ఉప్పరహల్ గ్రామస్తులను విచారిస్తున్న జిల్లా అధికారులు
కర్నూలు, కౌతాళం రూరల్: మండల పరిధిలోని ఉప్పరహల్ గ్రామంలో గత నెల 27న బాలుడికి, మేజర్ యువతికి జరిగిన బాల్యవివాహంపై శుక్రవారం జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. జేసీ–2 రామస్వామి ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ఏపీడీ విజయ, డీసీపీఓ శారద, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ తిమ్మయ్య, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున, ఆర్‌ఐ భీమేష్ గ్రామానికి చేరుకుని విచారించారు.
సదరు కుటుంబం గ్రామంలో లేకపోవడంతో స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. వివాహం గుట్టుచప్పుడు కాకుండా జరిపించారని, వారు త్వరలో గ్రామానికి వస్తే అధికారుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చేలా చూస్తామని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ఏకాంబరెడ్డి అధికారులకు చెప్పారు. అనంతరం జిల్లా అధికారులు గ్రామస్తులతో మాట్లాడుతూ బాల్యవివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి వాటి గురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment