అందరికీ అండగా ఉంటా
ఎల్లవేళలా అందరికీ అండగా ఉంటానని జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘నాలుగు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం రాగానే అవ్వ, తాతల పింఛన్లు రూ.700కు పెంచుతా.. అంటూ వృద్ధులకు ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలో నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర తొమ్మిదో రోజు మంగళవారం సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో సాగింది. జననేతకు అడుగడుగునా జనం అపూర్వ స్వాగతం పలికారు. మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్:
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నాటి యాత్ర బీఎన్.కండ్రిగ మండలంలోని నీర్పాకోట గ్రామం నుంచి ప్రారంభమైంది. తన కోసం వేచి ఉన్న గ్రామస్తులు, మహిళలను ఆయన పలకరించారు. అక్కడ నుంచి నీర్పాకోట ఎస్సీ కాలనీకి చేరుకుని దళిత మహిళలు, యువకులను పలకరించారు. నీర్పాకోట పోలీసుస్టేషన్ సమీపంలో గిరిజనుల వద్ద ఆగి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీఎన్.కండ్రిగలో జరిగిన బహిరంగసభలో జననేత పాల్గొన్నారు. బీఎన్.కండ్రిగలో నాలుగు చోట్ల మహిళలు గుంపులు గుంపులుగా కాన్వాయ్‌ను ఆపి తమ అభిమాన నాయకుడిని కలుసుకున్నారు. వీరందరినీ జననేత ఆశీర్వదించారు. వృద్ధులను పలకరించారు. రోడ్ షోలో ఒక మహిళ జగన్‌ను కలిసి బీఎన్.కండ్రిగలో బ్రాందీషాపులు ఎత్తేయాలని వినతిపత్రం సమర్పించారు. ఉదయం నుంచే పురుషులు తాగుతున్నారని, కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని చెప్పారు. బీఎన్.కండ్రిగ శివార్లలో గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ జగన్‌కు స్వాగతం పలికారు. ఇక్కడ రోడ్డు పక్కన ఆపివున్న బస్సుల పైకి యువకులు ఎక్కి వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు ఊపుతూ జగన్‌కు స్వాగతం పలకడం కనిపించింది.
వృద్ధులకు భరోసా
బీఎన్.కండ్రిగ శివార్ల నుంచి కొంచెం ముందుకు రాగానే ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వలస రైతుకూలీలు చెరుకు కొట్టడం ఆపి రోడ్డుపైకి వచ్చి జగన్‌ను కలిశారు. వారి సమస్యలను ఆయన ఓపిగ్గా విన్నారు. కూలీల్లో ఓ వృద్ధురాలు నాయనా.. ఈ వయసులోనూ కష్టపడుతున్నాం, ఆర్థికంగా చాలడం లేదని జగన్ దృష్టికి తెచ్చారు. జననేత స్పందిస్తూ ‘అవ్వా నీలాంటి వాళ్లు కష్టపడాల్సిన అవసరం లేదు, త్వరలో మన ప్రభుత్వం రాగానే మీకు పింఛన్ పెంచుతాం. పిల్లల తల్లులూ భయపడాల్సిన పనిలేదు. ఇద్దరు పిల్లలు ఉంటే వారికి ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున ఆ తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే వృద్ధుల పింఛన్, అమ్మ ఒడి పథకాలపై సంతకాలు చేస్తా’ అని భరోసా ఇచ్చారు. చిన్నపిల్లలను పలకరిస్తూ నువ్వు బడికిపోవాలి, నువ్వూ బడికి పోవాలి అంటూ వారిని ముద్దాడి ఆశీర్వదించారు. తర్వాత 10వ మైలు వద్దకు రాగానే నెల్లూరు జిల్లా మతకామూడి గ్రామం నుంచి వచ్చి తోటలో గెరిక్కాయలు కోస్తున్న కూలీలు జగన్‌ను చూసి రోడ్డుపైకి పరుగున చేరుకున్నారు. వీరిని చూసిన జగన్ కాన్వాయ్ ఆపారు. తమకు ఉపాధిహామీ పనుల్లో తగినంత కూలి రావడం లేదని జననేతకు ఫిర్యాదు చేశారు. అందుకోసమే ఇలా పక్క జిల్లాకు వచ్చి పనులు చేసుకుంటున్నామని తెలిపారు.
నాన్నంత గొప్పవాడు కావాలి
మయూరి షుగర్‌ఫ్యాక్టరీ వద్ద వృద్ధులు తమకు పింఛన్ రావడం లేదని, ఒకరిద్దరికి వస్తున్నా అది చాలడం లేదని జగన్ దృష్టికి తెచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఒక మధ్యవయస్కురాలు ముందుకు వచ్చి జగనయ్యా నువ్వు మీ నాన్నంత గొప్పవాడు కావాలని దీవించింది. అరిగలకండ్రిగ వద్దకు రోడ్‌షో రాగానే రైతులు జగన్‌ను కలిసేందుకు తోసుకు వచ్చారు. వీరందరికీ జననేత అభివాదం చేసి సమస్యలు విన్నారు. బ్యాంకు రుణంపై వడ్డీభారం పెరుగుతోందని రైతులు చెప్పారు. బ్యాంకులో రూ.20 వేలు రుణం తీసుకుంటే ఇప్పుడు వడ్డీతో సహా రూ.70 వేలు కట్టమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అన్యాయమని, ప్రభుత్వంలోకి రాగానే రైతుల వడ్డీ సమస్యను పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఒక మహిళ అన్నా గ్యాస్ సబ్సిడీ రావడం లేదు, పూర్తి డబ్బులు కట్టి గ్యాస్ తీసుకుంటున్నామని తెలిపారు. జగన్ స్పందిస్తూ అవునమ్మా ఈ ప్రభుత్వం చేస్తున్నదంతా మోసమేనన్నారు. అక్కడి నుంచి కాటూరు చేరుకుని జననేత రోడ్ షో నిర్వహించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆలత్తూరు రోడ్డు, కత్తివారికండ్రిగల్లోనూ జనం సమస్యలు తెలుసుకుంటూ కదిలారు. స్థానికులు సమైక్యాంధ్ర జెండాలతో ఎదురెళ్లి ఆహ్వానించారు.
వీఎంపల్లెలో ఓదార్పు
శ్రీకాళహస్తి సమీపంలోని వీఎంపల్లెలో జననేత ఓదార్పులో పాల్గొన్నారు. మహానేత వైఎస్‌ఆర్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమాని పసల చిన్నపాపయ్య మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సమస్యలు విన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ వరప్రసాద్, కార్మికవర్గ కన్వీనర్ బీరేంద్ర వర్మ, పార్టీ నాయకులు వై.సురేష్, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.