సాక్షి, హైదరాబాద్: 2014-15 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య సీట్లు, పీజీ డెంటల్ సీట్ల భర్తీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ఏడాది సీట్ల భర్తీ కోసం ఇచ్చిన జీవో నెం.43కు కొన్ని సవరణలు చేస్తూ వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషాలిటీ సీట్ల వారీగా ఈ సారి భర్తీ జరుగుతుంది. ఉదాహరణకు రాష్ట్రవ్యాప్తంగా 150 జనరల్ మెడిసిన్ సీట్లు ఉన్నాయనుకుంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల కేటగిరీలతో పాటు వికలాంగ అభ్యర్థులకు సైతం ముందే సీట్లు రిజర్వ్ చేస్తారు. గతంలో అయితే ప్రతి వంద పాయింట్లను లెక్కేస్తూ అభ్యర్థులకు సీట్లు కేటాయించేవారు. అంతేకాదు గతంలో ఉన్న విధానం ప్రకారం మంచి ర్యాంకులు సాధించిన వారు బాగా ప్రాచుర్యం ఉన్న సీట్లను ఎంచుకునేవారు. దీంతో మెరిట్ విద్యార్థులు సీట్లను పొందేవారు. ఇప్పటి విధానం ప్రకారం ప్రతి స్పెషాలిటీలోనూ ప్రతి కేటగిరీకి చెందిన అభ్యర్థి ఉంటారు. కాగా గతంలో ఇచ్చిన జీవోకు చిన్న సవరణ చేశారు. గతేడాది ఆర్థోపెడిక్ సీట్లు మహిళలకు కేటాయించినప్పుడు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో సీట్లు మిగిలిపోయేవి. ఈ సారి అలా సీట్లు మిగిలిపోతే మిగతా వారికి కేటాయించాలని నిర్ణయించారు. కేటగిరీల వారీగా ముందే సీట్లు కేటాయిస్తే రిజర్వ్‌డ్ అభ్యర్థులకు ఎలాంటి నష్టమూ ఉండదని భావించారు. ఈ ఏడాది సీట్ల భర్తీలో యూనివర్శిటీల వారీగా, కాలేజీల వారీగా పక్కాగా సీట్ల విధానాన్ని అనుసరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
కొత్త విధానం ప్రకారం
మహిళా అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను కేటగిరీల వారీగా జనరల్ అభ్యర్థులకు కేటాయిస్తారు
ఎస్సీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాని పక్షంలో ఆ సీట్లను ఎస్టీలకు కేటాయిస్తారు
ఎస్టీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను ఎస్సీలకు కేటాయిస్తారు
భర్తీకాని ఎస్సీ అభ్యర్థుల సీట్లు ఓసీలకు కేటాయిస్తారు
బీసీ-ఏ సీట్లు భర్తీకాకపోతే బీసీ-బీకి కేటాయిస్తారు
భర్తీ కాని బీసీ-బీ సీట్లను బీసీ-సీకి ఇస్తారు
భర్తీ కాని బీసీ-సీ సీట్లను బీసీ-డీకి కేటాయిస్తారు
భర్తీకాని బీసీ-డీ సీట్లను బీసీ-ఇకి కేటాయిస్తారు
భర్తీకాని బీసీ-ఇ సీట్లను బీసీ-ఏకు కేటాయిస్తారు
భర్తీకాని బీసీ సీట్లను ఓసీలకు కేటాయిస్తారు
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థి ఎవరైనా సీటు పొంది ఆ తర్వాత ఆ సీటును వదులుకుంటే ఆ సీటును ఓసీకి ఇస్తారు
ఓసీ రిజర్వ్‌డ్ (ఉమెన్) సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లను ఓసీ క్యాండిడేట్‌లకు ఇస్తారు
పీజీ వైద్య సీట్ల భర్తీకి మార్గదర్శకాలు
Published Thu, May 22 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement