అనంతపురం ఎడ్యుకేషన్/నార్పల, న్యూస్‌లైన్ : విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని, అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ విద్యపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో సదభిప్రాయం కలిగేలా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి అన్నారు. శుక్రవారం నార్పలలో రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన్ ఇన్‌స్పైర్-13 ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్‌స్పైర్‌ను ప్రవేశపెట్టిందన్నారు. మూడేళ్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పిల్లలపై మానసిక ఒత్తిడి పెరిగిపోతోందన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు షుగర్ వస్తోందంటే పరిస్థితి ఎంత దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ పరిస్థితులను బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు వైభవం కోల్పోతున్నాయని, దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ మాట్లాడుతూ.. శాస్త్ర పరిశోధనల పట్ల విద్యార్థులకు జిజ్ఞాస పెంపొందించాలన్నారు. తాను ఏం కావాలో...నిర్ణయించుకునే అధికారం నేటి పరిస్థితుల్లో లేకపోవడం బాధాకరమన్నారు. కనీసం తల్లిదండ్రులు కూడా నిర్ణయించుకునే పరిస్థితి లేదన్నారు.
ప్రకటనల మాయాజాలంలో కొట్టుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాగా చదవాలని, తామేం కావాలో అమ్మానాన్నలకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. భాషా పరమైన ఇబ్బందులు తప్ప నేటి విద్యార్థులు తెలివితేటల్లో చాలా ముందున్నారన్నారు. మంచి సమాజంవైపు పరిశోధనలు సాగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చన్నారు.
ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ ప్రతిభను వెలికి తీయడానికి ఇన్‌స్పైర్ మంచి వేదిక అన్నారు. పాఠశాలల్లో మైదానాలు ఉండే లా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి పాఠశాలలోనూ డ్రిల్ పీరియడ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు. అనంతరం మంత్రులు వివిధ నమూనాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పాఠశాల విద్య ఆర్జేడీ రమణకుమార్, ఏజేసీ వెంకటేశం, జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు, ఆర్వీఎం పీఓ కేఎస్ రామారావు, ఆర్డీఓ ఇస్మాయిల్, ఆర్‌ఐఓ వెంకటేశులు, డైట్ కళాశాల ప్రిన్సిపల్ మునెయ్య, తహశీల్దార్ రవీంద్ర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, ఎంపీడీఓ, స్థానిక సర్పంచు ఆకుల నాగలలిత, మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసింహా తదితరులు పాల్గొన్నారు.
571 ప్రాజెక్టులు
రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌కు 12 జిల్లాల నుంచి 676 ప్రాజెక్టులు రావాల్సి ఉండగా 571 ప్రాజెక్టులు వచ్చాయి. అనంతపురం నుంచి 24, చిత్తూరు నుంచి 110, తూర్పు గోదావరి 128, గుంటూరు 55, కృష్ణా 39, కర్నూలు 30, నెల్లూరు 25, శ్రీకాకుళం 23, విజయనగరం 16, విశాఖపట్నం 12, పశ్చిమగోదావరి 49, వైఎస్సార్ జిల్లా నుంచి 60 ప్రాజెక్టులు వచ్చాయి.
తెలుగుదేశం పార్టీ విభజనకు
అనుకూలం
రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఇన్‌స్పైర్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజనకు అన్ని పార్టీలు ఆమోదం లేఖలు ఇచ్చినా, కొన్ని పార్టీలు ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని యూటర్న్ తీసుకున్నాయన్నారు. టీడీపీకి ఇప్పటికీ సమైక్యాంధ్రపై స్పష్టత లేదన్నారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టం విడిపోకుండా చివరి వరకు తాము అడ్డుకుంటామన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై.. స్పందిస్తూ, ఆయన సీనియర్ నాయకుడని, ఏమి మాట్లాడినా చెల్లుతుందన్నారు. ‘తెలుగు వారు అఖండమైన ఖ్యాతి గడించారు. అలాంటివారి మధ్య చిచ్చుపెట్టి వారిని విడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాల’ని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రం విడిపోకుండా చివరి వరకు ప్రయత్నిస్తామన్నారు.
ప్రభుత్వ విద్యపై మక్కువ పెంచండి
Published Sat, Dec 28 2013 2:57 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement