తన రాజీనామతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామాను కూడా ఆమోదించాలని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కోరానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. శనివారం మీరాకుమార్ను కలిసిన అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ... తమ ఇద్దరి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారని అశాభావం వ్యక్తం చేశారు.
తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిన్న న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మేకపాటి ఆరోపించారు. సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు.
అనంతరం ఆమె హైదరాబాద్ తిరిగి వెళ్లారని మేకపాటి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో పూచికపుల్ల దొరికినా తెలుగుదేశం పార్టీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని మేకపాటి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల మహా ప్రవాహాంలో టీడీపీ కొట్టుకుపోతుందన్నారు.