
రాయవరం(మండపేట): ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై అభిమానమే తనను సినీ రంగం వైపు వెళ్లేలా చేసిందని వర్ధమాన సినీ దర్శకుడు నాగప్రభాకర్ అన్నారు. తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకుని ఉత్తమ దర్శకుడిగా రాణించాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. శనివారం రాయవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. మండపేట నుంచి చెన్నై వెళ్లిన తాను తొలుత ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు వద్ద ‘బొంబాయి ప్రియుడు, పెళ్లిసందడి’ సినిమాలకు, అనంతరం ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్ వద్ద ‘చెప్పాలని ఉంది, అయోధ్య రామయ్య సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేశానన్నారు. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పనిచేశాక రామ్‌గోపాల్‌వర్మపై ఇష్టంతో ఆయన పేరుతోనే తొలిసారిగా సినిమాకు దర్శకత్వం వహించానన్నారు. అనంతరం ‘డీటీఎస్ నిశ్శబ్దం, తరువాతి కథ’ చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు.
లవ్, థ్రిల్లర్‌గా ‘శివరంజని’
వ్యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘శివరంజని’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు. నందు, రష్మి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నందినిరాయ్, ధనరాజ్, ఢిల్లీ రాజేశ్వరి, రాజేంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారన్నారు. పూర్తిగా లవ్ అండ్ థ్రిల్లర్‌గా ఆద్యంతం సస్పెన్స్‌తో సినిమా ఉంటుందన్నారు. చివరి అర్ధగంట భాగం సినిమాకు ప్రాణం పోస్తుందన్నారు. సంగీతాన్ని శేఖర్‌చంద్ర అందిస్తుండగా, కెమెరామెన్‌గా సురేందర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి, చివరి షెడ్యూల్ చేస్తున్నామన్నారు. రెండు పాటలు మినహా టాకీ భాగం పూర్తి అయినట్లేనన్నారు. ఫిబ్రవరిలో సినిమా విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment