సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ దారి తప్పిందనే విమర్శలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన అనంతరం జరిగిన పలు ఘటనలతో నిఘా విభాగం అభాసుపాలవుతోంది. నాలుగేళ్లుగా చెలరేగిపో తున్న ఇసుక మాఫియా దగ్గర్నుంచి మన్యంలో మావోయిస్టులు పంజా విసిరే వరకు చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇది ప్రస్ఫుటమవుతోంది. ప్రతి ఘటనను రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టడంతో నిఘావర్గాల నివేదికలు నిజాయితీని కోల్పోతున్నాయని రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కీలక ఘటనలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇంటెలిజెన్స్ నివేదికలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక దందా, బెట్టింగ్ మాఫియా, కాల్‌మనీ సెక్స్ రాకెట్, ఫెర్రీ వద్ద బోటు బోల్తా లాంటి ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటెలిజెన్సీ తీరు ఒకే మాదిరిగా ఉన్నాయనే విమర్శలున్నాయి.
ఇసుక మాఫియాపై చర్యలు లేవు..
పలు జిల్లాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక దందాతో అక్రమార్జనకు పాల్పడ్డారు. దీన్నిఅరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం కాగా అక్రమాలపై నివేదికలు ఇవ్వడంలో ఇంటెలిజెన్స్‌పై ఒత్తిళ్లు పనిచేశాయి. నీరు–మట్టి కార్యక్రమం పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినా నిఘా పట్టించుకోలేదని, సర్కారు చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి.
క్రికెట్ బెట్టింగ్‌లో పెద్దలను కాపాడేలా..
రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం అలసత్వం వహించగా పోలీసుల ప్రమేయంపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక చర్చనీయాంశమైంది. ఇటీవల పోలీసులకు చిక్కిన అంతర్జాయ క్రికెట్ బుకీ కృష్ణసింగ్ వెల్లడించిన విషయాలు అందరినీ కంగు తినిపించాయి. ఐపీఎస్‌ల నుంచి ఎస్సైల వరకు సుమారు రూ.100 కోట్లకు పైగా మామూళ్లు ఇచ్చినట్టు విచారణాలో వెల్లడైందనే ప్రచారం జరుగుతోంది. క్రికెట్ బుకీల నుంచి మామూళ్లు తీసుకున్న వారిలో ఏకంగా 10 మంది ఐపీఎస్‌లు ఉన్నట్లు చెబుతుండడంతో ఇంటెలిజెన్స్ నివేదికల్లో వాస్తవాలు ప్రస్తావించకుండా వారిని తప్పించారనే ఆరోపణలున్నాయి.
మంత్రి కనుసన్నల్లో కాల్‌మనీ సెక్స్‌రాకెట్
ఓ కీలక మంత్రి కనుసన్నల్లో మెలిగే కొందరు కాల్‌మనీ సెక్స్‌రాకెట్ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో అరకొర చర్యలతో సరిపెట్టి టీడీపీ ప్రజాప్రతినిధులు, పలువురు పోలీసులను కాపాడారనే విమర్శలున్నాయి. ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించి ప్రభుత్వం అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలు వచ్చాయి.
బోటు బోల్తా పాపంలో...
క్షేత్రస్థాయిలో లోపాలను నిఘా వ్యవస్థలు నివేదించడం, ప్రభుత్వం వాటిని సరిచేయడం జరగాలి. కానీ ఇవి రెండూ రాష్ట్రంలో సక్రమంగా జరగలేదనే విషయం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో జరిగిన బోటు బోల్తా ఘటన అద్దం పడుతోంది. అనుమతి లేని ప్రైవేట్ బోట్లు ఇష్టానుసారంగా నదిలో తిరుగుతున్నట్లు గుర్తించినా మంత్రుల ప్రమేయం ఉండటంతో అడ్డుకట్ట పడలేదు.
పోలీస్ బదిలీల్లోనూ ‘నిఘా’ ప్రమేయం!
ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసిందనే విమర్శలున్నాయి. నంద్యాల ఉపఎన్నికల సమయంలో అక్కడ మకాం వేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలింగ్ బూత్‌లవారీగా సీఐ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించి ఎస్పీ పర్యవేక్షణలో పూర్తి సమాచారం సేకరించి టీడీపీకి ఓటు బ్యాంకులా మలిచేలా కృషి చేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలు, తటస్తులు, ప్రతిపక్షానికి అనుకూలురైన ఓటర్లపై దృష్టి పెట్టి ఇంటెలిజెన్స్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లు పోలీస్‌శాఖలో బహిరంగ చర్చ జరిగింది. నంద్యాలలో టీడీపీకి వీరవిధేయులుగా పనిచేసిన డీఎస్పీలకు తాజాగా జరిగిన బదిలీల్లో అనుకూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడం పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసు బదిలీల్లోనూ ఇంటెలిజెన్స్ చీఫ్ చక్రం తిప్పుతుండటంతో ఐపీఎస్‌లు సైతం ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
పోలీసు స్టేషన్లపై దాడుల వరకు..
పోలీస్ స్టేషన్లపై బాధితులు దాడి చేసేవరకు పరిస్థితులు చేయిదాటిపోయినా అప్రమత్తం చేయడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది. నిఘా వైఫల్యంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్‌స్టేషన్‌పై బాధితులు దాడులకు దిగారు. ఠాణాలవారీగా పోలీసు అధికారుల తీరును సైతం ఒక కంట కనిపెట్టాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ తునిలో రైలు దగ్ధం, పోలీస్ స్టేషన్‌లకు నిప్పు పెట్టిన ఘటనలపై ముందుగా అప్రమత్తం చేయలేకపోయింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను సవాలు చేసే ఇలాంటి ఘటనలు కోకొల్లలు.
ఆశ్రమంపై జేసీ అనుచరుల దాడి..
అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ప్రబోధానంద ఆశ్రమంపై టీడీపీ ఎంపీ జేసీ అనుచరులు దాడికి దిగిన ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిన వ్యవహారంలోనూ ఇంటెలిజెన్స్ వైఫల్యం ప్రస్పుటమైంది.
మన్యంలో మాటేసినా...
మావోయిస్టుల కదలికలను గుర్తించి అప్రమత్తం చేయాల్సిన ఇంటెలిజెన్స్ పొరుగు రాష్ట్రం రాజకీయాల్లో తలమునకలు కావడంతో మన్యంలో తాజాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బలయ్యారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఏపీలో మావోయిస్టుల కదలికలు లేవనే ధీమా పోలీసులు, ప్రభుత్వంలో నెలకొంది. ఆంధ్రా–ఒడిశా బోర్డర్(ఏవోబీ) సరిహద్దుల్లో మాటేసిన మావోయిస్టులు వారోత్సవాలకు సిద్ధమైనా, బృందాలుగా సంచరిస్తున్నా పసిగట్టడంలో నిఘా విఫలం కావడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఇంటెలిజెన్స్ మాన్యువల్ ఏం చెబుతోంది?
స్టేట్ ఇంటెలిజెన్స్ పరిధిలోని కౌంటర్ ఇంటెలిజెన్సీ (సీఐ), స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్రాంచి(ఎస్‌ఐబీ) విభాగాల నిరంతర అప్రమత్తతే శాంతిభద్రతల్లో కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎస్‌ఐబీ అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. ఉగ్రవాద కార్యకలాపాలు, మతపరమైన తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాద ప్రమాదాలను పసిగట్టి ప్రభుత్వానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగం ప్రజాక్షేత్రంలో ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ప్రజలకు అవి ఏమేరకు చేరువ అవుతున్నాయి? లోపాలు ఏమిటి? నిజమైన లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారెవరు? అనే కోణాల్లో పరిశీలించి సర్కారుకు నివేదించి లోపాలు చక్కదిద్దడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీలకం. మోసాలు, అక్రమాలు, సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను అనుక్షణం గమనిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment