
విశాఖసిటీ: పర్యాటక స్వర్గధామమైన విశాఖలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు కార్యాచరణ దిశగా ముందుకు కదలడం లేదు. పర్యాటక కీర్తిని మరింత ప్రతిబింబించాలన్న ఆరాటం ఆచరణ రూపం ధరించకపోవడంతో ప్రయోజనం కానరావడం లేదు. పర్యటక మణిహారంగా మారుతుందనుకున్న ఐఎన్‌ఎస్ విరాట్ ప్రాజెక్టు తీరానికి ఇప్పట్లో చేరేట్టు కనిపించడం లేదు. ఇటీవల టీయూ– 142 మ్యూజియం ప్రారంభోత్సవంలో పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ విరాట్ ప్రాజెక్టు విశాఖకు వస్తుందని చెప్పినా.. ఎక్కడ, ఎప్పుడనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏడాది దాటినప్పటికీ ప్రభుత్వం ఇంకా.. అడుగులు సాగని దశలో..డీపీఆర్ స్థాయిలో ఉండడంతో విరాట్ మ్యూజియంగా మారుతుందా.. విశాఖకు వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
చల్లారిన ఉత్సాహం
విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్ ప్రాజెక్టుపై మొదట్లో చాలా ఉత్సాహం ఉండేది. కానీ సందర్శకుల ఆశల తీరంలో లంగరేసిన పర్యాటక శాఖ.. కాలయాపన చేస్తోంది. ప్రాథమిక పరిశీలన నివేదిక రూపకల్పనకు ఇటీవల నిధులు కేటాయించినా.. ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ స్థాయిలో ఉండడం మింగుడు పడని అంశంగా మారింది. మ్యూజియంగా మారనున్న యుద్ధ విమాన వాహన నౌక విరాట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఈ నెల ఆరో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. హోటల్, కన్వెన్షన్ సెంటర్, నేవల్ మారిటైమ్ మ్యూజియంతోపాటు వివిధ సౌకర్యాలు కల్పించేలా టూరిజం డెస్టినేషన్‌గా విరాట్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
కొలిక్కి వచ్చేదెప్పుడు?
ప్రపంచంలో అతి పెద్ద విమాన యుద్ధ నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్‌ఎస్ విరాట్ నేవీ సేవల నుంచి 2016 అక్టోబర్‌లో నిష్క్రమించింది. అప్పటి నుంచి దీన్ని మ్యూజియం, స్టార్ హోటల్‌గా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఇంకా డీపీఆర్ స్టేజిలో ఉండటంతో పర్యాటకులు విరాట్ వస్తుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఖరారైన ఏడాది తర్వాత డీపీఆర్ తయారు చేసేందుకు ముంబైకి చెందిన మాస్టర్ అండ్ అసోసియేట్స్ ఆర్కిటెక్టŠస్ ఇంటీరియర్ డిజైనర్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. డీపీఆర్‌తోపాటు పూర్తి ప్రాజెక్టు అంచనా వ్యయం నిర్ధారించేందుకు ప్రొఫెషనల్ ఫీజుగా రూ. 60 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వానికి నివేదిస్తూ.. తొలి విడతగా రూ.31.86 లక్షలు మంజూరు చేయాలని కోరింది. పరిశీలించిన ప్రభుత్వం రూ. 17.70 లక్షలు మంజూరు చేసింది. అదేవిధంగా విరాట్ మరమ్మతుల కోసం నియమించిన చెందిన లీడ్స్ కన్సల్టింగ్, సర్వీసెస్ సంస్థ (గుర్‌గావ్)కు రూ. 2.77 లక్షలు మంజూరు చేసింది. అయితే.. డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుందనే అంశంపై పర్యాటక శాఖ అధికారులకే స్పష్టత లేకపోవడం విడ్డూరం.
ప్రాజెక్టు వ్యయం ఎంత?
కేంద్ర ప్రభుత్వం విరాట్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలంటూ ఈ భారీ నౌకను ఏపీకి అందజేసేందుకు అంగీకరించింది. అప్పటి నుంచి ఈ ఏడాది ప్రథమార్థం వరకు దీనిపై ఎలాంటి చర్చలూ జరగకపోవడంతో, కేంద్ర ప్రభుత్వం, నేవీ అధికారుల నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో.. ప్రాజెక్టు వెనక్కు మళ్లిందని అనుకున్నారు. ఈ సమయంలో మూడు నెలల క్రితం ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక తయారు చేయాలంటూ చెన్నైకి చెందిన నాటెక్స్ మారిటైమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీ టూరిజం అథారిటీ బాధ్యతలు అప్పగించింది. అయితే.. ఈప్రాజెక్టు వ్యయం తొలుత వెయ్యి కోట్ల రూపాయలు అనుకున్నారు. దీనికవసరమయ్యే నిధుల్ని కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. ఎలాంటి స్పందన రాకపోవడంతో.. వ్యయాన్ని 500 నుంచి 700 కోట్ల రూపాయలకు కుదించవచ్చనే అంచనాలకు వచ్చారు. ఇందులో కూడా సగం నిధులు భరించాలని కేంద్రాన్ని కోరినా.. స్పష్టమైన హామీ రాకపోయే సరికి.. ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
స్థల ఎంపికపైనా మల్లగుల్లాలు
విరాట్ మ్యూజియం, స్టార్ హోటల్‌ను ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనే అంశంపైనా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. విరాట్‌ను బెర్తింగ్ చెయ్యకుండా నీళ్లలో ఉంచితే బెర్తింగ్ సమస్య తీరిపోతుందని నేవీ అధికారులు గతంలో సలహా అందించారు. కానీ.. అలా ఉండాలంటే సముద్రంలో కనీసం 30 నుంచి 40 అడుగుల లోతు ఉండాలి. అలా ఉంచితే.. అధిక భారం పడే అవకాశముందని లెక్కగట్టిన సర్కారు.. బెర్తింగ్ వైపు మొగ్గు చూపింది. అయితే.. దాంతో విరాట్‌ను బెర్తింగ్ చేసేందుకు అనువైన ప్రదేశాల్లో విశాఖ తీరంలోని భీమిలి మండలం మూలకుద్దు సరైందిగా గుర్తించారు. అయినా.. దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కనీసం ఈ విషయంపైనైనా... పర్యాటక శాఖ స్పష్టత ఇస్తే.. విశాఖ వాసులు కొంత వరకూ ఆనందపడే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద.. దేశంలో తొలి సబ్‌మెరైన్ మ్యూజియం ఐఎన్‌ఎస్ కురుసుర, ఆసియాలోనే తొలి యుద్ధ విమాన మ్యూజియం టీయూ–142 ప్రాజెక్టులతో పర్యాటక రంగంలో వన్నెలద్దుకున్న విశాఖ.. విరాట్‌తో ప్రపంచస్థాయి మ్యూజియంగా ఖ్యాతి గడించే అవకాశముంది. అయితే అది ఎప్పుడన్నదే ప్రశ్న.
Comments
Please login to add a commentAdd a comment