గీత వ్యాఖ్యలపై గుస్సా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘తోలు మందం...చర్మం దళసరి...ఏంటీ మాటలు? బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడే తీరు ఇదేనా!. అధికారులు వారి ఇంటిలో నౌకర్లని అనుకుంటున్నారా? ఆమె వ్యాఖ్యలు తమ మనస్సును గాయపరిచాయి. ఆమెనే కాదు మరికొందరు నాయకులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఇలాగైతే తిరుగుబాటు తప్పదు. తప్పు చేసినోళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. అలాగని అందర్నీ ఒకేగాడికి కట్టేయడం సరికాదు. మాటలు మితిమీరితే సహాయ నిరాకరణ తప్పదు. ఏం చేస్తారో చూస్తాం. మహా అయితే బదిలీ చేస్తారు.
అంతకుమించి చేసేదేమీ లేదు. ఉద్యోగం తీసేయలేరు కదా’ అని పలువురు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమలోతాము చర్చించుకుంటున్నారు.జెడ్పీ సర్వసభ్య సమావేశం అధికారుల్ని ప్రశ్నించడం, లోపాలుంటే హెచ్చరించడం, శాఖా పరమైన ప్రగతిపై చర్చించడం, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష చేయడం, నిధులు మంజూరు, కేటాయింపులపై చర్చ సాధారణం. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన జెడ్పీ సమావేశాలన్నింటిలోనూ తమను లక్ష్యంగా చేసుకుని కొందరు నేతలు మాట్లాడుతున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు కోరిన పనిచేయకపోతే టార్గెట్ చేయడం అలవాటుగా మారిపోయిందని వాపోతున్నారు. చెప్పాలంటే సమావేశాల్లో గట్టిగా మాట్లాడితే దారికొస్తారన్న అభిప్రాయంతోనే పలువురు చెలరేగిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.
బుధవారం జరిగిన జెడ్పీ సమావేశంలో అదే జరిగిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యంపైనా, అలసత్వంపైనా ప్రశ్నించడం, నిలదీయడం సరైనదేనని కానీ, కొందరు టార్గెట్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. జెడ్పీ సమావేశం లంచ్ సమయంలోనే ఇది మంచి పద్ధతి కాదని కొందరు చర్చించుకున్నారు. దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పెట్టకపోతే మరింత రెచ్చిపోతారని మాట్లాడతారని, ఒక్క మీసాల గీతనే కాదు పలువురు జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు కూడా అధికారులంటే చులకనగా మాట్లాడుతున్నారని, తిరుగుబాటు చేయకపోతే మరింత ఇబ్బందులకు గురికావల్సి వస్తోందని ఒక నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది.
ఇదే విషయమై సమావేశం ముగిసిన తర్వాత కూడా పలువురు ఫోన్లు ద్వారా మాట్లాడుకున్నారు. రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. అధికారుల మధ్య ఐకమత్యం లేకపోతే మరింత చులకనవుతామని చర్చించుకున్నట్టు తెలిసింది. గురువారం కూడా కొందరు అధికారులు భవిష్యత్ కర్తవ్యంపైనా మాట్లాడుకున్నట్టు తెలియవచ్చింది. ‘ మంజూరైన పనులన్నీ వారికే కట్టబెడుతున్నాం...వచ్చే ప్రయోజనాలన్నీ వారే పొందుతున్నారు...ఏ ఒక్కటీ వదల్లేదు.. అవుట్ సోర్సింగ్, ఇతరత్రా పోస్టుల నియామకాల్లోనూ వారి సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నాం’ అయినా వదలడం లేదు. నూటికొక పనికాకపోతే సమావేశాల్లో టార్గెట్ చేస్తున్నారు.
భయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇలాగైతే కష్టమేనని, అవసరమైతే బది లీపై వెళ్లడానికి సిద్ధమవుదామని, ఎంతమందిని బదిలీ చేసేస్తార ని, అందరూ ఐక్యతతో ఉంటే ఏం చేయలేరని, తిరుగుబాటు చే యాల్సిన సమయం ఆసన్నమైందని లోలోపల మాట్లాడుకున్నట్టు తెలిసింది. అలాగని అందరు ప్రజాప్రతినిధుల్నీ ఒకేలా చూ డకూడదని, పద్ధతి ప్రకారం వెళ్లే వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని, మనం కూడా విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యంగా ఉండకూడదని అంతర్మధనం చేసుకున్నట్టు తెలియవచ్చింది.