'నా అధికారాలు నాకు తెలుసు'
-
సీఈఓ భన్వర్‌లాల్‌కు గవర్నర్ ఘాటు లేఖ
-
ఇంకా రగులుతున్న వీడియో కాన్ఫరెన్స్ చిచ్చు
-
గవర్నర్ కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తారన్న
-
సీఈఓ నోట్‌పై అసహనం..
-
ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలు చేయాలని లేఖలో సూచించిన నరసింహన్?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా సోమవారం నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకున్న గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. తన అధికారాలు, పరిమితులు ఏమిటో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ పేర్కొనటంపై గవర్నర్ ఆగ్రహానికి గురైనట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో నరసింహన్ ‘నా అధికారాలు నాకు తెలుసు’ అనే రీతిలో భన్వర్‌లాల్‌కు ఓ ఘాటు లేఖ రాశారు. పైగా ఆ లేఖలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలంటూ భన్వర్‌లాల్‌కు సలహా ఇచ్చారనీ తెలిసింది. వాస్తవంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అప్పటి వరకు సీఎంగా, మంత్రులుగా ఉన్న వారందరి అధికారాలకు కత్తెర పడుతుంది. సీఎం ఏ జిల్లా కలెక్టర్‌ను గానీ, ఏ అధికారిని గానీ పిలవటానికి వీల్లేదని, ఎటువంటి సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి చెపుతోంది. రాష్ట్రపతి పాలనలో భాగంగా గవర్నర్ రాష్ట్ర పాలనా పగ్గాలను చేపట్టారు.
ఈ నేపథ్యంలో నరసింహన్ సోమవారం ఏడు కీలకాంశాలు- శాంతిభద్రతలు, సాధారణ ఎన్నికలు, విద్యుత్ సరఫరా, గ్రామీణ తాగునీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య రంగాలపై - జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి నోట్ ద్వారా తెలియజేసింది. అయితే మహంతి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గవర్నర్ సమీక్ష అంశాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. అంతేగాక సం బంధిత ఫైలును భన్వర్‌లాల్‌కు మార్కు చేశారు.
గవర్నర్ సమీక్షపై భన్వర్‌లాల్ స్వయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్ దృష్టికి భన్వర్‌లాల్ ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. సంపత్ సూచనలు, ఆదేశాలకనుగుణంగానే సంబంధిత ఫైలుపై భన్వర్‌లాల్.. గవర్నర్ కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తారని, ఈ విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌తో చర్చించటం జరిగిందని, తగిన చర్యలు తీసుకోవాలని రాశారు. సీఎం స్థానంలో పరిపాలన వ్యవహారాలను గవర్నర్ చూస్తున్నందున సమీక్షలు చేయటం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందనేది కేంద్ర ఎన్నికలసంఘం భావనగా ఉంది.
అయితే వుుందే ఖరారైన వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకోవాల్సి రావ టం గవర్నర్‌కు రుచించలేదు. పైగా గవర్నర్ కూడా కోడ్ పరిధిలోకి వస్తారంటూ భన్వర్‌లాల్ ఫైలులో పేర్కొనటం ఆయున్ని అసహనానికి గురిచేసినట్లు సవూచారం. ఈ నేపథ్యంలో భన్వర్‌లాల్‌కు ఘాటైన లేఖ రాస్తూ.. తన అధికారాల గురించి చెప్పన క్కర్లేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తే చాలనే అర్థ్ధం వచ్చేలా గవర్నర్ పేర్కొన్నట్లు సమాచారం.