వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: నారా లోకేష్
హైదరాబాద్: రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వెనకడుగు వేశారు. మాదాపూర్‌లోని ఒక హోటల్‌లో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకుల కుమారులకు లోకేష్ ఆదివారం విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కొంతకాలం కిందట నగర శివారులోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. దానికి సంబంధించి లోకేష్ ప్రత్యేకంగా సర్వే కూడా చేయించారు. అయితే మారిన పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.