కరువు మంట
కర్నూలు(జిల్లా పరిషత్ ) : రాయలసీమ జిల్లాలను మొదటి నుంచి కరువు పీడిస్తోంది. ఈ కారణంగా అధిక శాతం ప్రజలు సమతుల ఆహారం తీసుకోలేకపోతున్నారు. ఇక్కడి పేదలు ఉదయం పూట దాదాపుగా టిఫిన్ చేయరు. అధిక శాతం మందికి ఒకేసారి మధ్యాహ్న భోజనం చేయడం అలవాటు. అంటే రాత్రి 9 గంటల నుంచి మరునాడు రెండు గంటల వరకు భోజనం తినకపోవడం.. మధ్యలో టీ, కాఫీలతో సరిపెట్టడం వల్ల గ్యాస్ట్రబుల్ బారిన పడుతున్నారు. ఆదోని డివిజన్, కర్నూలు డివిజన్‌లోని దాదాపుగా అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు పనుల్లేక వలస వెళ్తున్నారు.
పనులకు వెళ్లే వారు ఉదయం టీలో బన్ను అద్దుకుని తినడం, మధ్యాహ్నానికి చద్ది కట్టుకుని వెళ్తుంటారు. అది కూడా అన్నం, అందులోకి పప్పుచారు, వెల్లుల్లితో చేసిన కారం పొడి కట్టుకెళ్తారు. గ్రామీణ ప్రాంతాలే కాదు.. నగరం, పట్టణాల్లోని మురికివాడల్లోని పేదలు సైతం ఇదే రీతిన ఆకలితో అలమటిస్తున్నారు. సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం, కారాన్ని అతిగా తినడం, మజ్జిగ, పెరుగు తీసుకోకపోవడం వల్ల జీర్ణాశయంలోని గోడ లు దెబ్బతింటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న గ్యాస్ట్రిక్ రోగుల సంఖ్య
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగానికి వారంలో రెండు ఓపీలు ఉండగా.. ప్రతి ఓపీకి కనీసం 100 నుంచి 120 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 70 నుంచి 80 శాతం గ్యాస్ట్రబుల్ సమస్యతో బాధపడుతున్న వారే. దీంతో పాటు సర్జికల్, మెడికల్ విభాగాలకు సైతం ప్రతి రోజూ సగటున 150 మంది రోగుల్లో 30 శాతం మంది గ్యాస్ట్రబుల్ సమస్యతోనే వస్తున్నారు. ఆసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగంలో వారానికి రెండుసార్లు చొప్పున 80 మందికి ఎండోస్కోపి నిర్వహిస్తారు.
అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజికి నెలకు సగటున 300 మంది.. మెడికల్, సర్జికల్ విభాగాలకు 2,500 మంది గ్యాస్ట్రబుల్ సమస్యతో వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో, క్లినిక్‌ల్లోనూ ఇదే లెక్కన రోగులు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నారు. జనాభాలో పావు వంతు భాగం ప్రజలు జీర్ణకోశ వ్యాధుల భారిన పడినట్లు వైద్యులు చెబుతున్నారు.
చేటు తెస్తున్న చిన్న, పెద్ద మాత్రలు
గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మురికివాడల్లో విరివిగా లభించే చిన్న, పెద్ద మాత్రలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రతిరోజూ కాయకష్టం చేసి ఇంటికి వచ్చే పేదలు ఒళ్లు నొప్పులు తగ్గడానికి ఈ మాత్రలను సమీప మెడికల్ షాపులు, కిరాణ దుకాణాల్లో కొని వాడుతున్నారు. బెట్నసోల్ అనే స్టెరాయిడ్, డైక్లోఫెనాక్ అనే నొప్పి మాత్రలను వాడటం వల్ల జీర్ణాశయంలో గ్యాస్ట్రబుల్, అల్సర్ సమస్యలు వస్తాయని.. భవిష్యత్‌లో అది కిడ్నీ సమస్యలకు, క్యాన్సర్‌కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ అనుమతి లేకుండా ఈ మాత్రలను విక్రయిస్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
వేగంగా గ్యాస్ట్రబుల్ తెచ్చే ఫాస్ట్‌ఫుడ్
ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ అంతే వేగంగా గ్యాస్ట్రబుల్‌ను మోసుకొస్తోంది. శీతల ప్రాంతాలైన ఉత్తరాది వారి ఆహార అలవాట్లను ఉష్ణప్రాంతమైన దక్షిణాదిలో ఆచరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్, గోబీ, కట్‌లెట్లు, కచోరి తదితరాలను విపరీతంగా తింటున్నారు. వీటిని వండే తీరు సైతం పరిశుభ్రంగా ఉండకపోవడం, నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడటం వల్ల కూడా జీర్ణాశయ సమస్యలకు కారణమవుతోంది.
వేళకు భోజనం చేయకపోవడమే కారణం
గాస్ట్రబుల్‌కు జీర్ణాశయంలోని హెచ్ పైలోరి అనే సూక్ష్మజీవి ఇన్‌ఫెక్షన్ ప్రధాన కారణం. కొన్ని ప్రమాదకర జన్యువులు కలిగిన ఈ సూక్ష్మక్రిములు అల్సర్, క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. అధికంగా కారం, మసాలాలు, వేపుడు పదార్థాలు, నూనె పదార్థాలు తీసుకోవడం, ధూమ, మద్యపానాలు సేవించడం, నొప్పి మాత్రలు అధికంగా వాడటం వల్ల జీర్ణాశయంలో సమస్యలు ఏర్పడతాయి. క్రిమిసంహారక మందులు..
ఎరువులతో పండిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అధికమవుతున్నాయి. మానసిక, సామాజిక ఒత్తిడి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం. ర్యాంటాక్, రానిటిడిన్, ఫామోటిన్, జెలిసిల్, ఒమెప్రొజోల్, రాబిప్రొజోల్, పాంటాప్రొజోల్ వంటి మందులు కొన్నిరోజుల పాటు వాడాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే డాక్టర్లను సంప్రదించాలి. - డాక్టర్ బి.శంకరశర్మ, పెద్దాసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగాధిపతి
జీవనశైలి మార్చుకుంటేనే పరిష్కారం
మా క్లినిక్‌కు ప్రతిరోజూ 30 నుంచి 40 మంది గ్యాస్ట్రిక్ సమస్యలతో వస్తున్నారు. వీరిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలే ఉంటున్నారు. వేళకు భోజనం చేయకపోవడం, అధికంగా కారం, మసాలాలు ఆహారంలో వాడటం.. బీడీ, సిగరెట్లు, ఆల్కహాలు తాగే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ప్రమాదకరమైన లక్షణాలు(బరువు,, ఆకలి తగ్గడం, రక్తపు వాంతులు, రక్తహీనత, కడుపులో నీరు చేరడం) కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. జీవనశైలి మార్చుకుంటేనే గ్యాస్ట్రిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. - డాక్టర్ మోహన్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు