
యువర్ అటెన్షన్ ప్లీజ్...ముక్కుమూసుకోండి..
రాష్ట్రంలోనే ప్రధాన జంక్షన్‌గా ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌లో పారిశుధ్యం క్షీణించింది...
- బెజవాడ రైల్వేస్టేషన్‌లో క్షీణించిన పారిశుధ్యం
- దుర్గంధం వెదజల్లుతున్న ప్లాట్‌ఫారాలు
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
రైల్వేస్టేషన్ : రాష్ట్రంలోనే ప్రధాన జంక్షన్‌గా ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌లో పారిశుధ్యం క్షీణించింది. ప్లాట్‌ఫారాలు, ట్రాక్‌లపై చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సెప్టిక్ ట్యాంకుల నుంచి లీకేజీలతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుండడంతో ప్రయాణికులు ముక్కులు మూసుకొని ప్రయాణించాల్సి వస్తోంది. రాజధాని నగరానికి అతి పెద్ద జంక్షన్‌లో సౌకర్యాల మాట ఎలా ఉన్నా కనీసం పారిశుధ్య లోపం లేకుండా చూస్తే చాలని ప్రయాణికులు అంటున్నారు. రైల్వేస్టేషన్‌లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. శనివారం వరకు పుష్కర యాత్రికుల రాకపోకలతో కిక్కిరిసి ఉండడంతో పారిశుధ్య పరిస్థితులు దిగజారాయి.
పలు ప్లాట్‌ఫారాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. ట్రాక్‌ల్లో సైతం చెత్తతో నిండిపోయాయంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతుంది. ఏడో నంబరు ప్లాట్‌ఫాంపై మురుగునీటి పైపు లీక్ కావడంతో ఆ ప్రాంతంలో మురుగు పాకుడు చేరింది. ఈ ప్లాట్ ఫాంపై నడవాలంటే ముక్కుమూసుకోవాల్సిందే. వెస్ట్‌బుకింగ్ వైపు పదో నంబరు ప్లాట్‌ఫాంపై ఇటీవల సెప్టిక్‌టాంక్‌లీకు కావడంతో ఆ ప్రాంతమంతా మల, మూత్రాలతో నిండిపోయింది.
దీంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ నుంచి ఇవి రోడ్డుపైకి కూడా చేరడంతో స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాటిని తొలగించారు. వెస్ట్‌బుకింగ్ వైపు పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. రైల్వేస్టేషన్‌లో పారిశుధ్య పనుల కోసం వందలాది మంది సిబ్బంది ఉన్నా వారు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నిత్యం వేలాది మంది ప్రయాణించే రైల్వేస్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.