బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
- 8 నుంచి అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు
- అధికారులతో సమీక్షించిన జేఈవో పోలా భాస్కర్
తిరుచానూరు, న్యూస్‌లైన్ : వడమాల పేట మండలం అప్పలాయగుంటలో వె లసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ పిలుపునిచ్చారు. జూన్ 8 నుంచి 16వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం ఆలయ ప్రాంగణంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు.
జూన్ 11న నిర్వహించే కల్యాణోత్సవం సందర్భంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లావ్యాప్తంగా 15 ప్రముఖ ఆలయాల నుంచి స్వామికి వస్త్రాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 12న జరిగే గరుడసేవకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసులహారాన్ని శోభాయాత్రగా తీసుకురానున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులను అందించాలని ఆదేశించారు.
జూన్ 4 నుంచి తిరుపతి పరిసర గ్రామాలకు ప్రచార రథాలను పంపి బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించాలని కోరారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తిభావం వెల్లివిరిసేలా ధార్మికోపన్యాసాలు, హరికథలు, జానపద కళారూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి నుంచి ప్రతి అరగంటకో బస్సు నడపాలని, గరుడసేవ, రథోత్సవం రోజుల్లో వీటి సంఖ్యను పెంచాలని ఆర్టీసీ అధికారులను కోరారు.
బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించా రు. పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండాలని, మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమీక్ష సమావేశంలో స్థానిక ఆలయాల స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, డీపీపీ ప్రత్యేకాధకారి రఘునాథ్, ఎస్టేట్ అధికారి దేవేందర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో బాలాజీ, ఎస్వీ గోశాల డెరైక్టర్ హరినాథరెడ్డి, శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, ఏఈవో నాగరత్న, ఆలయ ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.