యాచారం, న్యూస్‌లైన్: మండలంలో జరిగిన అభయహస్తం ఉపకార వేతనాల అవకతవకలకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదట మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సామాజిక తనిఖీల్లో వెల్లడైన అవకతవకలపై వెంటనే ఐకేపీ ఏపీఎం త్రివేణిపై సస్పెండ్ వేటు వేసిన ఉన్నతాధికారులు.. ఆ తర్వాత అధిక మొత్తంలో అవకతవకలు జరిగిన గడ్డమల్లయ్యగూడ, మల్కీజ్‌గూడ, చింతుల్ల గ్రామాల్లో సమాఖ్య సమావేశాలు నిర్వహించి గ్రామ సంఘం అధ్యక్షులను తొల గించారు. నిబంధనల ప్రకారం గ్రామ సమాఖ్య అధ్యక్షురాండ్రను తొలగించే అధికారం ఉండదు. కానీ ఆరోపణల వల్ల డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు స్వయంగా గ్రామాల కొచ్చి గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేసి సంఘాల అధ్యక్షురాండ్రతోనే కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు.
అదీ మెజారిటీ మహిళలతో గ్రామ సంఘం అధ్యక్షురాండ్రను ఎన్నుకునేలా చేశారు. ఆ తర్వాత మరో వారం రోజులు విచారణ చేసి ఆ మూడు గ్రామాల్లో బాధ్యులైన సీసీ (కమ్యూనిటీ కోఆర్డినేటర్ల)లను సస్పెండ్ చేశారు. మూడు గ్రామాల్లో అవకతవకలపై యాదయ్య, మైసయ్యలను సస్పెండ్ చేశారు. అంతకు ముందు ఏపీఎంను, మూడు గ్రామాల వీఓలను మార్చిన తర్వాత ఇక సమస్యలు సమసినట్లేనని అనుకున్న ఐకేపీ సిబ్బందికి సడన్‌గా మరో ఇద్దరు సీసీలను సస్పెండ్ చేయడంతో సిబ్బందిలో కలవరం మొదలైంది.
వీబీకేలు, తర్వాత హెచ్‌ఎంలపై చర్యలు
తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మండలంలో అభయహస్తం ఉపకార వేతనాల అవకతవకలు ఐకేపీ సిబ్బందితోపాటు గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాండ్రకు, ఉపకార వేతనాల అర్హతకు బోనోఫైడ్లు ఇచ్చిన ఆయా పాఠశాలల హెచ్‌ఎంల పాత్ర కూడా ఉన్నట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. మండలస్థాయి అధికారులపై వేటువేసిన ఉన్నతాధికారులు ఇక క్షేత్ర స్థాయిలో సిబ్బంది పాత్రపై కూడా గుట్టుచప్పుడు కాకుండా విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మండలంలో 20 గ్రామాల్లో 2011-12కు సంబంధించి 2 వేలకు పైగా విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు కాగా.. ఇందులో 450కి పైగా విద్యార్థుల పేర్ల మీద బోగస్ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి సిబ్బంది ఉపకార వేతనాలు స్వాహా చేశారు.
మండలంలోని 20 గ్రామాల్లో 964 డ్వాక్రా సంఘాలున్నాయి. సంఘాలను పర్యవేక్షణ చేసేది క్షేత్రస్థాయిలో వీబీకేలే. ఉపకార వేతనాలను ఎంపిక చేసే సమయంలో డ్వాక్రా సంఘం, వీబీకే ధ్రువీకరించి, సీసీలకు గ్రామ సమాఖ్య అధ్యక్షురాండ్రకు తెలియజేసి ఆ తర్వాత మండల స్థాయిలోని ఏపీఎం, మండల సమాఖ్యకు తెలియపర్చి ఉపకార వేతనాల మంజూరు కోసం ఉన్నతాధికారులకు ఫైల్ పంపిస్తుంటారు. అంటే మండలంలో జరిగిన ఉపకా రవేతనాల అవకతవకల్లో క్షేత్రస్థాయి నుంచి మండల స్థాయిలో ఉన్న సిబ్బంది, సంఘాల మహిళల పాత్ర ఉన్నట్లు సృష్టమవుతోంది. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆయా గ్రామాల్లో ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి తప్పుడు బోనోఫైడ్లను తీసుకొచ్చి అందజేశారు. ఆయా గ్రామాల్లోని హెచ్‌ఎంలు, కళాశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులు తమ పాఠశాలల్లో చదువుకోకున్నా.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు.
జిల్లాలో ఎక్కడా లేనివిధంగా యాచారం మండలంలో అభయ హస్తం ఉపకార వేతనాల్లో అవకతవకలపై ఆగ్రహంగా ఉన్న ఉన్నతాధికారులు తప్పు బయటపడితే చాలు వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలపై విచారణ, పాఠశాలలకు వెళ్లి రికార్డులు పరిశీలించడం కోసం డీఆర్‌డీఏ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఇదే విషయమై స్థానిక ఎంపీడీఓ ఉషను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. అభయ హస్తం ఉపకార వేతనాల అవకతవకలపై ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్న విషయం వాస్తవమేనన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని స్పష్టంచేశారు.
అక్రమార్కులకు చెక్!
Published Sat, Dec 14 2013 11:16 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement