ఎన్నికలకు 800 కోట్లు!
* కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సీఈవో
* ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు
* 4.50 లక్షల మంది సిబ్బంది వినియోగం.. 69 వేల కేంద్రాల్లో వీడియోగ్రఫీ..
* డబ్బు, మద్యం పంపిణీ అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు
* ఎన్నికల వ్యయంపై 5న రాజకీయ పార్టీలు, మీడియాతో ఈసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయం భారీగా పెరగనుంది. డబ్బు, మద్యం, అధికారబలాలకు అతీతంగా మరింత పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుండటంతో ఈ వ్యయం కూడా పెరుగుతోంది. ఈనెల 10న ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాల సీఈవోలతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్నికల వ్యయంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.800 కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అంచనా వేసింది.
ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ మొత్తం వ్యయంలో కేంద్రం సగం, రాష్ట్రం సగం భరించాల్సి ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు రాష్ట్రంలో ఏకంగా 4.50 లక్షల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. అలాగే 69 వేల పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీని ఏర్పాటు చేయనున్నారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులతో పాటు, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా నిరోధించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. చెక్ పోస్టులతో పాటు సంచార బృందాలను ఏర్పాటు చేయనున్నారు.
పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు ఎవరు పాల్పడకుండా గట్టి నిఘా పెడతారు. ప్రధానంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అధికార బలంతో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. గతంలో నెల్లూరు పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నిక నిర్వహణకు రూ.13 కోట్ల వ్యయం అయింది. దీని ఆధారంగా త్వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అంచనా వేసింది.
‘పెయిడ్’పై ప్రత్యేక దృష్టి: వచ్చేఎన్నికల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పరిమితికి మించకుండా, అలాగే పెయిడ్ న్యూస్ వంటి ఇతర మార్గాల్లో ప్రచారం నిర్వహించడాన్ని నిరోధించాలని కమిషన్ నిర్ణయించింది. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈనెల 5న కమిషన్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, మీడియా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వొద్దు
ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వద్దని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీల ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి కె.అజయ్‌కుమార్ లేఖలు రాశారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో సంక్షేమ కార్యక్రమాల హామీలను ఇవ్వొచ్చని, అయితే అవి ఎన్నికల స్ఫూర్తిని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలహీనపరిచేలా ఉండరాదని సూచించింది. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు విశ్వసనీయత ఉండాలని, అలాగే ఆర్థికపరంగా ఆచరణ సాధ్యం అయ్యేవిగా ఉండాలని పేర్కొంది.