రుణం..ఇదేమి విడ్డూరం!
- గత ఏడాది లబ్ధిదారులకు అందని రుణం
- ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు ఆహ్వానం
- మండిపడుతున్న గత లబ్ధిదారులు
కర్నూలు(అర్బన్): జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో రుణ పంపిణీ వ్యవహారం ప్రహసనంగా మారింది. గత ఏడాది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రుణాలు పంపిణీ చేయకుండా ఈ ఏడాది కొత్తగా మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేమి విడ్డూరం అంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. గత ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని 4,495 మంది లబ్ధిదారులకు రూ. 37.06 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులు అష్టకష్టాలకోర్చి ఆన్‌లైన్‌లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. అంతకు ముందు సంవత్సరంలో మిగిలిపోయిన దరఖాస్తులను కలుపుకొని మొత్తం 4,979 మందికి రుణాలను మంజూరు చేశారు.
అయితే వీరిలో ఇప్పటి వరకు 1,370 మందికి మాత్రమే రూ. 13.86 కోట్లు రుణం మంజూరైనట్లు అధికారుల లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇంకా గత ఏడాదికి సంబంధించి 3,609 మంది లబ్ధిదారులకు రూ.23.19 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. వీరిలో దాదాపు 2,900 మంది బ్యాంకు వ్యక్తిగత ఖాతా, లోన్ ఖాతా నంబర్లను కూడా అందజేశారు. ఖాతా నంబర్లను అప్‌లోడ్ చేయని వారు దాదాపు 700 మంది దాకా ఉన్నారు. కోరిన ధ్రువీకరణ పత్రాలన్నీ సమర్పించి ఉన్నతాధికారి కార్యాలయానికి అప్‌లోడ్ చేసిన వారికి కూడా నేటికీ నయాపైసా సబ్సిడీ విడుదల కాలేదు.
గత ఏడాదికి సంబంధించి వేల మందికి రుణాలు అందించాల్సి ఉన్నప్పటికీ, తిరిగి 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు పొందేందుకు ఆగస్టు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలనడంపై ఎస్‌సీ వర్గాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 6,615 మంది లబ్ధిదారులకు రూ.87.54 కోట్ల మేరకు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత ఏడాదికి సంబంధించిన రుణాలన్నింటినీ విడుదల చేసిన అనంతరం ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన ప్రక్రియను ప్రారంభిస్తే బాగుండేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
బీసీ కార్పొరేషన్‌లో....
వెనుకబడిన తరగతుల ఆర్థిక సేవా సహకార సంస్థలో కూడా ఇదే తంతు నడుస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం సబ్సిడీతో జిల్లాలోని 8,193 మంది బీసీ లబ్ధిదారులకు 22.50 కోట్ల మేర సబ్సిడీ విడుదల చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అందిన దరఖాస్తులను జల్లెడ పట్టి 5,727 మంది లబ్ధిదారులకు రూ.21.17 కోట్ల మేర సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రొసీడింగ్స్ అందించారు. అయితే వీరిలో 3,189 మంది మాత్రమే బ్యాంకు జీరో బ్యాలెన్స్ ఖాతా, లోన్ ఖాతా నంబర్లను అందించారు. వీరికి రూ.11.70 కోట్ల సబ్సిడీ విడుదల కాలేదు. అయితే బీసీ కార్పొరేషన్ అధికారులు కూడా 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5209 మంది లబ్ధిదారులకు రూ.28.50 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకొని దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
రుణాలు అందించేందుకు చర్యలు
గత ఏడాది బ్యాంకు ఖాతా నంబర్లు అప్‌లోడ్ చేసిన వారందరికీ తప్పక రుణాలు అందుతాయి. పెన్షన్ కమిటీలను తొలగించాలని వైఎస్సార్ జిల్లాకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించడం, అంతలోపే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల సబ్సిడీ విడుదలో జాప్యం జరిగింది. ఇంకా బ్యాంకు ఖాతా నంబర్లు అప్‌లోడ్ చేయని వారికి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి.
- పులిచేరి సారయ్య, ఈడీ, ఎస్‌సీ కార్పొరేషన్