గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వద్ద ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించింది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిమ్మగడ్డ రమేశ్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వద్ద ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించింది. పదోన్నతిపై ఆయన రాజ్‌భవన్‌లోనే కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అణుశక్తి విభాగం(కేంద్ర సర్వీసు) అదనపు కార్యదర్శిగా ఉన్న ఏపీ కేడర్ అధికారి సీబీఎస్ వెంకటరమణకు కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించింది. నిమ్మగడ్డ రమేశ్ గతంలో టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్నప్పుడు ‘వ్యాట్’ అమలు చేశారు. గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా బదిలీ కావడానికి ముందు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.
1989 బ్యాచ్ వారికి కూడా: 1989 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు కూడా కార్యదర్శుల నుంచి ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వారు పనిచే స్తున్న చోటే పోస్టింగ్‌లు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ అదే స్థానంలో, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి కరికాల వలెవన్ ముఖ్య కార్యదర్శిగా అదే స్థానంలో కొనసాగనున్నారు. రాష్ట్ర ఆర్థికసంస్థ మేనేజింగ్ డెరైక్టర్ పి.సత్యనారాయణరావుకు పదోన్నతి కల్పించి అక్కడే నియమించారు. శాంతికుమారికి పదోన్నతి కల్పించినా ప్రస్తుతం సెలవులో ఉన్నందున పోస్టింగ్ ఇవ్వలేదు.
ముగ్గురు ఐజీలకు అదనపు డీజీలుగా పదోన్నతి
రాష్ట్ర పోలీసు విభాగంలో ఐజీలుగా పని చేస్తున్న 1989 బ్యాచ్ అధికారులకు అదనపు డీజీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు, ఉమేష్ షరాఫ్, సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ జాబితాలో ఉన్నారు.