నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ : నిజామాబాద్ నగరంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో అనేక అక్రమాలు జరిగాయని వరంగల్ ఎంపీ రాజయ్య ఆరోపించారు. వీటన్నింటిపైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్వే ల్యాండ్ శాఖలో చైన్‌మన్‌గా పనిచేసే తన బావ కొంగల భాస్కర్‌ను స్కాంలో అక్రమంగా ఇరికించి ఆయన మరణానికి రెవెన్యూ అధికారులు కారణమయ్యారని విమర్శించారు. సారంగపూర్‌లోని జిల్లా జైలులో శుక్రవారం ఇద్దరు ఖైదీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో ఒకరైన భాస్కర్ ఎంపీ రాజయ్యకు బావ అవుతారు.
ఆయన అంత్యక్రియలలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన ఎంపీ మీడియాతో మాట్లాడారు. 2006-07లో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడితే వారిని వదిలిపెట్టి, చిన్న ఉద్యోగి అయిన భాస్కర్‌ను అక్రమంగా కేసులో ఇరికించి జైలుకు పంపారన్నారు. దాంతో ఆయన మానసికంగా కుంగిపోయారని, కోర్టు ఫీజులు చెల్లించలేక పేషీలకు హాజరు కాలేకపోయారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసారని ఆవేదన వక్తం చేశారు. ఇందుకు కారణమైన రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, ఇదే తన దరఖాస్తుగా స్వీకరించాలని అధికారులను కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనికి పరిష్కార మార్గం కనుక్కోవాలన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యతిరేక పార్టీలకు గోరీ కట్టాలి
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పార్టీలకు గోరీ కట్టాలని వరంగల్ ఎంపీ రాజయ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో శుక్రవారం మృతి చెందిన ఇద్దరు ఖైదీలలో ఒకరైన కొంగల భాస్కర్ ఎంపీ రాజయ్యకు స్వయనా బావ అవుతారు. ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు ఎంపీ శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఏనాడో ప్రణబ్‌ముఖర్జీకి లేఖ ఇచ్చామని చె ప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేడు తెలంగాణ వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్షకు పూనుకోవటం శోచనీయమన్నారు. టీడీపీ తెలంగాణలో విశ్వాసం కోల్పోవటంతో చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి కుట్రలు పన్నుతున్నారన్నారు.
ఇళ్ల స్థలాల పంపిణీ అక్రమాలపై న్యాయ విచారణ జరపాలి
Published Sun, Oct 6 2013 5:34 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement