భైంసా/ముథోల్, న్యూస్‌లైన్ : ‘సార్ మేమంతా ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాం. చచ్చిపోవటానికి కాదు. ప్లీజ్ సార్.. మా మాట వినండి.. ఆడ పిల్లల ఇబ్బందులు తెలుసుకోండి సార్..’ అంటూ ఏడుస్తూ బాసర ట్రిపుల్ ఐటీ పిల్లలు తమ బాధలను రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి ఆఫ్ టెక్నాలజీ (ఆర్‌జేయూకేటీకే) వైస్‌చాన్స్‌లర్ రాజ్‌కుమార్‌కు మొరపెట్టుకున్నారు. సమస్యలపై సమాధానం చెప్పాలంటూ విద్యార్థులు పట్టుబట్టి వీసీని ఘెరావ్ చేశారు.
ఒకింత అసహనానికిలోనై పోలీసులతో కార్యాలయానికి చేరుకున్న వీసీ రాజ్‌కుమార్ వెనకాలే పిల్లలంతా వెళ్లారు. కార్యాలయం ముందే కూర్చుని వీసీ కోసం ఎదురుచూశారు. తదుపరి వచ్చిన వీసీ రాజ్‌కుమార్‌కు ఇబ్బందులను, వేధింపులను విద్యార్థులు తేటతెల్లం చేశారు.
వెలువెత్తిన సమస్యలు..
బాసర ట్రిపుల్‌ఐటీలో సమస్యల పరిష్కారం కోరుతూ ఎనిమది రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో వేల మంది విద్యార్థులతో వీసీ రాజ్‌కుమార్, ప్రొఫెసర్‌ల బృందం చర్చలకు దిగింది. వీసీ రాజ్‌కుమార్ సమస్యలపై ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల లక్ష్యంపై ప్రసంగంలో పలు సూచనలు చేశా రు. వేల మంది విద్యార్థులతో ఉన్న కళాశాలలో ఇబ్బం దులు ఉంటాయని, వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలిపారు. శనివారం విద్యార్థులు మాట్లాడిన తీరు తనను బాధించిందన్నారు. దీంతో అక్కడే ఉన్న ఓ వి ద్యార్థి వీసీ కాళ్లు పట్టుకుని తండ్రిలా క్షమించాలని వేడుకున్నాడు.
అనంతరం విద్యార్థులు సమస్యలపై ప్రశ్నిం చారు. తీసుకునే చర్యలను ఇప్పుడే వివరించాలని విద్యార్థులు పట్టుబట్టడంతో వీసీ అసహనంతో వెళ్లిపోయారు. విద్యార్థినులంతా తమ సమస్యలు వినాలంటూ మానవహారంగా ఏర్పడి వీసీని చుట్టుముట్టారు. మళ్లీ వచ్చి చర్చలు ప్రారంభించినా ఏ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చర్చలు సఫలం కాకుండానే ఎలా వెళ్లిపోతారని విద్యార్థులు వేడుకున్నా వీసీ పోలీసులతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు.
వెనకాలే వెళ్లిన విద్యార్థులు చాలాసేపు అక్కడే నిరీక్షించారు. తదుపరి ఆయన వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. బాసర ట్రిపుల్‌ఐటీలో వీసీగా మీరు కష్టపడితే.. ఇక్కడ పనిచేసే వారు మా భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, తాము కోరే విధంగా ఆ ఐదుగురిని శాశ్వతంగా తప్పిస్తే యూనివర్సిటీకి మంచి పేరు వస్తుందన్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే తమ బతుకులు ఇలా నాశనమవుతున్నాయంటూ విద్యార్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎనిమిది రోజులుగా నిద్రహారాలు మాని నిరసనలు చేపట్టామని ఆవేదన చెందారు.
కమిటీ వేశాం..
సమస్యల పరిష్కారానికి ప్రొఫెసర్‌ల కమిటీ వేశామని, త్వరలోనే విద్యార్థులు సూచించిన విషయాలపై తమ నిర్ణయం వెల్లడిస్తామని వీసీ రాజ్‌కుమార్ చెప్పుకొచ్చారు. ఇక్కడే నిర్ణయం వెల్లడించాలని కోరడం సరికాదన్నారు. మెస్ నిర్వహణ విషయంలోనూ సభ్యులతో మాట్లాడుతానని, విద్యార్థులు తరగతులకు వెళ్లాలని వీసీ రాజ్‌కుమార్ సూచించారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీసీతో ఆవరణలో వేలాది మంది విద్యార్థులు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి 10 మంది విద్యార్థుల బృందాలను ఏర్పాటు చేసి మాట్లాడేందుకు వీసీ అవకాశం ఇచ్చారు. ఇలా బృందాలను కార్యాలయంలోకి పిలిపించుకుని జరిగిన విషయాలను తెలుసుకున్నారు.
మీ వెంటే నేను...
ఇదిలా ఉంటే.. ట్రిపుల్‌ఐటీకి చేరుకున్న ఎమ్మెల్యే వేణుగోపాలాచారి వీసీతో చర్చించాక విద్యార్థులతో మాట్లాడారు. ‘మీతోపాటే నేను’ ఉంటానని, ‘మీ సమస్యలు వీసీ దృష్టికి తీసుకెళ్లానని’ చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాంరెడ్డిని పిలిపించి మార్చి 20వరకు నీటి సమస్య తీరే లా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆ అధికారితో చెప్పించారు. తాత్కాలికంగా భైంసా మున్సిపాలిటీ నుం చి ట్రిపుల్‌ఐటీకి ట్యాంకర్లను పంపిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం భైంసా ఏరియా ఆస్పత్రి లో చర్చించినట్లు వెల్లడించారు. కాగా.. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల చర్చలు రాత్రి కూడా వీసీతో కొనసాగాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు.
చదువుకునేందుకు వచ్చాం.. చచ్చేందుకు కాదు
Published Mon, Mar 3 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement