- నేనే ఎక్కువగా కష్టపడుతున్నాను
- రాజమండ్రి మేడే సభలో ముఖ్యమంత్రి
- వర్షంతో సభకు ఆటంకం
- పుష్కర పనుల పరిశీలన..
- అధికారులతో సమీక్ష
- వివిధ సమస్యలపై నిలదీసిన పలువర్గాలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. కాకినాడ, రాజమండ్రిల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాకినాడలో పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. రాష్ర్ట కార్మిక శాఖ నిర్వహించిన మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు. తొలి కార్మికుడిని తానేనని, తానే ఎక్కువ కష్టపడుతున్నానని అన్నారు. తిరుగు పయనంలో మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్‌ను ప్రారంభించారు.
రాజమండ్రి : ‘హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశాను. కొత్త రాష్ట్రంలో రాజధానిని కూడా అదేస్థాయిలో నేనే అభివృద్ధి చేయగలను. మీ అందరికన్నా నేనే ఎక్కువగా కష్టపడుతున్నాను. ఈ రాష్ట్రంలో తొలి కార్మికుడిని నేనే. రోజుకు ఐదు గంటలు మాత్రమే నిద్రపోయి.. పద్దెనిమిది, పంతొమ్మిది గంటలు కష్టపడుతున్నది కూడా నేనే’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లాలో ఒక రోజు పర్యటనకు శుక్రవారం వచ్చిన ఆయన అన్నీ తానై అన్నట్టుగా వ్యవహరించారు. అటు కాకినాడలోను, ఇటు రాజమండ్రిలోను జరిగిన సభల్లో బాబు తనదైన శైలిలో ఆత్మస్తుతి.. పరనింద అన్న రీతిలో ప్రసంగించారు.
రాజమండ్రి సభలో అయితే ప్రజల కోసం తాను ఎన్నికల ముందు దేశంలో ఏ నాయకుఛిఞ సాహసించని విధంగా 208 రోజులపాటు 2,711 కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్టు చెప్పారు. పట్టుమని రెండు, మూడు వేల మంది కూడా ఈ సభకు రాలేదు. సభకు రాకుంటే డ్వాక్రా రుణమాఫీ రాదని మహిళలను, ఒక్కొక్కరికీ రూ.100 జరిమానా వేస్తామని ఆటో కార్మికులను బెదిరించి, తరలించినా ఆశించిన స్థాయిలో కార్మికులు రాలేదు. సభ ప్రారంభానికి ముందు వర్షం కురవడంతో జనం పెద్దగా రాలేదని, తాను మంచిపని ఆరంభించడంవల్లే వర్షం కురిసిందని బాబు చెప్పడం గమనార్హం. పనిలో పనిగా ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక అక్రమాలకు ప్రతిపక్షాలే కారణమని, వారినుంచి రాష్ట్రాన్ని తానే రక్షిస్తున్నానని బాబు ఎక్కువగా చెప్పారు.
గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో నత్తనడకన సాగుతున్న పుష్కర పనులను సీఎం పరుగులు పెట్టిస్తారని ఆశించినప్పటికీ, దానికి ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఘాట్‌ల పరిశీలన సమయంలో కూడా పుష్కరాలతో సంబంధం లేని గోదావరి మధ్య లంకల్లో పేరుకుపోయిన ఇసుక మేటల తొలగింపుపైనే ఎక్కువగా చర్చ జరగడం విశేషం. ఘాట్‌లను పరిశీలిన అనంతరం చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పుష్కరాాల పనులపై రెండు జిల్లాల అధికారులతో సమీక్షకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో వర్షం పడే అవకాశముందని, మేడే వేడుకలకు వచ్చిన కొద్దిమంది జనం వెళ్లిపోయే ప్రమాదముందని తెలిసి, దానిని రద్దు చేసి తిరిగి రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొలి కార్మికుడిని నేనే..
Published Sat, May 2 2015 2:50 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement
Advertisement