తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :
దేశాన్ని 2020 నాటికి సూపర్ పవర్‌గా తీర్చిదిద్దడమే లీడ్ ఇండియా లక్ష్యమని ఆ సంస్థ జాతీయ సమన్వయకర్త ప్రొఫెసర్ సుదర్శనాచార్య తెలిపారు. మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా సంస్థ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తోం దన్నారు. చదువులో బట్టీ విధానాన్ని స్వస్తి పలికి, శాస్త్రీయ జిజ్ఞాస పెంచడం, విలువలతో కూడిన విద్యను అందించడమే సంస్థ లక్ష్యమన్నారు. అహోరాత్ర యాగంలో పాల్గొనేందుకు గురువారం వీరంపాలెం వచ్చిన సుదర్శనాచార్యను ‘న్యూస్‌లైన్’ పలకరించింది. ఆయన ఏమన్నారంటే...
ప్రశ్న : లీడ్ ఇండియాను ఏ లక్ష్యంతో
ప్రారంభించారు?
జవాబు : విద్యా బోధనలో లోపాలను సరిచేసి విద్యార్థుల జీవితాలకు గొప్ప లక్ష్యం ఇచ్చి, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడడం ద్వారా దేశాన్ని అగ్రగ్రామిగా నిలిపేందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో లీడ్ ఇండియా సంస్థ స్థాపితమైంది.
ప్రశ్న : ఏ అంశాలతో ముందుకెళుతున్నారు?
జవాబు : దేశ జనాభాలో 15 ఏళ్ల దిగువ వయసు వారు 34 శాతం మంది ఉన్నారు. 25 ఏళ్లలోపు 55 శాతం మంది ఉంటారు. 2020 నాటికి 34 శాతం ఉన్న 15 ఏళ్లలోపు వారు 50 శాతానికి, 55 శాతంగా ఉన్న 25 ఏళ్లలోపు వారి జనాభా 70 శాతానికి చేరుకుంటుంది. అప్పటికి దేశ సగటు వయసు 29 ఏళ్లు అవుతుంది. ప్రపంచంలో వర్క్ ఫోర్సు జనాభాలో 24 శాతం మంది భారతీయులే ఉంటారు. ఈ గ్రూపును లక్ష్యంగా దేశ భవిష్యత్ వీరి చేతుల్లో ఉండేవిధంగా ముందుకువెళుతున్నాం.
ప్రశ్న : సంస్థ అంతిమ లక్ష్యం ఏమిటి?
జవాబు : విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని, సృజనాశక్తిని మేల్కొలిపి 2020 నాటికి భారత్‌ను విశ్వగురువుగా, సూపర్ పవర్‌గా నిలపడం.
ప్రశ్న : సూపర్ పవర్‌గా నిలిపేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు?
జవాబు : రెండో జాతీయ ఉద్యమంగా చేపడుతున్నాం. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 10 లక్షల మంది మార్పు ప్రతినిధులుగా (చేంజ్ ఏజంట్స్) గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఎన్‌జీఓలు, ఐటీ సంస్థలు, కార్పొరేషన్లు, విద్యాలయాలు, ట్రస్టులను భాగస్వాములుగా చేసుకుని ముందుకెళుతున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, కోల్‌కత, బీహార్, గుజరాత్‌లలో అబ్దుల్ కలాం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ప్రతి విద్యార్థిని ఒక రత్నంగా మార్చడానికి అబ్దుల్ కలాం ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 20న హైదరాబాద్ ఈసీఎల్ సమీపంలో ప్రయోగ పరిశోధనాత్మక పాఠశాలను కలాం ప్రారంభించారు.
ప్రశ్న : దేశంలో ఎన్ని పరిశోధనాత్మక
పాఠశాలలు స్థాపించనున్నారు?
జవాబు : దేశంలోని 634 జిల్లాల్లో లీడ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాకు ఒక ప్రయోగ పరిశోధనాత్మక పాఠశాల ప్రారంభించాలన్నది లక్ష్యం. దీని కోసం 2015 వరకు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సంగ్రహించి, తదనుగుణంగా ప్రణాళికను రూపొందిస్తాం. 2015 -20 మధ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తాం.
ప్రశ్న : ఈ పాఠశాలల్లో ఎటువంటి విద్యావిధానం అమలులో ఉంటుంది?
జవాబు : జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తాం. విద్యార్థుల తెలివితేటలు, టెక్నాలజీ, విద్య, ఉపాధి, వాణిజ్య అంశాలను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రం, కేంద్రం సిలబస్ అనే తేడా లేకుండా విశ్వవ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలులో ఉండే విధంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తాం. పూర్తి వివరాల కోసం డబ్ల్యూ డబ్ల్యూ డ బ్ల్యూ .లీడ్ ఇండియా భారతరత్నాస్ .కామ్‌ను పరిశీలించవచ్చు.
2020 నాటికి విశ్వగురువు మన భారత్
Published Fri, Nov 8 2013 12:28 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM
Advertisement
Advertisement