మాకు దిక్కెవరు నాన్నా | indian army in Bhanu Prakash | Sakshi
Sakshi News home page

మాకు దిక్కెవరు నాన్నా

Published Tue, Jul 8 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

మాకు దిక్కెవరు నాన్నా

మాకు దిక్కెవరు నాన్నా

  • వీరజవాను అంతిమ యాత్రలో తల్లి హృదయ వేదన
  • మదనపల్లె/ మదనపల్లె క్రైం: ‘మీ నాన్న మనల్ని అందరికన్నా ముందు వదిలేసి వెళ్లిపోయాడు. 13 సంవత్సరాలుగా ఈ కుటుంబానికి నువ్వే పెద్దదిక్కుగా ఉన్నాయి.. ఇప్పుడు ఆ దేవుడు నిన్ను కూడా తీసుకెళ్లాడా నాన్నా..? ఇక మాకు దిక్కెవర్రా భాను.. ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడో చూడండి.. నాలుగు రోజుల క్రితం ఫోన్‌చేసి మా బెటాలియన్‌లో నాకు ఉత్తమ అవార్డు వచ్చిందమ్మా.. ఇంటికొచ్చినప్పుడు తీసుకొచ్చి చూపిస్తానని చెప్పావు కదరా.. ఇప్పుడు శవమై వచ్చావా తండ్రీ.. ఇంతలోనే మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లావా..కొడుకా.. మాకు ఎందుకింత దుఃఖాన్ని మిగిల్చావురా నాన్నా..’ అంటూ వీరజవాను వాకా భానుప్రకాష్ తల్లి నిర్మల గుండెలవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.
     
    మిలిటరీలోనే చనిపోతే చిరునవ్వుతో సాగనంపండి
     
    ‘దేశ రక్షణ కోసం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నా.. ఒకవేళ మిలిటరీలోనే చనిపోతే నన్ను చిరునవ్వుతో సాగనంపండి’ అంటూ భానుప్రకాష్ కుటుంబ సభ్యులతో అన్న మాటలు నిజమయ్యాయి. మరో 121 రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటించి స్వగ్రామానికి వచ్చేయాల్సిన ఆయనను విధి వెక్కిరించింది. ఉదయాన్నే విధులకు వెళ్లిన భాను శిబిరానికి చేరేలోపు మృత్యువాత పడ్డాడు. ఈయన తాత వాకా లక్ష్మీనారాయణ వైఎస్సార్ జిల్లాలో సబ్‌కలెక్టర్‌గా పనిచేసేవాడు.

    తండ్రి వాకా రామ్మోహన్ 30 ఏళ్లక్రితం మదనపల్లెకు చెందిన నిర్మలను వివాహం చేసుకుని ఇక్కడికే కాపురం వచ్చేశాడు. రామ్మోహన్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేవాడు. నిర్మల ప్రైవేటు  టీచర్‌గా పనిచేసేది. వీరికి కుమారుడు వాకా భానుప్రకాష్, కుమార్తె భవ్య పిల్లలు. వాకా భానుప్రకాష్‌కు చిన్ననాటినుండే దేశభక్తి ఎక్కువ. స్కూల్, కళాశాలలో ఎన్‌సీసీలో చేరి సేవ చేసేవాడు.

    డిగ్రీ వరకు చదివాడు. సైన్యం లో చేరాలనే ఆశతో ప్రవేశ పరీక్షలు రాసి, 1998లో మిలిటరీలో చేరాడు. విధుల్లో చేరిన నాలుగేళ్లకు తండ్రి రామ్మోహన్ అనారోగ్య కారణంగా మృతి చెందాడు. అప్పటి నుంచి భానుప్రకాష్ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నాడు. తనపై ఉన్న బాధ్యతతో చెల్లెలికి పెళ్లిచేశాడు. తర్వాత 2009లో కర్ణాటకకు చెందిన సంధ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు వాకా సాయిపార్థ్దీవ్(3) ఉన్నాడు.

    బిడ్డకు దిక్కెవరు భాను
     
    నీవేమో దేశం కోసం ప్రాణాలు వదిలావు.. ఇక నాకు, బిడ్డకు దిక్కెవ్వరు భాను అంటూ భార్య సంధ్య రోదించడం పలువురిని కదిలించింది. విధులకు వెళ్లేపుడు రైల్వే స్టేషన్ దాటేవరకు పరుగెడుతూ నిన్ను సాగునంపుతుంటినే.. బిడ్డను చూసి ఎంతో మురిసిపోయేవాడివే.. సెలవులకు వచ్చిననాటి నుండి బండిలో తిప్పేవాడివి.. ఇక నా బండి నీకేరా నాయనా అనే వాడివే.. ఇక వాడ్ని ఎలా పెంచాలి చెప్పురా దేవుడా.. అంటూ సంధ్య రోదిస్తూ పలుమార్లు స్పృహ కోల్పోయింది.

    ఆరోజు బయల్దేరకున్నా ఈరోజు నీవు మాకు దక్కేవాడివేమో ఎంత పనిచేశావు భాను అంటూ ఆమె భర్తకు కన్నీటి వీడ్కోలు పలికింది. ముక్కు పచ్చలారని భాను కుమారుడు వాకా సాయిపార్థీవ్ తల్లి, నాన్నమ్మ, బాబాయ్, పిన్ని, అత్త, మామ, పెద్దోళ్లంతా ఎందుకేడుస్తున్నారో తెలియక బిక్కముఖం వేసుకుని చూస్తుండిపోయాడు. వచ్చినవారంతా ఆ బిడ్డను చూసి కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి వీరజవాను మృతదేహానికి ఘన నివాళి అర్పించారు.

    ఎమ్మెల్యే స్వయానా డాక్టర్‌కావడంతో పీఎం రిపోర్టును పరిశీలించారు. మృతుడి తల్లి, భార్య, చెల్లెలిని ఓదార్చారు.  సబ్‌కలెక్టర్ డాక్టర్ నారాయణ్‌భరత్‌గుప్తా, డీఎస్పీ కే.రాఘవరెడ్డి జవాను మృతదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లె నరసింహా రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు.

    అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ కల్నల్ కేజేఎం రాయ్, మదనపల్లె మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్, వైస్ చైర్మన్ భవానీప్రసాద్, మాజీ చైర్మన్ డాక్టర్ ఎన్.రవికుమార్, సీఐలు శివన్న, చంద్రశేఖర్, రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి, మృతుడి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement