కమలనాథనాయుడు, గోవిందయ్య, శ్రీనివాసులు నాయుడు, రామచంద్రనాయుడు, బాలాజీ...ఇలా చెప్పుకుంటూపోతే జిల్లాలో వేలాది మంది అన్నదాతలు రుణమాఫీ కోసం ఇంకా బ్యాంకులు, తహశీల్దారు కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో రుణమాఫీ ఫిర్యాదుల విభాగానికి వెల్లువలా వస్తున్నారు.
- వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
- ఆరు రోజుల్లో 900 వినతులు
- జిల్లా నలుమూలల నుంచి తరలి వస్తున్న రైతులు
సాక్షి, చిత్తూరు: రుణమాఫీపై ప్రభుత్వం ఏప్రిల్ 27 నుంచి మే నెల 15 వరకూ ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆరు రోజుల్లో వెయ్యి ఫిర్యాదులు అందినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.
జిల్లాలో చిత్తూరు,తిరుపతి,మదనపల్లె రెవిన్యూ డివిజన్ల పరిధిలో 66 మండలాలున్నాయి. కానీ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మాత్రమే ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. అయినా మారుమూల ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి రోజుకు రెండు వందల మంది అన్నదాతలు జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఫిర్యాదుల విభాగం పెడితే రుణమాఫీకి సంబంధించి వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. దాని నుంచి తప్పించుకునేందుకు అధికారులు ఈ విభాగాన్ని జిల్లా కేంద్రానికే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు రైతుల ఫిర్యాదుల నమోదుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తొలిరోజు వినతిపత్రం తీసుకుని మరుసటి రోజు రమ్మంటూ వాయిదాలు వేస్తున్నారని పలువురు రైతులు ‘సాక్షి’కి తెలిపారు.
ఇప్పటిదాకా మాఫీ అయిన తీరు ఇదీ ...
జిల్లాలో మొత్తం 8,70,321 మంది రైతులు 2013 డిసెంబర్ 31నాటికి వివిధ బ్యాంకుల్లో * 11,180.25 కోట్ల రుణాలు తీసుకున్నారు. బ్యాంకులు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా 5.63 లక్షల మంది రుణమాఫీకి అర్హులంటూ ప్రభుత్వానికి నివేదించారు. మొదటి విడతలో 3,06,544 మంది,రెండో విడత 1,42,229 మంది మొత్తం 4,48,773 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. అయితే చివరకు 4 లక్షల మందికి కూడా రుణమాఫీ వర్తించకపోగా వారిలో కూడా దాదాపు 20 శాతం మంది రైతుల రుణమాఫీ సైతం వివిధ సాంకేతిక కారణాల పుణ్యమాని పెండింగ్‌లో పడింది.
రుణమాఫీ కష్టాలు
Published Mon, May 4 2015 4:09 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement
Advertisement