కందుకూరు రూరల్: ఇసుక రీచ్‌లు అధికార పార్టీ నాయకులకు కల్పతరువుగా మారాయి. ఇసుక రీచ్‌ల నిర్వహణంతా పేరుకే గ్రామైక్య సంఘాలది..పెత్తనం మాత్రం అధికార పార్టీ నాయకులది. ఒక ట్రక్కు నగదు చెల్లించి..పది ట్రక్కు ఇసుక తరిస్తున్నారు. అక్రమంగా వెళ్లే ఇసుక సొమ్ముంతా అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ట్రాక్టర్ యజమానులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారికంగా ప్రభుత్వం ఇసుక రీచ్‌లు ప్రారంభించి అధికార పార్టీ నాయకులకు అప్పగించినట్లుంది.
డ్వాక్రా సంఘాల ముసుగులో...
ఇసుక రీచ్‌లను డ్వాక్రా మహిళలకు అప్పగిస్తూ ఇటీవల కలెక్టర్ మండలంలోని పాలేరు, మన్నేరుల్లో ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. సమీపంలోని గ్రామాల డ్వాక్రా మహిళలకు ఇసుక అమ్మకాల బాధ్యత అప్పగించారు. పేరుకు గ్రామైక్య సంఘాలే కానీ..పరోక్షంగా అధికార పార్టీ నాయకులకు అప్పగించినట్లుంది. కలెక్టర్ రీచ్‌లను ప్రారంభించారే తప్ప విక్రయాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించిన దాఖలాలు లేవు.
నిబంధనలిలా..
మండలంలోని పాలేరు, మన్నేరుల్లో ఇసుర రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు గుర్తించారు. గ్రామైక్య సంఘ అధ్యక్షురాలి పర్యవేక్షణలో ఇసుకను విక్రయించాల్సి ఉంది. ఆయా గ్రామాల వద్ద స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ముందుగా ఇసుకను అక్కడ నిల్వ చేస్తారు. స్టాక్ పాయింట్ నుంచి ఇసుక కొనుగోలు చేసుకొని వెళ్లాలి. క్యూబిక్ మీటరు 600 చొప్పున ఒక ట్రాక్టర్‌కు మూడు క్యూబిక్ మీటర్లు పడుతుంది.
ఒక ట్రాక్టర్ ట్రక్కుకు 1800 మీ సేవలో గానీ బ్యాంక్‌లో కానీ చెల్లించి సంబంధిత రసీదును గ్రామైక్య సంఘం బాధ్యులకు చూపిస్తే ఇసుక విక్రయిస్తారు. అంతే కాకుండా గ్రామైక్య సంఘం వారు ఐదు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుంటారు. నేరుగా గ్రామైక్య సంఘాల వారు ఇసుకను తరలించాలంటే రెండు కిలోమీటర్లు లోపు 250, పది కిలోమీటర్లలోపు 500 చెల్లించాలి. ఆ తర్వాత కిలోమీటరుకు 25 చొప్పున చెల్లిస్తే ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇసుక నదిలో ఒకరు, స్టాక్‌పాయింట్ వద్ద ఒకరిని నియమించాల్సి ఉంది.
నదిలో ఎన్ని ట్రక్కుల ఇసుక ఎత్తారు... స్టాక్‌పాయింట్ వద్ద ఎన్ని ట్రక్కులు పోశారు, ఎన్ని ట్రక్కులు విక్రయించారో రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంది. ఇందు కోసం ఒక కంప్యూటర్‌ను కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత జీపీఆర్‌ఎస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇసుక వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని 25 శాతం గ్రామైక్య సంఘాలకు, 75 శాతం రైతు సాధికార సంస్థకు వెళ్తుందని వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ ఇవేమీ అక్కడ జరగడం లేదు.
జరుగుతోందిలా..: కందుకూరు మండల పరిధిలోని పాలూరు, మాచవరం గ్రామం వద్ద మన్నేరులో, విక్కిరాలపేట వద్ద పాలేరులో ఇసుక రీచ్‌లను ప్రారంభించారు. రీచ్‌లను పేరుకే గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. పెత్తనం అంతా ఆయా గ్రామాల నాయకులదే. ఒక ట్రాక్టర్ ట్రక్కుకు నగదు బ్యాంక్‌లోగానీ, మీ సేవాలో గానీ చెల్లించి రసీదు తీసుకొస్తున్నారు.
ఆ రసీదుపై ఒక ట్రక్కు ఇసుక మాత్రమే ఇవ్వాల్సి ఉంది. కానీ నాయకులకు ఎంతో కొంత ముట్టజెప్పి అనేక ట్రక్కులు తీసుకెళ్తున్నారు. నిబంధనల మేరకైతే 1800లు చెల్లించాలి. కానీ నాయకులకు 1000ల నుంచి 1500లు చెల్లిస్తే చాలు ట్రక్కులు ఇసుకతో నింపి పంపిస్తున్నారు. ఇలా అడ్డదారిలో ఇసుక విక్రయిస్తూ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. మధ్యలో ఎవరైనా ట్రాక్టర్లను తనిఖీ చేస్తే ఒక ట్రక్కుకు తీసుకున్న రసీదును చూపిస్తూ ట్రాక్టర్ యజమానులు తప్పించుకుంటున్నారు.
పాలూరు వద్ద మన్నేరులో ఇప్పటి వరకు 19 వేల ఇసుక వ్యాపారం జరిగింది. దీని ప్రకారం నదిలో 31 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వకాలు జరిగి ఉండాలి. కానీ నదిలో చూస్తే భారీగా క్వారీలు ఏర్పడి ఉన్నాయి. దీనిని చూస్తే ఇసుక అక్రమంగా ఎంత తరలి వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. స్టాక్‌పాయింట్ వద్ద నుంచి విక్రయాలు నిర్వహించాల్సి ఉండగా నేరుగా మన్నేరులో నుంచే ఇసుక విక్రయిస్తున్నారు. స్టాక్ పాయింట్ వద్ద కొన్ని ఇసుక ట్రక్కులు తోలినప్పటికీ ఇక ట్రక్కు కూడా విక్రయించలేదు. మాచవరం, విక్కిరాలపేట వద్ద కూడా ఇదే పరిస్థితి. ఇసుక తరిలించే నదుల వద్ద ఒక్కరు కూడా గ్రామైక్య సంఘం మహిళ కనిపించడం లేదు. అంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడిచిపోతోంది.
పట్టించుకోని అధికారులు..
ఇసుక రీచ్‌ల వద్ద వ్యాపారం ఎలా జరుగుతుందో పరిశీలించాల్సిన అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక రీచ్‌ల వద్ద శిక్షణ పొందిన వారిని నియమించాల్సి ఉన్నా ఇంత వరకు దాని ఊసులేదు. రీచ్‌ల వద్ద పర్యవేక్షణకు నియమించిన వారు శిక్షణలో ఉన్నారని ఐకేపీ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఇసుక విక్రయాలు నిలిపేయాలని కొందరు గ్రామస్తులు ప్రశ్నించినా అధికారులు పెడచెవిన పెడుతున్నారు.
ఇసుకే మేత
Published Tue, Nov 18 2014 2:12 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement
Advertisement