సాక్షి, ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని ఏకైక ప్రభుత్వ స్పెషాలిటీ వైద్యశాల ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో పెస్ట్ కంట్రోల్ పేరుతో గత టీడీపీ ప్రభుత్వం ప్రజల సొమ్మును కాంట్రాక్టర్‌లకు దోచిపెట్టింది. దీనికి ఉదాహరణగా పెస్ట్ కంట్రోల్ పేరు పెట్టి ఒక బల్లిని పట్టుకుంటే రూ.3 వేలు, ఎలుకను పట్టుకుంటే రూ.10 వేలు, పామును పట్టుకుంటే రూ.15 వేలు చొప్పున పాయింట్లు వేస్తూ కాంట్రాక్టర్‌కు కనక వర్షం కురిపించారు. ఇలా గడిచిన మూడు సంవత్సరాలుగా దాదాపు కోటిన్నరకు పైగా ప్రజా ధనాన్ని దోచిపెట్టి తమ మమకారాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం కూడా వీరే పెస్ట్ కంట్రోల్ పేరుతో నెలకు లక్షలు స్వాహా చేస్తున్నారు.
గుంటూరు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో 2016లో ఓ చిన్నారిని ఎలుకలు కొరకడం, అనంతరం శిశువు మృతి చెందడంతో ఎలుకలను పట్టుకునేందుకు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసి ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే అదనుగా ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పెస్ట్ కంట్రోల్ పేరుతో ఎలుకలు పట్టేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన పద్మావతి అనే సంస్థకు పెస్ట్ కాంట్రాక్టును అప్పగించారు. నెల కు రూ.4 లక్షలు ఎలుకలను పట్టే దానిని బట్టి లేదా అంతకంటే కంటే ఎక్కువే ఇవ్వాలని కాంట్రాక్టులో పేర్కొన్నారు.
చిత్తూరు కాంట్రాక్టర్‌కు అప్పగింత:
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడి సంస్థ పద్మావతి పెస్ట్ కంట్రోల్ అనే పేరుతో ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో పెస్ట్ కంట్రోల్ పనులను దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కింద ఆరుగురు ఉద్యోగులు రెండు షిఫ్టులలో పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం నలుగురు సిబ్బంది ఒకే షిఫ్టులో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పని చేస్తున్నారు. వైద్యశాలలో లేని ఎలుకలు, బల్లులు, పాములు పట్టుకున్నట్లు లెక్కల్లో చూపిస్తూ లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు.
ఇలా ఉండగా ప్రజల సొమ్మును అప్పనంగా కాజేయడానికి అలవాటు పడిన కాంట్రాక్టర్ ప్రస్తుతం జూలైకు కాంట్రాక్టు ముగియడంతో ముందుగానే మే 22వ తేదీనే కాంట్రాక్టును మరో రెండు సంవత్సరాలు పాటూ పొడిగిస్తూ ఉత్తర్వులను తెచ్చుకున్నట్లు సమాచారం. పెస్ట్ కంట్రోల్ పేరుతో 2016 జూన్‌లో కుదుర్చుకున్న ఒప్పందం మొన్నటి జూన్‌తో ముగిసినప్పటికీ.. ఎలుకలు, బల్లులు, దోమలు, పాములు ప్రస్తుతం కూడా పడుతున్నట్లు నటిస్తూ కాంట్రాక్టరు నగదును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
దొంగ లెక్కలతో బిల్లులు స్వాహా..
వాస్తవానికి ఒంగోలు ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో మొదట్లో కొన్ని పాములు ఉండేవి, అనంతరం వాటిని పట్టుకోవడంతో పాటూ జనసంచారం కూడా పెరగడంతో అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం వైద్యశాలలో దోమలు తప్ప మరేవి కనబడటంలేదు. అయినా కాంట్రాక్టులో భాగంగా పట్టని దోమలను, ఎలుకలను, బల్లులను, పాములను లెక్కల్లో చూపించి ప్రతి నెలా బిల్లులను డ్రా చేస్తున్నారు. పెస్ట్ కాంట్రాక్టరు గత సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించారు. ఎన్ని పాయింట్లు కావాలంటే అన్ని పాయింట్లు వేసి మరీ బిల్లులు చెల్లించారు. పట్టింది వేళ్లమీద లెక్కపెట్టవచ్చు అయితే లెక్కల్లో మాత్రం వందల సంఖ్యలో బల్లులు, ఎలుకలు పట్టుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలైంది. సిబ్బందికి పీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి ఏమీ సదరు సంస్థ చెల్లించడం లేదు.
కేవలం నామమాత్రపు జీతం రూ.7 వేలే ఇస్తూ వస్తోంది. ఓట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం నెలకు రూ.12 వేల వరకూ జీతాలు చెల్లించాలని జీవోలు ఉన్నా కాంట్రాక్టర్ పట్టించుకోవడంలేదు. నలుగురు సిబ్బందే వైద్యశాల, వైద్య కళాశాల, మెడికల్ విద్యార్థుల వసతి గృహాలు, ఎస్‌ఆర్‌ల వసతి గృహాల్లో కూడా పెస్ట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ మాత్రం నెలకు రూ.4.75 లక్షలకు పైగా నగదు తీసుకుంటాడు. మార్చి 10 నుంచి మే 23 వరకూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా అధికారులు పట్టించుకున్నట్లు కనబడటం లేదు. మే 20వ తేదీతో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టును మరో రెండు సంవత్సరాల పాటూ పొడిగిస్తూ డీఎం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని ప్రస్తుత కాంట్రాక్టర్ పని జరిపిస్తూ లబ్ధి పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment