పూణేలో తెలుగు టెకీ ఆత్మహత్య
పూణే: ఐటీ ఉద్యోగానికి భద్రత లేదంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల టెకీ పూణేలో బలవన్మరణం చెందాడు. బుధవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన గోపికృష్ణ దుర్గాప్రసాద్(25) బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గా ప్రసాద్ గతంలో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేశారు.
మూడు రోజుల క్రితం పూణే నగరానికి వచ్చి ఓ ఐటీ కంపెనీలో విధుల్లో చేరారు. పూణే నగరంలోని విమాననగర్‌లోని ఓ హోటల్ లో బస చేశారు. బుధవారం రాత్రి ఉద్యోగం గురించి బెంగపడిన దుర్గాప్రసాద్.. ఐటీ ఉద్యోగంలో భద్రత లేదనే ఆవేదనతో చేతి మణికట్టుపై బ్లేడుతో 25 చోట్ల కోసుకున్నాడు. అనంతరం హోటల్ టెర్రస్ మీదకు వెళ్లి భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
‘‘ఐటిలో ఉద్యోగ భద్రత లేదు. నేను నా కుటుంబం గురించి చాలా బాధపడుతున్నాను’’ అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని పూణే పోలీసులు చెప్పారు. సాప్ట్‌వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పూణేలోని సాప్ట్‌వేర్ ఇంజనీర్లు ఐటీ కంపెనీల నిర్వాకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు యూనియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
దుర్గాప్రసాద్ చాలా మంచి యువకుడని, ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువు వెంకటమూర్తి ప్రశ్నించారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్నివారి బంధువులకు అప్పగించారు. అంత్యక్రియల కోసం దుర్గాప్రసాద్ మృతదేహాన్ని కృష్ణాజిల్లాకు తరలించారు.