కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: వాతావరణం కలుషితమవుతున్న నేపథ్యంలో బయో ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ఇదే అదనుగా మర్కెట్‌ను నకిలీ ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి. డీలర్లు, దళారులు రైతులు మభ్యపెడుతున్నారు. కొందరు వ్యవసాయాధికారులు ఇందుకు వంత పాడుతున్నారు. జిల్లాలో అనుమతి పొందిన కంపెనీలు రెండు మూడే కాగా.. 160 పైగా అడ్రస్ లేని కంపెనీలు ఎడాపెడా
బయోపెస్టిసైడ్స్‌ను ఉత్పత్తి చేసేస్తున్నాయి. డబ్బాలపై ముద్రిస్తున్న చిరునామా ఆనవాలు కూడా ఆయా ప్రాంతాల్లో లభించకపోవడం గమనార్హం. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్, తదితర ప్రాంతాల్లో ఇలాంటి కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. రూ.40 పెట్టుబడితో రూ.1000లకు పైగా ఆర్జించే అవకాశం ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ వ్యాపారంపైనే. అయితే వీటిపై నియంత్రణ అధికారం వాణిజ్య, ఆదాయ పన్ను శాఖలకు మాత్రమే ఉండటంతో వ్యవసాయ శాఖ చేతులెత్తేస్తోంది. బయో పెస్టిసైడ్స్ ఉత్పత్తిదారులు వాణిజ్య పన్నుల శాఖ అనుమతి పొంది వ్యాట్ చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా 33 శాతం ఆదాయ పన్ను కట్టాలనే నిబంధన విధించారు.
ఈ శాఖలు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రధానంగా ఈ వ్యాపారం కొందరు పెస్టిసైడ్స్ డీలర్లు, వ్యవసాయాధికారులే సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే దాదాపు రూ.5 వేల కోట్ల బయో మందుల వ్యాపారం జరిగినట్లు సమాచారం. ఈసారి పత్తి సాగు పెరగడం.. చీడపీడల బెడద ఎక్కువగానే ఉండటంతో వ్యాపారం జోరందుకుంది. అయితే సంబంధిత శాఖలేవీ పట్టించుకోకపోవడం నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. డీలర్లు దుకాణాల్లో పైన కొన్ని కంపెనీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ లోలోపల నకిలీలు విక్రయిస్తూ రైతులను మోసగిస్తున్నారు. బయో కంపెనీ ఏర్పాటుకు అనుమతితో పాటు మైక్రో బయాలజీ ల్యాబ్ తప్పనిసరి. అయితే ఇలాంటివేవీ లేకుండానే కొత్త కంపెనీలు ఏర్పాటవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అదేవిధంగా రైతులు మోసపోయామని తెలుసుకునే వీలు కూడా లేకపోవడం.. అవగాహన రాహిత్యం కారణంగా నకిలీ బయో ఉత్పత్తుల వ్యాపారం జిల్లాలో మూడు పూవ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
అంతా గ్రాఫిక్సే: బయో వ్యాపారం గ్రాఫిక్స్ చాటున నడుస్తోంది. చాలా కంపెనీలు 15 నుంచి 20 రకాల చిరునామాలతో లేబుళ్లు తయారు చేయించి డబ్బాలపై అతికించి మార్కెట్‌లోకి నకిలీ బయో ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. లీటరు మందు, డబ్బా, లేబుల్‌కు రూ.40 ఖర్చు అవుతుండగా.. మార్కెట్‌లో ఈ ఉత్పత్తులను రూ.1000లకు పైగా ధరకు విక్రయిస్తున్నారు. పెస్టిసైడ్ డీలర్లు వ్యవసాయాధికారుల నియంత్రణలో ఉండటంతో.. వారిపై ఒత్తిడి పెంచి ఆకర్షణీయమైన కమీషన్లను ఆశచూపి గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత ఏడాది వ్యవసాయ శాఖ కమిషనర్ కొన్ని బయో కంపెనీల పేర్లు, చిరునామాలు ఇచ్చి తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఒకటి రెండు మినహాయిస్తే మిగిలిన కంపెనీల జాడ కూడా లభించకపోవడం గమనార్హం.
డీలర్లు, అధికారులే సూత్రధారులు
బయో ఉత్పత్తులను విక్రయిస్తున్నారంటే సంబంధిత కంపెనీల చిరునామాలు డీలర్లకు తప్పనిసరిగా తెలుసుండాలి. అయితే వీరే సృష్టికర్తలు కావడంతో నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. కొందరు వ్యవసాయాధికారులు కొన్ని కంపెనీల బయో ఉత్పత్తులను భారీగా విక్రయించిన డీలర్లను విదేశీ టూర్లకు పంపుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంతో పత్తి, మొక్కజొన్న, ఉల్లి, మిరప, కంది సాగు అధికమైంది. దీంతో బయో ఉత్పత్తుల వ్యాపారం రూ.8 వేల కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు అంచనా. వ్యవసాయా శాఖలో పని చేసి పదవీ విరమణ పొందిన ఓ ఏడీఏ నకిలీ చిరునామాలతో ఆరేడు కంపెనీల బయో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో విజిలెన్స్ అధికారులు రెండు విడతల దాడులతో సరిపెట్టుకున్నారు. కర్నూలు నగర సమీపంలోని దిన్నెదేవరపాడులో ఉన్న కర్షక్ ఆగ్రో కెమికల్స్‌పైనా, కొత్త బస్టాండ్ వద్దనున్న పెస్టిసైడ్స్ దుకాణంలో దాడులు నిర్వహించగా కోటి రూపాయలకు పైగా విలువైన నకిలీ బయో ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు.
‘బయో’ మోసం
Published Mon, Nov 18 2013 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement