజీలదే పెత్తనంగా మారింది. 

సొంత సిలబస్‌...
కార్పొరేట్‌ కాలేజీలు ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ను పట్టించుకోకుండా తమ సొంత సిలబస్‌ను బోధిస్తున్నాయి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్, ఎంసెట్, నీట్‌ సహా ఇతర పరీక్షలకు వాటి దారి వాటిదే. పరీక్షలకు నెలన్నర ముందు మాత్రమే ఇంటర్‌ సిలబస్‌ను బోధిస్తున్నాయి. పదో తరగతి పాసై వచ్చిన విద్యార్థికి ఇంటర్‌  పాఠాలతో బోధన ప్రారంభిస్తే కొంతమేర అవగాహన ఏర్పడుతుంది. కానీ  ప్రారంభంలోనే జేఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల సిలబస్‌ను బోధిస్తుండడంతో విద్యార్ధులు బెంబేలెత్తిపోతున్నారు.  

రోజువారీ... వారాంతపు పరీక్షలతో ఒత్తిడి 
పదో తరగతి వరకు ఆటపాటలతోనో, ఒకింత స్వేచ్ఛగా చదివిన విద్యార్ధులు ఒక్కసారిగా పెరిగిన సిలబస్, ఆపై పోటీ పరీక్షల బోధనతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కార్పొరేట్‌ కాలేజీల్లో రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందులో వచ్చే మార్కులను అనుసరించి విద్యార్ధులను వేర్వేరు సెక్షన్లలోకి మార్పులు చేస్తున్నారు. ఒకవారం ఒక సెక్షన్లో ఉంటే మరో వారం మరో సెక్షన్లోకి వెళ్లాల్సి స్తోంది. దీంతో బోధకులు కూడా మారిపోతుండడం, పాఠ్యాంశాలు కూడా మారిపోతుండడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.

అర్హతలు లేని వారిని లెక్చరర్లుగా, వైస్‌ ప్రిన్సిపాళ్లుగా...
సరైన అర్హతలు లేని వారిని లెక్చరర్లు, వైస్‌ప్రిన్సిపాళ్లుగా నియమిస్తున్నారు. కనీసం సబ్జెక్టు గురించి అవగాహన లేని వారిని తీసుకోవటంతో విద్యార్ధులకు వచ్చే సందేహాలు కూడా తీర్చలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో తమ బలహీనతలు బయటపడకుండా ఉండడానికి ఇతరుల ముందే విద్యార్ధులను తిట్టడం, కొట్టడం ఇతర విపరీత చేష్టలకు లెక్చరర్లు దిగుతున్నారు. ఇది కూడా విద్యార్ధుల్లో అవమానానికి, ఆత్మన్యూనతకు దారితీస్తోంది. ఆయా లెక్చరర్లకు ఇచ్చే వేతనాలు రూ.9 వేల లోపే ఉండడంతో యాజమాన్యంపై కోపాన్ని విద్యార్ధులపై చూపిస్తున్నారు.

ఇంటర్‌బోర్డులో అరకొరగా సిబ్బంది....
కార్పొరేట్‌ కాలేజీలపై పర్యవేక్షణకు ఇంటర్‌ బోర్డులో తగినంత మంది సిబ్బంది లేరు. జిల్లాకొక ఆర్‌ఐవో పోస్టు ఉన్నా అందులో చాలావరకు ఖాళీగానో, ఇన్‌ఛార్జులతోనో నడుస్తున్నాయి. వారికింద సిబ్బంది లేరు. ఇక ఇంటర్‌ సగానికి పైగా పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం బోర్డులో ఎక్కువ శాతం మంది తెలంగాణకు వెళ్లిపోగా ఏపీలో నియామకాలు మాత్రం చేపట్టలేదు. దీంతో బోర్డులో  ఒక్కో అధికారి నాలుగైదు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. 

కాలకృత్యాలూ తీర్చుకోలేకపోతున్న విద్యార్ధులు
చదువుల ఒత్తిడితో దొరికిన కొద్ది సమయంలోనే కాలకృత్యాలు తీర్చుకోవలసిన దుర్గతిలో విద్యార్ధులుంటున్నారు. ఇక హాస్టళ్లలో యాజమాన్యాలు అందించే ఆహారం చాలా నాసిరకం. దాదాపు ఏకబిగిన రెండు గంటలసేపు సాగే స్టడీ అవర్‌లో వారు సూచించిన సబ్జెక్టును మాత్రమే విద్యార్ధులు చదవాలి. ఇష్టం లేకున్నా అవే పుస్తకాలు పట్టుకొని తీవ్ర మనస్తాపంతో జీవితంపై అనాసక్తి ఏర్పరచుకుంటున్నారు. వారానికో, నెలకో వచ్చే తల్లిదండ్రులను నిమిషాల వ్యవధిలోనే హడావుడిగా పంపేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement