ఇక 100 తొక్కొచ్చు
హైవేలపై పెరిగిన వాహన స్పీడ్
తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
ఓఆర్‌ఆర్ పరిధిలో తగ్గిన హైస్పీడ్
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇక నుంచి వాహనాల వేగానికి రెక్కలురానున్నాయి. ఔటర్ వంటి బహుళ వరుసల రహదారులపై రయ్‌మని ముందుకు వెళ్లే చోదకుల్లో తాజా నిబంధనలు మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వాహనాల జోరుకు కళ్లెం వేస్తున్న నిబంధనల్లో తాజాగా స్వల్పంగా మార్పులు చేస్తూ కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు త్వరలో నగరంలోనూ అమల్లోకి రానున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. గతంలో కార్లు గంటకు 65 కి.మీ. వేగంతో మాత్రమే దూసుకెళ్లేందుకు నిబంధనలు అనుమతించేవి. తాజాగా నిబంధనల్లో సడలింపు కారణంగా గంటకు 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లే అవకాశం రానుందని జంట పోలీసు కమిషనరేట్ల ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు భారీ వాహనాలు, ట్రక్కులు, కార్లు, ద్విచక్ర వాహనాలకు గతంలో ఉన్న వేగ పరిమితులు(స్పీడ్‌లిమిట్స్)లోనూ మార్పులు చేసినట్లు చెప్పారు.
ఔటర్‌పై తస్మాత్ జాగ్రత్త..!
స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్ (వేగం హుషారెక్కిస్తుంది..కానీ మిమ్మల్ని తిరిగిరానిలోకాలకు పంపిస్తుంది) అన్న విషయాన్ని చోదకులు మరవరాదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఔటర్ వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న రహదారులపై ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు ధరించడం, మితిమీరిన వేగానికి కళ్లెం వేయడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సినీ ఫక్కీలో ఫీట్లు చేసే కుర్రకారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఓఆర్‌ఆర్ పరిధిలో పాత ఉత్తర్వులు..
గంటకు 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు డివైడర్‌కు ఒక పక్క మొదటి, రెండు లైన్లలో మాత్రమే వెళ్లాలి. వాహనం వేగం 80కి తగ్గినా, 120 కి.మీ. వేగం పెరిగినా స్పీడ్‌గన్ పసిగట్టడం ద్వారా చలానా విధిస్తారు. ఇక గంటకు 40 నుంచి 80 కి.మీ. వేగంతో వెళ్లే వాహనాలు మూడు, నాలుగు లైన్ల ద్వారా వెళ్లాలి. ఇక్కడ కూడా 40కి తగ్గినా 80 కి.మీ. వేగం పెరిగినా చలానా తప్పదు.
ఓఆర్‌ఆర్ పరిధిలో తాజా ఉత్తర్వులు..
మొదటి, రెండు లైన్లలో మాత్రమే వేగం లో మార్పులు చేశారు. ఇక్కడ గంటకు 80 - 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. గతంలో 80 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేవారు.
సైబరాబాద్‌లోకి వచ్చే హైవేలు ఇవే....
నాగ్‌పూర్ , బెంగళూరు, ముంబాయి, విజయవాడ, వరంగల్, బీజాపూర్, నర్సాపూర్, రాజీవ్ , శ్రీశైలం, నాగార్జునసాగర్